iDreamPost

త్రిశంకు స్వర్గంలో 4 హీరోలు

త్రిశంకు స్వర్గంలో 4 హీరోలు

కరోనా మహమ్మారి తాలూకు సెగలు వివిధ రూపాల్లో అందరికి తగులుతూనే ఉన్నాయి. ఎప్పటికి పరిస్థితి కుదుటపడుతుందో ఆ దేవుడికైనా తెలుసో లేదో అన్నంతగా పరిణామాలు అంతకంతా దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కూడా దీనికి మినహాయింపుగా నిలవలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాల వల్ల దాదాపు అన్ని దేశాలు తమ సరిహద్దులను మూసివేసి విమానాలు షెడ్ లో పెట్టేశాయి. ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ముక్తి కలుగుతుందో ఎవరికి తెలియదు. దీని వల్ల తెలుగులో కొన్ని భారీ స్టార్ల సినిమాలు అటు ఇటు కానీ త్రిశంకు స్వర్గంలో నిలవబోతున్నాయి.

ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం జార్జియా నుంచి అర్ధాంతరంగా షూటింగ్ ఆపేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదు. కొనసాగిద్దామంటే అక్కడికి వెళ్లే సిచువేషన్ ఇప్పటిలో వచ్చేలా లేదు. ఇక్కడ సెట్స్ వేస్తే బడ్జెట్ ఊహించనంత రేంజ్ లో పెరిగిపోతుంది. ఇప్పుడు నిర్మాతలను ఈ అంశం విపరీతంగా టెన్షన్ పెడుతోంది. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫారెస్ట్ థ్రిల్లర్ కూడా ఇదే ఇబ్బందిని ఎదురుకుంటోంది. మొదట ఫారిన్ అనుకున్నారు. దాన్ని వాయిదా వేసి కేరళలో ప్లాన్ చేశారు. ఇప్పుడు ఎలా రీ స్టార్ట్ చేయాలో అంతుచిక్కడం లేదు.

నితిన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తీస్తున్న రంగ్ దే బాలన్స్ షూటింగ్ యూరోప్ లో పూర్తి చేయాల్సి ఉంది. అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఇది పూర్తయ్యి ఉండేది. కథ డిమాండ్ ప్రకారం ఇది ఖచ్చితంగా ఆ దేశంలోనే తీయాలట. ఒకవేళ గ్రీన్ మ్యాట్ వేసి ఇక్కడే మేనేజ్ చేద్దామంటే నితిన్ రేంజ్ కి మించిన బడ్జెట్ భారం అవుతుంది. షూటింగులకు అనుమతి వచ్చాక హైదరాబాద్ లో తీయడం మినహా వేరే మార్గం లేదు. నాగార్జున వైల్డ్ డాగ్ కూడా ఇంతే. కొంత కీలకమైన పార్ట్ కోసం విదేశాలకు వెళ్ళాలి. ఇదీ జరగని పనే.

ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు కూడా ఇదే తరహా ప్లానింగ్ లో తేడాలు వచ్చి ఏం చేయాలో అర్థం కాని ఇబ్బందిలో ఇరుక్కున్నాయి. ఈ ఏడాది చివరి దాకా అత్యంత అవసరమైతే తప్ప ఏ దేశమూ వీసాలు జారీ చేసేలా లేదు. షూటింగులు ఎమర్జెన్సీ కాదు కాబట్టి అనుమతులు వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. మరి సదరు నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో జరగబోయే వాటిని తలుచుకుని ఇప్పటికే నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయి. ఏప్రిల్ 14 దాటితే కాని కొంత స్పష్టతైనా దొరికే ఛాన్స్ లేదు. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి