iDreamPost

రిఫరెండం రాజకీయాలు.. ఇప్పుడు సోము వంతు…!

రిఫరెండం రాజకీయాలు.. ఇప్పుడు సోము వంతు…!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇప్పుడు రిఫరెండం చుట్టూ తిరుగుతున్నాయి. ‘ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నా.. ఉంచితే అమరావతినే రాజధానిగా ఉంచాలి.. లేకుంటే మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలి. దీనికి సిద్ధమేనా? ప్రజాతీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా వస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటా..’ టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్‌ చేశారు. చంద్రబాబు సవాలుకు ఇటు వైసీపీ నుంచే కాదు.. అటు బీజేపీ నుంచి కూడా ప్రతి సవాళ్లు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఏపీలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికనే రిఫరెండంగా తీసుకుందామని మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు. ఆ ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు రాజకీయ సన్యాసం ప్రకటనలు, గతంలోనూ ఆయన చేసిన సవాళ్లపై సోషల్‌మీడియా లోకం కోడై కూస్తోంది. అమరావతి సభలో అక్కడి జనాన్ని ఆకట్టుకోవడానికి చంద్రబాబు చేసిన సవాల్‌ ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందని బహుశా ఆయన ఊహించి ఉండరని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరో కొత్త రిఫరెండాన్ని తెరపైకి తెచ్చారు.

చంద్రబాబు అవినీతిపై రిఫరెండం..

చంద్రబాబునాయుడి అవినీతిపై రిఫరెండం నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. అమరావతి నిర్మాణానికి బాబు ఖర్చు చేసిన 7,200 కోట్ల రూపాయల పైనా, నిర్మాణాల్లో జరిగిన అవినీతిపైనా రిఫరెండం పెట్టాల్సిందే అని సోము తెలిపారు. వాస్తవానికి ప్రజల తీర్పునే రిఫరెండంగా భావించవచ్చు. ప్రభుత్వం నిర్ణయాలు, విధానాలు నచ్చకపోతే తర్వాతి ఎన్నికల్లో ప్రజలే ఓడిస్తారు. 2014 ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలు అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు వైఫల్యాలు, విధానాలు నచ్చక 2019 ఎన్నికల్లో ఓడించారు. 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్‌ రెడ్డికి ఘన విజయం చేకూర్చారు. కేవలం 23 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ పాత్రను కూడా సరిగా పోషించడం లేదని బీజేపీ విమర్శిస్తోంది. ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు విఫలమయ్యారని తాజాగా మరోమారు సోము ఆరోపించారు. రాష్ట్రంలో తామే ప్రతిపక్షమని చెప్పుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి