iDreamPost

కియాపై కొరియా ప్రభుత్వం క్లారిటీ..

కియాపై కొరియా ప్రభుత్వం క్లారిటీ..

అంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాల్లో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ తరలిపోతుందంటూ ఇటీవల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేసింది. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు, దాని అనుకూల మీడియా టీ కప్పులో తుఫానును సృష్టించాయి. ఆ కథనం కూడా టీడీపీ నేతలే డబ్బులిచ్చి రాయించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపణలు చేశారు. మొత్తం మీద సదరు వెబ్‌సైట్‌ కూడా నిరాధారమైన కథనం రాశామంటూ వివరణ ఇచ్చింది. కియా సంస్థ ఎండీ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. కియా పరిశ్రమ ఏపీని వదిలి ఎక్కడికీ పోదని, భవిష్యత్‌లో ప్లాంటును విస్తరిస్తామని కూడా ఆ ప్రకటనలో వివరించారు.

Read Also: కియా ఆంధ్రాను వీడదు.. ఎందుకంటే.. ?

అయినా టీడీపీ నేతలు ఇప్పటికీ కియాపై దుష్ప్రచారం చేయడం మాత్రం మానడంలేదు. చంద్రబాబు నుంచి టీడీపీ నేతల వరకూ కియా తరలిపోతుందంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ నేతలు ఇలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. అయినా పెట్టుబడులు పోతున్నాయంటూ.. కొత్త పెట్టుబడులు రావడంలేదంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ గడచిన తొమ్మిది నెలల్లో రాష్ట్రానికి కొత్తగా 23 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారులు గణాంకాలతో సహా వెల్లడిస్తున్నారు. ఆ వార్తలు సదరు తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రముఖంగానూ వస్తుండడం విశేషం.

Read Also: కియాపై వదంతులకు ఫుల్‌స్టాప్‌.. మంత్రి మేకపాటి.. కియా జీఎం భేటీ..

కాగా కియా కార్ల పరిశ్రమపై సదరు సంస్థ దేశమైన దక్షిణ కొరియా స్పందించింది. కియా మోటార్‌ కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వ అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా ట్రేడ్‌ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్‌ ఏజెన్నీ (కోట్రా) స్పష్టం చేసింది. పరిశ్రమ తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలను ఖండించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపింది.

కియాపై జరుగుతున్న ప్రచారంపై సదరు సంస్థ దేశమైన దక్షిణ కొరియా ప్రభుత్వమే నేరుగా ప్రకటన చేయడంతో ఈ వ్యవహారానికి చెక్‌ పడినట్లైంది. ఇకనైనా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కియా తరలిపోతోందన్న ప్రచారం మానుకుంటారా..? లేదా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి