iDreamPost

భయపడ్డ సూర్య – సినిమా డ్రాప్

భయపడ్డ సూర్య – సినిమా డ్రాప్

కెరీర్ ప్రారంభంలో ఎంత తమకు బ్రేక్ ఇచ్చిన దర్శకులైనా సరే వాళ్ళు ఫామ్ లో లేనప్పుడు హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఖైదీ తీశారనే అభిమానంతో కోదండరామిరెడ్డితో చిరంజీవి ఇప్పుడు రిస్క్ చేయలేరుగా. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ హిట్ ఇచ్చిన బి గోపాల్ తో చేద్దామంటే బాలకృష్ణ ముందుకు రాలేరు. శివ తీసిన కృతజ్ఞతతో రామ్ గోపాల్ వర్మకు నాగార్జున ఆఫీసర్ ఛాన్స్ ఇస్తే ఏమయ్యిందో బాక్సాఫీస్ రిజల్ట్ చూశాం. అచ్చం ఇప్పుడలాంటి పరిస్థితి తమిళ స్టార్ హీరో సూర్యకు వచ్చి పడింది. కాకపోతే నష్టమైనా సరే తొందపడకుండా మంచి నిర్ణయం తీసుకున్నాడు.

బాలా దర్శకత్వంలో సూర్య తన స్వంత టూడి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఒక కొత్త సినిమా ఆ మధ్య అఫీషియల్ గానే ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లకుండానే దాన్ని డ్రాప్ చేసేశారు. అనుకున్న విధంగా ఫైనల్ వెర్షన్ రాకపోవడంతో పాటు బడ్జెట్ పరంగా బాలా అడుగుతున్న మొత్తం చాలా ఎక్కువగా ఉండటంతో ప్రాక్టికల్ గా ఆలోచించిన సూర్య చివరికి నో చెప్పేశారట. దీంతో ఇది కాస్తా అటకెక్కిపోయింది. సూర్యకు పెర్ఫార్మన్స్ పరంగా అతి పెద్ద బ్రేక్ ఇచ్చింది బాలానే. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన నంద, శివపుత్రుడు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ అండ్ కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి.

కానీ ఇప్పుడు బాలాలో మునుపటి మేజిక్ లేదు. అర్జున్ రెడ్డి రీమేక్ వర్మని తీశాక అది విక్రమ్ నచ్చక మొత్తం వేరే దర్శకుడితో రీ షూట్ చేయించారు. అంతకు ముందు వచ్చిన నేనే దేవుణ్ణి, పరదేశి, వాడు వీడులో సహజత్వం పేరుతో బాలా చేసిన అతిని సాధారణ ప్రేక్షకులు భరించలేకపోయారు. మరీ ఊర నాటుగా వయొలెన్స్ ని చూపించే విధానం ఆయన్ను మాస్ కి సైతం దూరం చేసింది. అలాంటప్పుడు కోట్ల రూపాయల బడ్జెట్ ని బాలా చేతిలో పెట్టడం సాహసమే అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ పరిణామాలు బాలాకు అవమానమే. స్వంతంగా ఆయనే నిర్మాతగా మారి ప్రూవ్ చేసుకోవడం బెటర్. లేదంటే ఈ మచ్చలు ఇలాగే ఉండిపోతాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి