iDreamPost

శ్రీలంక‌లో ఎమ‌ర్జెన్సీ, దేశం విడిచి పారిపోయిన అధ్య‌క్షుడు

శ్రీలంక‌లో ఎమ‌ర్జెన్సీ, దేశం విడిచి పారిపోయిన అధ్య‌క్షుడు

సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక‌లో ఎమర్జెన్సీని ప్ర‌క‌టించారు. దేశ‌మంత‌టా భారీ నిర‌స‌లు, ఉద్రేకాలు, దిగ‌జారిన శాంతిభ‌ద్ర‌త‌లు. దారుణ‌మైన‌ ఆర్థిక సంక్షోభానికి కార‌కుడిగా నిందిస్తూ, వేలాది మంది నిరసనకారులు అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో, అధ్యక్షుడు గోటబయ రాజపక్స, బుధవారం పదవీవిరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయ‌న అంత‌కుముందే దేశం విడిచిపారిపోయారు.

అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన కొన్ని గంటల తర్వాత, శ్రీలంక దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇది నిర‌వ‌ధికం.

గోటబయ రాజపక్సే మాల్దీవులకు పారిపోయారన్న వార్త‌ల‌తో రాజ‌ధాని కొలంబోలో నిర‌స‌నకారులు క‌దం తొక్కారు. నిర‌స‌నకారుల‌తో వీధుల‌న్నీ నిండిపోయారు. ఆయ‌న‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు, ప్రజలను చెదరగొట్టేందుకు బాష్పవాయువు షెల్స్‌, వాటర్‌ క్యానన్‌లు ప్ర‌యోగించాల్సి వ‌చ్చింది.

మాజీ అధ్యక్షుడు రాజపక్సే, అతని భార్య మరియు ఇద్దరు బాడీగార్డుల‌తో రాత్రి కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయం మిలిటరీ విమానంలో పారిపోయారు. అంతేకాదు, మాజీ అధ్య‌క్షుడి తమ్ముడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే కూడా దేశం విడిచిపెట్టారు. ఇంకా రాజీనామా చేయ‌నందున, దేశం విడిచిపెట్ట‌డానికి విమానాన్ని సిద్ధం చేయాల‌న్న‌ రాజ‌ప‌క్సే అభ్య‌ర్ధ‌న‌ను, అధికారులు మ‌న్నించాల్సివ‌చ్చింది. రాజపక్సే శ్రీలంక ఆర్మీకి సుప్రీం కమాండర్ కూడా.

శ్రీలంక నుంచి మాల్దీవులకు చేరుకున్న మాజీ అధ్యక్షుడు రాజపక్సే, అతని భార్య, అత‌ని బాడీగార్డుల‌ను పోలీసు ఎస్కార్ట్‌లో వేరేచోట‌కు త‌ర‌లించారు. వారు ఎక్క‌డున్నారో మాల్దీవుల ప్ర‌భుత్వం సీక్రెట్ గా ఉంచింది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి