iDreamPost

ప్రిన్స్ కు నచ్చినది కొందరే మెచ్చారు – Nostalgia

ప్రిన్స్ కు నచ్చినది కొందరే మెచ్చారు – Nostalgia

కౌబాయ్ సంస్కృతి మనది కాదు. హాలీవుడ్ నుంచి మెకానాస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అండ్ ఆగ్లీ లాంటి సినిమాలు వచ్చినప్పుడు మన ప్రేక్షకులు వాటిని సంభ్రమాశ్చర్యాలతో చూసి ఇంగ్లీష్ రానివాళ్లు సైతం వాటికి ఘనవిజయం అందించారు. 1971లో సూపర్ స్టార్ కృష్ణ ఈ కల్చర్ ని ‘మోసగాళ్లకు మోసగాడు’తో టాలీవుడ్ కు తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా దాని గురించి మాట్లాడుకున్నారు. అసలు మనకు అలవాటే లేని ఈ బ్యాక్ డ్రాప్ ని తెరమీద ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన వసూళ్లు దక్కాయి. ఆ తర్వాత కూడా కృష్ణ ఇదే జానర్ లో ఇంకొన్ని సినిమాలు చేశారు కానీ అవేవి మొదటిదానికి సాటిరాలేకపోయాయి. అదో కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది.

ఆపై భానుచందర్, అర్జున్, సుమన్ లాంటి వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. 1990లో చిరంజీవి చేసిన ‘కొదమసింహం’ సైతం యావరేజ్ గానే నిలిచినప్పటికీ మిగిలినవాటితో పోలిస్తే కమర్షియల్ గా కంటెంట్ పరంగా సక్సెస్ అందుకుంది. అదే సంవత్సరం గిరిబాబు తన కొడుకు బోసుబాబుతో తీసిన కౌబాయ్ మూవీ ‘ఇంద్రజిత్’ ఆశించిన విజయ అందుకోలేదు. కట్ చేస్తే దాని తర్వాత ఎవరూ ఇలాంటి సాహసాలు చేయలేకపోయారు. తిరిగి 2002లో మహేష్ బాబు దానికి పూనుకోవడం అభిమానులను ప్రకటనతోనే ఎగ్జైట్ చేసిన మాట వాస్తవం. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించారు.

టక్కరి దొంగని చాలా క్రేజీ కాంబోస్ తో తీసిన మాట వాస్తవం. లీసారే, బిపాసబసు లాంటి బాలీవుడ్ బ్యూటీస్, మణిశర్మ అద్భుతమైన పాటలు, తెలుగు తెరపై ఎన్నడూ చూడని కొలరాడో లొకేషన్లు, మంచినీళ్లలా ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల బడ్జెట్ వెరసి నిర్మాణంలో ఉండగానే భారీ బిజినెస్ చేసుకుందీ సినిమా. అయితే ఇలాంటి సినిమాల్లో హై గ్రిప్పింగ్ గా ఉండాల్సిన కథనం ఫస్ట్ హాఫ్ లో అవసరం లేని హీరోయిన్ల ట్రాకుల కోసం వృథా చేయడంతో అంతగా సింక్ కాలేదు. దానికి తోడు ఉద్వేగపరిచే సీట్ ఎడ్జ్ ఎపిసోడ్స్ ఒకటి రెండు మినహా పెద్దగా లేకపోవడంతో టక్కరి దొంగ అంచనాలను అందుకోలేకపోయింది. 2002 జనవరి 12న రిలీజైన ఈ మూవీ తన రేంజ్ ని చేరుకోలేదు కానీ మహేష్ డేరింగ్ అటెంప్ట్ అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది

Also Read : కెప్టెనే ఇంటి పేరుగా మార్చిన సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి