iDreamPost

Raja Babu : చివరి శ్వాస తీసుకున్న ఫ్యామిలీ ఆర్టిస్ట్

Raja Babu : చివరి శ్వాస తీసుకున్న ఫ్యామిలీ ఆర్టిస్ట్

వందల సినిమాల్లో నటించకపోయినా చేసినవాటిలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇతను మనలాగే ఉన్నాడే అని సగటు ప్రేక్షకుడి మెప్పు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు నిన్న రాత్రి కన్నుమూశారు. సుదీర్ఘమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఈ విలక్షణ నటులు ఈ కారణంగానే నటించడం తగ్గించేశారు. 1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఊరికి మొనగాడుతో రాజబాబు పరిశ్రమలోకి అడుగు పెట్టారు. మొదటి చిత్రం ఫ్లాప్ అయినా నిరాశచెందకుండా కొనసాగారు. కృష్ణవంశీ సిందూరం ఈయనకు మంచి పేరు తెచ్చింది. అప్పటి నుంచి ఈ దర్శకుడి దాదాపు ప్రతి సినిమాలోనూ రాజబాబు కనిపిస్తారంటే ఏ స్థాయిలో మెప్పించారో అర్థం చేసుకోవచ్చు.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగమే, మళ్ళీ రావా, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితరాలు రాజబాబుకు పేరు తీసుకొచ్చినవి. ఆ మధ్య వచ్చిన శర్వానంద్ శ్రీకారంలో కూడా ఓ పాత్ర చేశారు. సుమారు 60కి పైగా చిత్రాల్లో విభిన్నమైన క్యారెక్టార్లు దక్కించుకున్నారు. ఈయన సినిమాలకే పరిమితం కాలేదు. పలు టీవీ సీరియల్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా దగ్గరయ్యారు. 2005లో అమ్మలో చేసిన పాత్రకు నంది అవార్డు దక్కింది. రాజబాబు 1957 జూన్ 13న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపేటలో జన్మించారు. కన్నుమూసే నాటికి వయసు 64 సంవత్సరాలు.

రాజబాబు మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెరమీద పెద్దరికంతో గంభీరంగా కనిపించే రాజబాబు నిజ జీవితంలో మాత్రం సరదాగా మాట్లాడతారు. చుట్టూ ఉండే నలుగురితో కలిసిపోతూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చేస్తుంటారని సన్నహితులు చెబుతున్నారు. బాల్యం నుంచే నాటకాలు వేసే అలవాటు ఉన్న రాజబాబుకి ఇంకొన్ని గట్టి పాత్రలు పడి ఉంటే పెద్ద స్థాయికి చేరేవారని కొందరు దర్శకులు చెప్పడం గమనార్హం. కరోనా లాక్ డౌన్ నుంచి ఎందరో సినీ ప్రముఖుల మరణ వార్తలు వినాల్సి రావడం, వారిలో ఇప్పుడు రాజబాబు చేరిపోవడం విచారకరం. ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి

Also Read : Shyam Singha Roy : న్యాచులర్ స్టార్ సినిమాకు నో కాంప్రోమైజ్ 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి