iDreamPost

ఫేస్ బుక్ లో ప్రేమ.. శ్రీలంక నుంచి AP వచ్చి ప్రియుడితో వివాహం!

ఫేస్ బుక్ లో ప్రేమ.. శ్రీలంక నుంచి AP వచ్చి ప్రియుడితో వివాహం!

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ని చాలా మంది చాలా రకాలుగా వాడుతుంటారు. ఇలాంటి వాళ్లు మాత్రం ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా అకౌంట్స్ లో పులిహార కలపడానికే వాడుతున్నట్లున్నారు. ఎక్కడెక్కడి వాళ్లతోనో చాటింగ్ లు, వీడియో కాల్స్ అంటూ ప్రేమ పేరుతో నానా హంగామా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్ అయిపోయింది. ఫలానా యువకుడి కోసం ఫలానా దేశం నుంచి యువతి వచ్చింది. ఇంక సోషల్ మీడియా మొత్తం వీళ్లదే రచ్చ. ఇలాంటి వాళ్లు స్కూల్స్ లో చేసిన ప్రతిజ్ఞను బాగా ఫాలో అవుతున్నారు అనిపిస్తుంటుంది. భారతీయులంతా నా సోదరులు, సోదరీమణులు అని చెప్పినందుకు ప్రేమ, పెళ్లికి పక్కదేశాల్లో వెతుకులాట మొదలు పెట్టారు.

ఇప్పుడు ప్రేమలు దేశాలు, ఖండాలు దాటేయడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల పాకిస్తాన్ మహిళ సీమా హైదరీ వచ్చింది మొదలు.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత భారత మహిళ పాకిస్తాన్ వెళ్లింది, పోలాండ్ కి చెందిన మహిళ ప్రియుడి కోసం ఇండియా వచ్చింది. బంగ్లాదేశ్ కి చెందిన మహిళ ప్రియుడి కోసం యూపీకి వచ్చింది. ఈ లిస్టులోకి ఇప్పుడు ఇంకో యువతి వచ్చి చేరింది. ప్రేమించిన అబ్బాయి కోసం శ్రీలంక నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసింది. అంతేకాకుండా ఆ యువకుడిని పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవుతోంది. శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరీ అనే యువతి ప్రియుడి కోసం చిత్తూరు జిల్లా వి.కోట మండలం అరిమాకులపల్లెకు చేరుకుంది. మొదట శ్రీలంక నుంచి చెన్నె వెళ్లగా అక్కడి నుంచి లక్ష్మణ్ చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చాడు.

వీరికి ఆరేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అన్నీ సినిమాల్లో చెప్పినట్లుగానే అది కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది విఘ్నేశ్వరి వీసా తీసుకుని ప్రియుడి కోసం లంక వదిలి చిత్తూరు వచ్చేసింది. వీళ్ల ప్రేమకథ విన్న పెద్దలు వారికి గుడిలో వివాహం కూడా చేశారు. ఈ పెళ్లి వార్త సమాచారం పోలీసులకు కూడా చేరింది. వెంటనే లక్ష్మణ్ ఇంటికి వెళ్లి ఆ యువతి వీసా గడువు పరిశీలించారు. ఆగస్టు 6ల తేదీ వరకు మాత్రమే ఆమెకు వీసా గడువు ఉంది. అప్పటిలోగా శ్రీలంక వెళ్లాలంటూ పోలీసులు విఘ్నేశ్వరికి నోటీసులు జారీ చేశారు. తన భార్య తనతో ఇక్కడే ఉండిపోవడానికి ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేయాలంటూ లక్ష్మణ్ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. వీళ్ల పెళ్లి గురించి విన్న తర్వాత నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ ఉన్న వాళ్లు అయితే వారిపై వాళ్లే జోకులు వేసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి