iDreamPost

స్టార్లు దర్శకులైతే – డైరెక్టర్లు హీరోలైతే – Nostalgia

స్టార్లు దర్శకులైతే – డైరెక్టర్లు హీరోలైతే – Nostalgia

సాధారణంగా హీరోలు దర్శకులు కావడం చూసాం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు చరిత్రలో నిలిచిపోయే దానవీర శూరకర్ణ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు నభూతో నభవిష్యత్ అనే రీతిలో రూపొందించారు. నటశేఖర్ కృష్ణ సింహాసనం లాంటి హై బడ్జెట్ మూవీని కొడుకు దిద్దిన కాపురం లాంటి కమర్షియల్ హిట్స్ ని అందించడం సినిమా ప్రేమికులెవరూ మర్చిపోలేదు.

పవన్ కళ్యాణ్ సైతం జానీతో ఈ ఫీట్ చేశాడు కాని అది ఫెయిలయ్యింది. ఒకవేళ జాని హిట్ అయ్యుంటే మరిన్ని సినిమాలు వచ్చేవేమో కాని ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. హీరొయిన్ గా ఉన్న విజయనిర్మల గారు ఆ తర్వాత డైరెక్టర్ గా మారి అద్భుత విజయాలు అందుకున్నారు. జీవిత కూడా పర్వాలేదు అనిపించుకున్నారు. భాగ్యరాజా సైతం హీరోగా దర్శకుడిగా డ్యూయల్ రోల్ చేస్తూ సక్సెస్ అయ్యారు. ఇవన్ని హీరో హీరొయిన్లు దర్శకులైన ఉదంతాలు. కాని దర్శకులు హీరోలు కావడం అన్నది అరుదుగా జరుగుతుంటుంది.

ప్రత్యేకంగా ప్రస్తావించాలంటే 90వ దశకంలో తనదైన మార్కు కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఎస్వి కృష్ణారెడ్డి హీరోగా ఉగాది, అభిషేకం రెండు సినిమాలు చేశారు. మ్యూజికల్ గా జనం రిసీవ్ చేసుకున్నారు కాని కంటెంట్ పరంగా అవి డిజాస్టర్స్ గానే నిలిచాయి. ఆ తర్వాత మళ్ళి హీరోగా ఇంకో సినిమా సాహసించలేదు. జంధ్యాల, కె విశ్వనాథ్ గార్లు యాక్టర్లుగా మెప్పించారు కాని వాళ్ళు హీరో ఆలోచనలు ఏనాడూ చేయలేదు.

దాసరి గారు సైతం ప్రధాన పాత్రల్లో సినిమాలు చేశారు కాని సోలో హీరోగా ఆయనకు దక్కిన కమర్షియల్ సక్సెస్ లు చాలా తక్కువ. ఆ మధ్య వివి వినాయక్ హీరోగా శీనయ్య మొదలుపెట్టిన దిల్ రాజు దాన్ని అర్ధంతరంగా ఆపేశారనే టాక్ జోరుగా ఉంది. దానికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రకంగా చూస్తే హీరోలు దర్శకులుగా మారి గొప్ప విజయాలు అందుకున్నారు కాని దర్శకులు హీరోలుగా మారి కొట్టిన ఘనమైన హిట్లైతే లేవు. ఇవేనేమో సినిమా విచిత్రాలంటే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి