iDreamPost

బాలయ్య VS రజినీకాంత్ తప్పేలా లేదు

బాలయ్య VS రజినీకాంత్ తప్పేలా లేదు

థియేటర్లలో పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయి. రేపో ఎల్లుండో ఏపిలో వంద శాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోల అనుమతులు రాబోతున్నాయని తెలిసింది. సెకండ్ లాక్ డౌన్ ఎత్తేసి రెండున్నర నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా భారీ చిత్రమేది రాలేదు. లవ్ స్టోరీ వసూళ్లు గట్టిగా వచ్చాయి కానీ అది మీడియం రేంజ్ కిందికే వస్తుంది. సీటిమార్ సైతం అదే క్యాటగిరీలో వేయాల్సిందే. అందుకే మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డులతో కిక్కిరిసిపోయే రద్దీ తెచ్చే హీరో కోసం ట్రేడ్ ఎదురు చూస్తోంది. ఎప్పుడో ఏప్రిల్ లో వచ్చిన వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ ఆ సీన్ కనిపించలేదు. ముఖ్యంగా మాస్ వర్గం మహా ఆకలి మీద ఉంది. వాళ్ళ కోసం అగ్రహీరోలు క్యూ కట్టబోతున్నారు.

నవంబర్ దీపావళి పండగ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. 4వ తేదీ రావడం దాదాపు ఖాయమే. తమిళనాడులో ఆ సమయానికి ఎలాంటి నిబంధనలు ఉన్నా రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్ణయించుకున్నట్టు చెన్నై టాక్. నిన్నటి దాకా తెలుగు వెర్షన్ తాలూకు అయోమయం కొనసాగింది కానీ తాజాగా సురేష్ సంస్థ 12 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలిసింది. రజిని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ మార్కెట్ దృష్ట్యా అంతకన్నా ఎక్కువ తలైవా మీద పెట్టుబడికి పంపిణీదారులు సిద్ధంగా లేరు. అందుకే ఈసారి రాజీ తప్పలేదని తెలిసింది.

ఇక్కడితో కథ అయిపోలేదు. బాలకృష్ణ బోయపాటి శీను హ్యాట్రిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండను కూడా నవంబర్ 4 విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఈ చర్చలైతే నడుస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే అన్నాతేకు గట్టి పోటీ ఉంటుంది. రజిని సినిమాలకు ఒకప్పటి బాషా, నరసింహ ఓపెనింగ్స్ రావడం లేదు. టాక్ కీలకంగా మారుతోంది. ఒకవేళ సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ డబ్బింగ్ స్ట్రెయిట్ అనే తేడాలు ఎలాగూ చూడరు. అటువైపు అఖండ కూడా మెప్పించేలా ఉంటే మంచి రసవత్తరమైన ఎంటర్ టైన్మెంట్ చూడొచ్చు. వేచి చూద్దాం. ఈ ఇద్దరి క్లాష్ గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు-పేటలకు జరిగింది కానీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎవరికీ దక్కలేదు

Also Read : మెగా మూవీకి బ్రిట్నీ స్పియర్స్ గాత్రం ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి