iDreamPost

నిమ్మగడ్డ సమావేశం.. ఊహించిందే జరిగింది..

నిమ్మగడ్డ సమావేశం.. ఊహించిందే జరిగింది..

ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నిర్వహించిన సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు అభిప్రాయాలు అందరూ ఊహించిన విధంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 18 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆహ్వానం పంపారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే హైకోర్టులో తన అభిప్రాయాన్ని అఫిడవిట్‌ రూపంలో చెప్పిన అధికార పార్టీ వైసీపీ.. ఈ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేసింది. వైసీపీ మినహా మిగతా ప్రధాన పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యాయి.

అన్ని ప్రధాన పార్టీల అభిప్రాయాలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. ఇప్పటి వరకూ టీడీపీ, బీజేపీ, బీఎస్సీ పార్టీలు తమ అభిప్రాయాలను కమిషనర్‌కు తెలియజేశాయి. టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంమని అచ్చెం నాయుడు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి చేపట్టాలని, ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించాలని, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని అచ్చెం నాయుడు కోరారు. బీజేపీ, బీఎస్పీ పార్టీలు కూడా కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోరాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నాయి.

ఎస్‌ఈసీ.. సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు ఇంకా తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. ఆయా పార్టీలలో మెజారిటీ శాతం ఎన్నికలు నిర్వహణకే మొగ్గు చూపే అవకాశం ఉంది. సాయంత్రం కల్లా అన్ని సమావేశం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. రాజకీయ పార్టీలు చెప్పిన అభిప్రాయాలను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. అఫిడవిట్‌ రూపంలో హైకోర్టులో దాఖలు చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి