iDreamPost

“మోస‌గాళ్ల‌కి మోస‌గాడు”కి 50 ఏళ్లు

“మోస‌గాళ్ల‌కి మోస‌గాడు”కి 50 ఏళ్లు

50 ఏళ్ల క్రితం ఒక 8 ఏళ్ల పిల్ల‌వాడు మొద‌టిసారి పెద్ద‌వాళ్లు తోడు లేకుండా సినిమా చూశాడు. ఆ సినిమా ఇప్ప‌టికీ కొత్త‌గానే ఉంది. పిల్లోడు పెద్దోడై పోయాడు. ఆ సినిమా మోస‌గాళ్ల‌కి మోస‌గాడు. పిల్లోడు నేనే.

1971 రాయ‌దుర్గం. ఒక రోజు ఉద‌యం కొంత‌మంది పెద్ద పిల్ల‌లు (13 ఏళ్ల వాళ్లు) ఒక స్కెచ్ వేశారు. గుట్టు చ‌ప్పుడు కాకుండా మ్యాట్నీకి (3 గంట‌ల షో) మోస‌గాళ్ల‌కి మోస‌గాడు వెళ్లాల‌ని. ఆ ర‌హ‌స్యంలో నేనూ భాగ‌స్వామి కావ‌డం వ‌ల్ల లీక్ కాకుండా వుండేం దుకు న‌న్నూ తీసుకెళ్లాల‌ని ప్ర‌తిపాదించారు. కొంద‌రు వ్య‌తిరేకించారు. నేను మ‌రీ బ‌చ్చాగాన్న‌ని, ఏడిస్తే ఇరుక్కుపోతామ‌ని భ‌య‌పెట్టారు. బుద్ధిగా సినిమా చూస్తాన‌ని గ్యారెంటీ ఇచ్చాను.

ఎండ‌లో, దుమ్ములో న‌డుస్తూ ప్యాలెస్ థియేట‌ర్ చేరుకున్నాం. అక్క‌డ జ‌నాన్ని చూసి భ‌య‌మేసింది. బ్లాక్ న‌డుస్తోంది. 40 పైస‌ల టికెట్‌ని 45 పైస‌లకి అమ్ముతున్నారు. మా వాళ్లు బ్లాక్‌లో కొని , చెయ్యి ప‌ట్టుకుని లాక్కెళ్లారు. లోప‌ల ఎవ‌డి మీద ఎవ‌డు కూచున్నాడో తెలియ‌దు. బీడీల కంపు.

ఇంట్లో వాళ్ల వెంట బెంచీ, బాల్క‌నీ అల‌వాటు. నేల అంత నికృష్టంగా ఉంటుంద‌ని తెలియ‌దు. లాక్కెళ్లి సందు చూసి ఇద్ద‌రి మ‌నుషుల మ‌ధ్య ఇరికించారు. ఇంటికెళ్లి పోతానంటే తంతార‌ని భ‌య‌ప‌డ్డా. లైట్లు ఆఫ్‌ చేసిన త‌ర్వాత ఏడుద్దామ‌నుకున్నా. ఈ లోగా స్క్రీన్ మీద రంగుల్లో కృష్ణ క‌న‌ప‌డ్డాడు. ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియ‌దు.

పెద్దాడ‌య్యాకా గుర్రాన్ని ఎక్కి నిధి వేట‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాను. సినిమా క‌థ‌ని శ్రీ‌ధ‌ర్ అనే మిత్రుడికి చెప్పాల‌ని గుర్రంలా ప‌రిగెత్తాను. నేనేం చెప్పానో వాడేం విన్నాడో గుర్తు లేదు. శ్రీ‌ధ‌ర్ ఈ మ‌ధ్య రిటైర్డ్ అయి కూతురి పెళ్లి కూడా చేశాడు. 50 ఏళ్లు గుర్రంలా ప‌రిగెత్తాయి. పెద్దాన్ని అయ్యాను కానీ, గుర్రాన్ని ఎక్కింది లేదు. నిధి దొరికిందీ లేదు.

ఈ 50 ఏళ్ల‌లో చాలాసార్లు ఈ సినిమా చూశాను. చూస్తూ చూస్తూ పిల్ల‌వాడిగా మారిపోతా. ఈ రోజు కూడా యూట్యూబ్‌లో చూశా. కృష్ణ త‌న్న‌క‌పోయినా రౌడీలు గాలిలో ప‌ల్టీలు కొడ్తుంటారు. తుపాకీ కాల్చ‌క ముందే సౌండ్ వ‌స్తూ వుంటుంది. ముదురు రంగుల బ‌ట్ట‌ల్లో కృష్ణ భ‌లే గ‌మ్మ‌త్తుగా వుంటాడు. కృష్ణ, స‌త్యనారాయ‌ణ, నేప‌థ్య గాయ‌ని సుశీల‌మ్మ , ఎల్ఆర్ ఈశ్వ‌రి కాకుండా ఈ సినిమాకి ప‌ని చేసిన వాళ్లు చాలా మంది వెళ్లిపోయారు.

ఇప్పుడు చూసినా ప్ర‌తి సీన్ రిచ్‌గా వుంటుంది. VSR స్వామి ఫొటోగ్ర‌ఫీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఫ‌స్ట్ ఫైట్‌లో న‌ది గ‌ల‌గ‌ల‌లు, విజ‌య‌నిర్మ‌ల నీళ్లు తెచ్చే రాజ‌స్థాన్ కోనేరు , ఎడారి సీన్స్ , ఎర్ర‌కొండ‌ల మ‌ధ్య క్లైమాక్స్ ఇవ‌న్నీ 50 ఏళ్ల క్రితం పెద్ద కెమెరాలు మోస్తూ ఎలా తీశారో అనిపిస్తుంది.

అన్నిటికంటే నాకు చిన్న‌ప్పుడు న‌చ్చిన సీన్ నాగ‌భూష‌ణం విందు భోజ‌నం. టేబుల్ నిండా తందూరి చికెన్‌, కోడిగుడ్డు చూసి నోరు వూరింది. ఆ రోజుల్లో చాలా అపురూపం మాకు. కోడి గుడ్లు దొరికేవి కావు. జ్వ‌రం వ‌చ్చి కోలుకుంటున్న‌ప్పుడు మాత్ర‌మే తినేవాళ్లం. అది కూడా కోళ్లు పెంచేవాళ్ల ద‌గ్గ‌రికెళ్లి బ‌తిమ‌లాడితే అమ్మేవాళ్లు. ఫ్రీ మార్కెట్ లేదు.

ఇక చికెన్ తినాలంటే అదో పెద్ద క‌థ‌. ఊరి బ‌య‌ట ఉన్న తోట‌ల వాళ్ల ద‌గ్గ‌రికెళితే విప‌రీత‌మైన రేటు చెప్పేవాళ్లు. గీచిగీచి బేరం ఆడి తెస్తే దాన్ని కోయ‌డం, పుల్ల‌ల‌తో మంట వేసి కాల్చ‌డం. ఇదంతా అయ్యాకే బ‌కెట్ పులుసుతో వండేవాళ్లు. ముక్క‌లు వెతుక్కోవాలి.

తందూరి చికెన్ అనేది ఒక‌టి వుంటుంద‌ని సినిమాల వ‌ల్లే తెలుసు. దాన్ని తిన‌డానికి 25 ఏళ్లు Wait చేయాల్సి వ‌చ్చింది. బాగా తిండి పెట్టి అది క‌క్కే వ‌ర‌కూ నాగ‌భూష‌ణాన్ని త‌న్న‌డం న‌చ్చ‌లేదు. బ‌హుశా మ‌ర్యాద‌స్తుల స్టైల్ అది. ఎవ‌డైనా మ‌న‌ల్ని ఊరికే మేపాడంటే , త‌ర్వాత మ‌న‌ల్ని కోసుకుతింటాడ‌ని మెల్లిగా జీవితం నేర్పించింది.

కొన్ని సినిమాలు ఎన్నేళ్లైనా బ‌తికే వుంటాయి. మ‌నుషులే వుండ‌రు.

(ఆగ‌స్టు 27, 1971 మోస‌గాళ్ల‌కి మోస‌గాడు రిలీజ్‌)

Also Read: కులం కోణంలో శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి