iDreamPost

1921 నంబర్‌ కాల్‌ ఎత్తండి…బాధ్యత నెరవేర్చండి…!

1921 నంబర్‌ కాల్‌ ఎత్తండి…బాధ్యత నెరవేర్చండి…!

ఫోన్‌లో 1921 నంబర్‌ నుంచి కాలొస్తుందా మరేం భయం లేదు ఎత్తండి… వాళ్లడిగే ప్రశ్నలకు(ఆరోగ్య సంబంధిత) సమాధానాలు చెప్పండి. తద్వారా కోరానపై దేశం చేస్తున్న పోరాటంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి…! దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రాబల్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ టెలిఫోనిక్‌ సర్వే నిర్వహించనుంది. ఇందులో భాగంగా 1921 నుంచి ప్రజలకు కాల్స్‌ చేయనున్నట్లు హెల్త్‌ మినిస్ట్రీ మంగళవారం ప్రకటించింది.

ఎందుకీ సర్వే….

దేశంలో లాక్‌డౌన్‌ విధించి నెల రోజులవుతోంది. కానీ, కరోనా ఓ పట్టాన తగ్గుముఖం పట్టట్లేదు. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. పైగా వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందనే వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో సమాజిక, ర్యాండమ్‌ టెస్టులు చేపట్టాలనే వాదన తెరపైకి వస్తోంది. కానీ, భారత్‌లో జనాభా 135 కోట్లకు పై చిలుకే..! ఇంత పెద్ద సంఖ్యలో జనాభాకు కరోనా టెస్టులు నిర్వహించడం కష్టంతో కూడుకున్న పని. దీంతో వైరస్‌ను వ్యాప్తిని, లక్షణాలను అంచనా వేసేందుకు జాతీయ సమాచార కేంద్రం(ఎన్‌ఐసీ) టెలిఫోనిక్‌ సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

కేంద్ర, రాష్ట్రాల లెక్కల్లో తేడాలు

కరోనా కేసుల సంఖ్య, మరణాల్లో రాష్ట్రాల సంఖ్యకు, కేంద్రం లెక్కలకు తేడా కనిపిస్తోంది. రాష్ట్రాలు సంఖ్య కంటే కేంద్రం సంఖ్య కాస్త తక్కువగా ఉంటోంది. ఇది కూడా సర్వే చేపట్టేందుకు ఓ కారణంగా ఉంది. పైగా ప్రస్తుత విధానంలో గొంతు, ముక్కుల ద్వారా సేకరించిన నమూనాలను పరీక్షించి కరోనా కేసులను నిర్ధారిస్తున్నారు. ఈ ప్రక్రియకు కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. దీంతో త్వరితగతిన టెస్టులు నిర్వహించాలనే ఉద్దేశంతో ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల ద్వారా అరగంటలో కేసుల నిర్ధారణకు కేంద్రం, రాష్ట్రాలు పూనుకున్నాయి. కానీ, చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల నాణ్యతా లోపంతో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అందుబాటులోని అన్ని అవకాశాలను వినియోగించే చర్యల్లో భాగంగా కేంద్రం 1921 నంబర్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ సర్వేకు సిద్ధమైంది.

1921 అయితేనే ఎత్తండి….

కరోనా సమయంలో సైబర్‌ నేరగాళ్లు కూడా తమ వాటం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సైతం ప్రజలకు ఓ విజ్ఞప్తి చేసింది. కేవలం 1921 నంబర్‌ నుంచి వచ్చే కాల్స్‌నే ఎత్తి…సమాధానాలు చెప్పమని కోరింది. ఇతర ఏ నంబర్‌ నుంచి వివరాలు అడిగినా చెప్పొద్దని సూచించింది. అలాగే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంత మంది ప్రాంక్‌ కాల్స్‌ చేసే అవకాశం ఉందని…వీటిపై గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.

కాబట్టి మనకు 1921 నంబర్‌ నుంచి కాల్‌ వస్తే లిఫ్ట్‌ చేసి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాదాము…దేశ రక్షణ, సేవల్లో మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాము…!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి