iDreamPost

పావలా కోడికి.. ముప్పావలా మసాలా..

పావలా కోడికి.. ముప్పావలా మసాలా..

పావలా కోడికి.. ముప్పావలా మసాలా అనే సామెత మాదిరిగా ఉంది తిరుపతిలో తెలుగుదేశం పార్టీ రాయి రాజకీయం. నిన్న తిరుపతిలో చంద్రబాబు ప్రశంగిస్తుండగా.. ఎవరో రాయి జనాలపైకి విసిరారంటూ మొదలైన రాజకీయం.. ఢిల్లీకి చేరింది. అసలు ఆ రాయి జనాలపైకి ఎవరు వేశారు..? ఎవరికి గాయమైంది..? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలు ఆ రాయి వేశారో..? లేదో…? గానీ చంద్రబాబు ప్రశంగిస్తున్న సమయంలో.. రాయి వేశారంటూ రోడ్‌షోలో ఉన్న తమ్ముళ్లు కేకలు వేశారు. ఆ రాయి ఇలా ఇవ్వడంటూ తీసుకున్న చంద్రబాబు.. దానిని చూపిస్తూ.. తోలు తీస్తా,. తాట తీస్తా.. ఖబడ్దార్‌ అంటూ సవాళ్లు చేశారు. గుండాల రాజ్యం డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. అంతటితో ఆగకుండా.. రోడ్డుపై భైటాయించి హల్‌చల్‌ చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఏదో జరిగిపోతోందనే స్థాయిలో బ్రీఫింగ్‌ ఇచ్చారు.

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికే అంచనాకు వచ్చిన టీడీపీ.. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకుని తన స్థానంలోకి వద్దామనుకుంటున్న బీజేపీకి చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రాయి రాజకీయానికి తెర తీసిందనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన విమర్శలు, చూపిన రాయిపై పోలీసులు దర్యాప్తు జరుగుతుండగానే.. ఈ అంశంపై టీడీపీ హడావుడి చేయడం మొదలు పెట్టింది. నిన్న రాత్రి ఘటన జరిగిన తర్వాత గవర్నర్‌కు లేఖ రాసిన చంద్రబాబు.. ఈ రోజు తన పార్టీ నేతలను గవర్నర్‌ వద్దకు పంపారు.

Also Read : ఉగాది పర్వదినాన.. జమ్మలమడుగు అధికార పార్టీలో స్నేహరాగం

ఈ రోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాయి దాడి జరిగిందనే ఘటనను సాకుగా చూపి కేంద్రబలగాల ఆధ్వర్యంలో ఉప ఎన్నిక పోలింగ్‌ను నిర్వహించాలనే వినతిని కేంద్ర ఎన్నికల సంఘం ముందు పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.

అసలు నిజానిజాలు తేలకుండానే హడావుడి చేయడం బాబుకు ఇది కొత్తేమీ కాదు. ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని అధికార పార్టీకి ఆపాదిస్తూ.. విమర్శలు చేయడం చంద్రబాబుకు పరిపాటి. ఇటీవల కుప్పంలో దేవాలయంలో జరిగిన ఘటనపై హడావుడి చేసిన దాన్ని అధికార పార్టీకి ఆపాదించారు. సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. అయితే రెండు రోజులకే అసలు నిందితులెవరో.. ఈ ఘటనకు కారణం ఏమిటో బయటపెట్టారు. ప్రజలను తప్పుదోవపట్టించేలా, పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించిన చంద్రబాబుకు.. చిత్తూరు ఎస్పీ క్లాస్‌ పీకారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలంటూ హితవుపలికారు.

ఇపుడు రాయితో దాడి చేశారంటూ చేస్తున్న విమర్శల వెనుక నిజానిజాలు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఇంతలోనే చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో రాయి రాజకీయం చేయడం.. ఆదిలో పేర్కొన్నట్లు పావలా కోడికి ముప్పావలా మసాలా సామెతను గుర్తుచేయక మానదు.

Also Read : రాళ్ల దాడా.. టీడీపీ అద్భుత సృష్టా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి