iDreamPost

స్టార్ దర్శకులకూ వెబ్ సిరీస్ ఫీవర్

స్టార్ దర్శకులకూ వెబ్ సిరీస్ ఫీవర్

ఇప్పుడంతా డిజిటల్ జమానా. ఇంట్లోనే దర్జాగా కూర్చుకుని అన్ని సౌకర్యాలను సమకూర్చుకుని కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే ట్రెండ్ వచ్చాక థియేటర్ కు వెళ్ళాలంటే ప్రేక్షకుడు చాలా ఆచితూచి అలోచించి మరీ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో కేవలం మూవీ కంటెంట్ తోనే వాళ్ళ దగ్గరకు వెళ్ళలేమని గుర్తించిన స్టార్ డైరెక్టర్లు సైతం తాజాగా వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. ఇప్పటికే అల్లు వారి ఆహా యాప్ కోసం మారుతీ త్రీ రోజెస్ అనే సిరీస్ ని ప్లాన్ చేసినట్టుగా టాక్ ఉంది. పేరున్న క్యాస్టింగ్ తో కాస్త భారీగానే దీన్ని తీయబోతున్నట్టు వినికిడి.

మరోవైపు మహానటి తర్వాత ప్రభాస్ తో భారీ సోషియో ఫాంటసీ ప్లాన్ చేసుకున్న నాగ అశ్విన్ సైతం రానాతో ఓ యాక్షన్ బేస్డ్ వెబ్ సిరీస్ కి రూపకల్పన చేశాడట. నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఓ పెద్ద సంస్థతో డీల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న క్రిష్ ఆహా యాప్ కోసం మస్తీ అనే అల్ట్రా మాడరన్ లవ్ సిరీస్ ఒకటి తీశాడు. వీళ్ళే కాదు ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లు లస్ట్ స్టోరీస్ రీమేక్ లో భాగస్వాములయ్యారు.వారు వీరని కాదు వెబ్ సిరీస్ ల వైపు అందరి కన్నూ పడుతోంది. సినిమాతో సమానమైన రెమ్యునరేషన్ అందుతోంది కాబట్టి ఇలా టెంప్ట్ అవుతున్నారనే కామెంట్ కూడా పరిశ్రమలో ఉంది.

ఒకరకంగా చూస్తే ఇదీ మంచిదే. స్టాండర్డ్ పరంగా చాలా వెనుకబడి ఉన్న తెలుగు వెబ్ సిరీస్ లలో క్వాలిటీ పెరగాలంటే ఇలాంటి టాప్ డైరెక్టర్స్ ఇందులోకి రావడం చాలా అవసరం. అదే జరిగితే నాణ్యత పెరిగి చిన్న మేకర్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అయితే వెబ్ సిరీస్ అంటే ఖచ్చితంగా బోల్డ్ గా ఉండాలి, సీన్ కో బూతు ఉండాలనే భ్రమల్లో నుంచి మనవాళ్ళు బయటికి వస్తే ఇంకా మంచి కథలను చిన్నితెరపై చూడొచ్చు. సినిమా హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా కాస్త హైప్ వచ్చిన సినిమా చేసిన ఏ కొత్త దర్శకుడికైనా వెబ్ సిరీస్ ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట. కొందరు ఆలోచన చేయకుండా ఒప్పేసుకుంటే ఇంకొందరు మాత్రం దీని వల్ల తమ భవిష్యత్తు ఎలా ఉండొచ్చనే లెక్కలు వేసుకుంటున్నారు. అయినా పెద్ద దర్శకులే దీనికి మినహాయింపుగా లేనప్పుడు కొత్తవాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఈ దారికి రావాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి