iDreamPost

నవ్వులు పూయించిన 6 దొంగలు – Nostalgia

నవ్వులు పూయించిన 6 దొంగలు – Nostalgia

ఇప్పుడంటే సినిమాల్లో కామెడీ ఒక భాగంగా ఉంటోంది కానీ హాస్యాన్నే ఆధారంగా చేసుకుని అప్పట్లో చాలా సినిమాలు రూపొందేవి. రాజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్ర మోహన్ లాంటి వాళ్ళు ఈ జానర్ వల్లే స్టార్ల స్థాయికి ఎదిగారు. అందులోనూ కుటుంబం మొత్తం హాయిగా నవ్వుకునే చిత్రాలే ఎక్కువగా చేసేవారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అండదండలు పుష్కలంగా ఉండేవి. జంధ్యాల గారి తర్వాత ఆయనకు తగ్గ శిష్యుడిగా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్న ఈవివి సత్యనారాయణ గారు మన మధ్య లేకపోయినా రూపొందించిన సినిమాల ద్వారా ఎప్పుడూ సజీవంగానే ఉంటారు.

ఆయన సినిమాల టాప్ 10 లిస్టు వేసుకుంటే అందులో ఖచ్చితంగా చోటు దక్కించుకునే చిత్రం ఆలీబాబా అరడజను దొంగలు. 1994లో విడుదలైన ఈ మూవీలో అప్పటి టాలీవుడ్ లోని ప్రముఖు కమెడియన్లందరూ నటించడం విశేషం. పిరికివాడైన ఓ పోలీసుకు, ఎవరికీ హానీ కలిగించకుండా డబ్బు కోసం దొంగతనాలు చేసే ఆరుగురు సరదా దొంగలకు మధ్య జరిగే కథగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో దీన్ని ఈవివి రూపొందించారు. పోలీస్ గా రాజేంద్ర ప్రసాద్, 6 దొంగలుగా కోట శ్రీనివాసరావు, మల్లికార్జున్ రావు, బ్రహ్మానందం, ఆలి, రాళ్ళపల్లి, చిడతల అప్పారావులు మాములు కామెడీ పండించలేదు. తమిళ నటుడు విశ్వనాధన్ చేసిన సీరియస్ విలనీ కూడా ఇందులో నవ్వు పుట్టిస్తుంది. 

వీళ్ళే కాకుండా నిర్మలమ్మ, ధం, కైకాల సత్యనారాయణ, గిరిబాబు, ఐరన్ లెగ్ శాస్త్రి, తిరుపతి ప్రకాష్, సిల్క్ స్మిత ఒకరేమిటి అందరూ ఈ హాస్య సాగరంలో భాగం పంచుకున్నవాళ్ళే. క్లైమాక్స్ ని అప్పటి హిట్ సినిమాల పేరడీలతో డిజైన్ చేసిన స్కిట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. పెళ్లి సందడితో హీరొయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రవళికి దానికన్నా ముందు దక్కిన సూపర్ హిట్ మూవీ ఇదే. శ్రికన్య మరో హీరొయిన్ గా చేసింది. ఇంత అల్లరిలోనూ మంచి హుషారైన పాటలు ఇచ్చారు సంగీత దర్శకులు విద్యాసాగర్. మరుధూరి రాజా సంబాషణలు కూడా విజయానికి చాలా దోహదపడ్డాయి. డైరెక్టర్ గా ఈవివి గారు భీభత్సమైన ఫాంలో ఉన్నప్పుడు హలో బ్రదర్ తర్వాత చేసిన సినిమాగా ఆలీబాబా అరడజను దొంగలు ఇప్పటికీ బెస్ట్ టైంపాస్ మూవీగా చెప్పుకోవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి