iDreamPost

ఇంట గెలిచి రచ్చ గెలవాలని..

ఇంట గెలిచి రచ్చ గెలవాలని..

ఇంట గెలిచి రచ్చ గెలావలి అనేది బాగా ప్రాచూర్యంలో ఉన్న తెలుగు సామెత. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పుడు ఈ సామెతకు తగినట్లుగానే రాజకీయాలు చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ముందే ఏపీలో ప్రతిపక్ష స్థానం దక్కించుకోవాలని, ఎన్నికల్లో జనసేనతో కలసి అధికారంలోకి రావాలని సోము వీర్రాజుకు ఆ పార్టీ పెద్దలు లక్ష్యం నిర్ధేశించారు. ఇప్పటి వరకూ టీడీపీకి తోక పార్టీగానే రాజకీయాలు చేసిన బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఉంది. ఇన్నాళ్లు ఏపీలో రాజకీయాలు చేస్తున్నా.. సొంతంగా ఒక్క శాతం ఓటు కూడా గత ఎన్నికల్లో సాధించలేపోయింది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి సముచిత స్థానం ఏపీలో దక్కాలనే లక్ష్యంతో బీజేపీ పెద్దలు రాష్ట్ర బాధ్యతలు ఆర్‌ఎస్‌ఎస్‌ వాది అయిన సోము వీర్రాజుకు అప్పగించారు. తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన పెద్దల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు సోము వీర్రాజు కూడా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ముందు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. అందులో తనదైన ముద్ర వేశారు. జంపింగ్‌ జిలానీలు, బీజేపీలో ఉంటూ పసుపు వాదన వినిపించే వారిని పక్కనపెట్టి బీజేపీ వాదులకు పదవులు కట్టబెట్టారు. ఇంటా, బయటా పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు తాళాలు వేశారు.

పార్టీని చక్కదిద్దుకున్న సోము వీర్రాజు ఇక పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా ఇటీవల జరిగిన పరిణమాల ద్వారా తెలుస్తోంది. ఇందులోనూ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సోము వీర్రాజు భవిస్తున్నారు. అందుకే పార్టీ బలోపేత చర్యలను ముందుగా తన సొంత నగరం నుంచే ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన సోము వీర్రాజు.. బీజేపీ బలోపేత చర్యలు రాజమహేంద్రవరం నుంచే ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇతర పార్టీలలోని ద్వితియ శ్రేణి నేతలపై దృష్టి సారించారు. అందులోనూ టీడీపీ నేతలను పార్టీలోకి తీసుకొచ్చే పని చేస్తున్నారు.

టీడీపీలో భవిషత్‌ ఏమిటో అందరికీ అర్థం కావడంతో ఆ పార్టీ నేతలు కూడా సురక్షితమైన రాజకీయ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. వైసీపీలో అవకాశం లేని వారందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల రాజమహేంద్రవరంలో పలువురు మాజీ కార్పొరేటర్లు టీడీపీని వదిలి బీజేపీలో చేరారు. వారి బాటలోనే పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు పయనించే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ నడుస్తోంది. ఈ చర్యల ద్వారా బీజేపీ బలోపేతాన్ని ముందు ఉభయగోదావరి జిల్లాల నుంచే చేయాలని సోము వీర్రాజు లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి