iDreamPost

వరల్డ్ కప్ కొట్టే దిశగా శ్రీలంక! జోక్ కాదు .. కొన్ని లెక్కలు ఉన్నాయి!

  • Published Sep 15, 2023 | 12:54 PMUpdated Sep 15, 2023 | 12:54 PM
  • Published Sep 15, 2023 | 12:54 PMUpdated Sep 15, 2023 | 12:54 PM
వరల్డ్ కప్ కొట్టే దిశగా శ్రీలంక! జోక్ కాదు .. కొన్ని లెక్కలు ఉన్నాయి!

ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్‌ కప్‌ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. భారత్‌ వేదికగా.. అక్టోబర్‌ 5 నుంచి ఈ మెగా టోర్నీకి టాస్‌ పడనుంది. ఇప్పటికే వరల్డ్‌ కప్‌ కోసం దాదాపు అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. తమ కోర్‌ను రెడీ చేసుకుంటూ.. వరల్డ్‌ కప్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రతిసారిలాగే ఈ వరల్డ్‌ కప్‌కి కూడా హాట్‌ ఫేవరేట్‌ జట్లు అంటూ కొన్ని టీమ్స్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ నిపుణులు.. వరల్డ్‌ కప్‌ గెలిచే అవకాశం ఉన్న జట్లు ఇదే అంటూ.. తమ ఫేవరేట్‌ టీమ్స్‌ను ప్రకటిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

శ్రీలంక పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు. ఎందుకంటే.. శ్రీలంక వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్స్‌ ఆడాల్సి వచ్చింది. దీంతో ఆ టీమ్‌ను ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. కానీ, వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్స్‌ తర్వాత.. ఆసియా కప్‌లో ఆ టీమ్‌ ప్రదర్శన చూసిన తర్వాత.. అందరి లెక్కలు తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయి. అండర్‌ డాగ్‌ టీమ్‌గా వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగి.. కప్పు కొట్టేలా కనిపిస్తుంది లంకేయుల జట్టు. ఇదేదో.. ఒకటి రెండు మ్యాచ్‌లు గెలిచిందని చెబుతున్న మాట కాదు. ఆ జట్టును, జట్టులోని ఆటగాళ్లను కాస్త లోతుగా పరిశీలిస్తే.. వరల్డ్‌ కప్‌ గెలిచే జట్టుకు ఉండే లక్షణం స్పష్టం కనిపిస్తోంది.

మెగా టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలివాలంటే.. ఏ జట్టుకైనా ఉండాల్సింది స్టార్లు కాదు.. టీమ్‌ స్పిరిట్‌. సమిష్టిగా ఆడితే.. ఎంత బలమైన ప్రత్యర్థినైనా ఓడించవచ్చు. క్రికెట్‌లాంటి టీమ్‌ వర్క్‌ గేమ్‌లో సమిష్టితత్వం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం శ్రీలంక జట్టులో పెద్దగా స్టార్లు లేరు. టీమిండియాలో కోహ్లీ, రోహిత్‌.. పాక్‌లో బాబర్‌, అఫ్రిదీ.. ఆస్ట్రేలియాలో వార్నర్‌, స్మిత్‌.. ఇంగ్లండ్‌లో బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌.. ఇలా ప్రతి పెద్ద టీమ్‌లో ముగ్గురు నలుగురు స్టార్లు ఉన్నారు. ఆ టీమ్స్‌ కూడా వారిపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. వారి సక్సెస్‌ టీమ్‌లో ఎంత జోస్‌ నింపుతుంతో.. వారు విఫలమైన సమయంలో అంతే స్థాయిలో టీమ్‌ మొత్తంపై నెగిటివ్‌ ఇంప్యాక్ట్‌ పడుతుంది.

కానీ, శ్రీలంక టీమ్‌లో అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఆ టీమ్‌లో స్టార్లు లేరు ఓన్లీ మ్యాచ్‌ విన్నర్లే ఉన్నారు. జట్టు కోసం జట్టుగా ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఆసియా కప్‌ 2023లో శ్రీలంక ఆడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏ ఒక్క ప్లేయర్‌పై కూడా ఆ టీమ్‌ పూర్తి డిపెండ్‌ కావడం లేదు. ఒకరు విఫలమైతే మరొకరు రాణిస్తున్నారు. మ్యాచ్‌ కండీషన్‌ను బట్టి.. తమ పాత్ర పోషిస్తున్నారు. టీమ్‌లో ఉన్న 11 మంది కూడా మ్యాచ్‌ విన్నర్లలా ఆడుతున్నారు. కీలమైన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే టీమ్‌ను ఓడించిన శ్రీలంక.. అంతకు ముందు టీమిండియాను ఓడించినంత పనిచేసి.. ముచ్చెమటలు పట్టించింది.

ఓపెనర్లు నిస్సంకా, కుసల్‌ పెరీరా, వన్‌డౌన్‌లో వచ్చే కుసల్‌ మెండిస్‌.. ఈ టాపార్డర్‌ శ్రీలంకకు ప్లస్‌ పాయింట్‌.. ముగ్గురిలో కచ్చితంగా ఒక బ్యాటర్‌ టీమ్‌కు బలమైన స్టార్ట్‌ ఇస్తున్నారు. లంక మిడిల్డార్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.. సమరవిక్రమ, చరిత్‌ అసలంకా, కెప్టెన్‌ డసన్‌ షనకాతో పటిష్టమైన మిడిల్డార్‌ లంక సొంతం. టీమ్‌ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతున్నారు. ఇక లోయర్‌ ఆర్డర్‌లో ఆల్‌ రౌండర్‌ డిసిల్వా, 20 ఏళ్ల కుర్రాడు దునీత్‌ వెల్లలాగే అద్భుతంగా ఆడుతున్నారు. బౌలింగ్‌లోనూ శ్రీలంక ప్రత్యర్థులను వణికించేలా ఉంది. మతీష పతిరణా, ప్రమోద్‌ మదుషన పేస్‌ బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నారు. అలాగే మహీష తీక్షణ, వెల్లలాగే స్పిన్‌తో మ్యాజిక్‌ చేస్తున్నారు. మొత్తంగా 11 మంది కలిసి అద్భుతమైన క్రికెట్‌ ఆడుతున్నారు.

గతంలో ఊహించని విధంగా అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగి వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్లను పరిశీలిస్తే.. ఇప్పుడ శ్రీలంక టీమ్‌ కూడా అలాగే కనిపిస్తోంది. 1983లో టీమిండియా, 1992లో పాకిస్థాన్‌, 1996లో శ్రీలంక.. అండర్‌ డాగ్స్‌గానే బరిలోకి దిగి వరల్డ్‌ కప్‌ను ముద్దాడాయి. క్రికెట్‌ టీమ్‌కు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.. జట్టుగా ఆడటం. శ్రీలంకకు ఉన్న మరో ప్రధాన బలం వాళ్ల కెప్టెన్‌ షనక. అద్భుతమైన బౌలింగ్‌ మార్పులతో టీమ్‌ ఎంతో వైవిధ్యంగా ముందుకు నడిపిస్తున్నారు. ఒకప్పటి లంక దిగ్గజ కెప్టెన్‌ అర్జున రణతుంగాను గుర్తు చేస్తున్నారు. 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో శ్రీలంక అండర్‌డాగ్స్‌లా బరిలోకి దిగుతున్నప్పటికీ.. వరల్డ్‌ కప్‌ గెలిచే కసి, సత్తా ఆ టీమ్‌లో మెండుగా ఉన్నాయి. క్వాలిఫైయర్స్‌ ఆడిన స్థాయి నుంచి.. ఆసియా కప్‌లో అగ్రశ్రేణి జట్లను వణిస్తున్న లంక టీమ్‌.. వరల్డ్‌ కప్‌ నెగ్గినా ఆశ్చర్యపోవాల్సి పనిలేదు. గత చరిత్ర చూసుకున్నా.. ఇలాంటి అండర్‌ డాగ్స్‌దే హవా. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: డూ ఆర్‌ డై మ్యాచ్‌లో పాక్‌ ఓటమి! బాబర్‌ అజమ్‌ కన్నీళ్లు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి