iDreamPost

చేతల్లోనూ.. మాటల్లోనూ దిగజారుడేనా.. అచ్చెన్నా!

చేతల్లోనూ.. మాటల్లోనూ దిగజారుడేనా.. అచ్చెన్నా!

రాజకీయమంటే వ్యక్తిగతం కాదు. సమాజోన్నతికి పాటుపడే ఓ ఉన్నత వ్యవస్థ. భారత రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ మనకిచ్చిన సమున్నత వేదిక. ఈ వేదిక నుంచే ఎన్నికల్లో పోటీ చేయడం, సిద్ధాంత పరమైన చర్చలు, సద్విమర్శలు, సూచనలు చేసుకోవాలన్నది. ఏది చేసినా, ఏ విమర్శ అయినా సమాజానికి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం అంతిమ లక్ష్యం కావాలే తప్ప.. వ్యక్తులపై దాడి, వ్యక్తిత్వ హననం దాని పరమార్థం కాదని.. మన ముందుతరం నేతలు, రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు.

కొన్ని దశాబ్దాల పాటు అవే సిద్ధాంతాలతో పార్టీలు, నేతలు నడుచుకున్నారు. దురదృష్టవశాత్తు ఈ తరానికి చెందిన కొందరు నేతలు ఆ సిద్ధాంతాలకు తిలోదాకాలిస్తున్నారు. విలువల వలువలు ఊడ్చేస్తున్నారు. మాటలు, చేతల్లో అసహనాన్ని, కర్కశత్వాన్ని ప్రదర్శిస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి.

పోయినోళ్లపైనా పిచ్చి ప్రేలాపనలు..

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఒక పెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్న నేత అత్యంత సహనంతో, సంయమనంతో వ్యవహరించాలి. తన మాటలు, చేతలతో క్యాడర్ కు ఆదర్శంగా, మార్గదర్శిగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీలు, నేతలకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు వివేచనతో వ్యవహరించాలి. మాట తులినా, నోరుజారినా అనర్ధాలకు, ఆవేశకావేశాలకు దారితీస్తాయన్న విషయం గుర్తెరిగి మసలుకోవాలి.

Also Read : నోటిదురుసు.. తలబిరుసు..! తప్పుడు కేసులైతే.. అజ్ఞాతవాసమెందుకు కూన..?

కానీ దురదృష్టవశాత్తు అచ్చెన్నాయుడుతో సహా నేటి టీడీపీ నేతల్లో ఆ విచక్షణ లేకుండాపోతోంది. యావత్తు దేశాన్ని కదిలించి.. రాష్ట్రంలో వందలాది ప్రజల గుండెలను స్తంభింపజేసిన వైఎస్సార్ మరణమనే ఒక మహావిషాధాన్ని, ఛిద్రమైన ఆయన దేహాన్ని చూసి తట్టుకోలేక కొన్ని వందల గుండెలు చితికిపోతే.. అచ్చెన్నాయుడుకు మాత్రం అది తందూరీలా కనిపించడం.. ఆయన హృదయ స్పందన ఎలా ఉంటుందో.. మానసికస్థితి ఏమిటో ఇట్టే చెప్పేస్తుంది.

గత సంఘటనలను ప్రస్తావిస్తూ విమర్శలు చేయవచ్చు. కానీ ఇంత దారుణంగా, సంస్కారహీనంగా చేయక్కర్లేదు. కానీ ఆ సభ్యత విచక్షణ అచ్చెన్నగారికి లేవనేది ఆయన మనస్తత్వం, మాటతీరు చూసేవారేవరికైనా అర్థమవుతుంది. అయితే ఇంతకు ముందు వేరు. రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాతైనా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకపోవడమే ఆక్షేపణీయం.

ఆ నేతల విషయంలో అలా మాట్లాడగలరా?

వైఎస్సార్ విషయంలో హద్దు మీరి మాటజారిన అచ్చెన్నాయుడు గతంలో ఇటువంటి దారుణ స్థితిలోనే మృతిచెందిన తమ పార్టీ నేతల విషయంలో ఇలా మాట్లాడగలరా.. ఇంత హీనమైన వర్ణనలు చేయగలరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత సోదరుడైన ఓ మంత్రి గతంలో
వరంగల్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన సతీమణిని రాజకీయాల్లోకి రాకుండా తొక్కేసి ఈ సీనియర్ నేత మంత్రి స్థాయికి ఎదిగారన్న ఆరోపణలు అప్పటినుంచీ ఉన్నాయి.

Also Read : టీడీపీ, లోకేష్‌లపై అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ ఎంపీ అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదానికి గురై ప్రాణాపాయస్థితిలో ఉంటే .. ఓ పత్రిక స్కోరింగ్ కు.. తమ కుటుంబానికి, పార్టీకి సానుభూతి సంపాదించేందుకు ఆ నేతను సదరు పత్రికా విలేఖరి వచ్చి ఫోటోలు తీసుకునేవరకు సుమారు మూడు గంటల సేపు నదిరోడ్డుపైనే ఉంచేశారు. దాంతో కాలాతీతమై శ్రీకాకుళంలోని ఆస్పత్రికి చేరేసరికి సదరు నేత ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

అంతెందుకు టీడీపీ వ్యవస్థాపకుడు, మహానేత ఎన్టీఆర్ తెల్లవారుజామున తుదిశ్వాస విడిస్తే.. మధ్యాహ్నం వరకు పార్టీ, కుటుంబ ఆధిపత్యం కోసం జరిగిన గందరగోళం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలపై ఇంతకుముందు ఎవరూ.. ఇప్పుడు అచ్చెన్న ఆరోపించినంత దారుణంగా స్పందించలేదు. కారణం సభ్యత, సంస్కారాలే. ఇవి లోపిస్తే నేతలుగానే కాదు.. వ్యక్తులుగాను పతనమైపోతామన్న విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలి.

Also Read : ఇంత అహమేలా లోకేష్..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి