iDreamPost

Shruti Haasan : కమల్ తనయ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు

Shruti Haasan : కమల్ తనయ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు

కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఐరన్ లెగ్ అని పిలిపించుకున్న శృతి హాసన్ గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా లక్కీ హీరోయిన్ గా మారిపోవడం అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, బలుపు లాంటి బ్లాక్ బస్టర్స్ రావడంతో కొన్నేళ్లు తన వైభవం దివ్యంగానే కొనసాగింది. ఆపై ఫ్లాపులు, తమిళ సినిమాలు, వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారం లాంటి కారణాలు టాలీవుడ్ కి కొంత కాలం పాటు దూరం చేశాయి. మధ్యలో పవన్ కళ్యాణ్ తో చేసిన కాటమరాయుడు లాంటివి ఏ మాత్రం ఉపయోగపడకపోగా గ్లామర్ పరంగానూ కొన్ని కామెంట్స్ వచ్చాయి. మళ్ళీ తను కనిపించనే లేదు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్.

గత ఏడాది రవితేజ క్రాక్, పవన్ వకీల్ సాబ్ సూపర్ సక్సెస్ కావడంతో ఇండస్ట్రీ జనాలు తిరిగి ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏకంగా ప్రభాస్ సలార్ లో ఛాన్స్ కొట్టేయడం ఎవరూ ఊహించనిది. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రెండు భాగాలుగా రూపొందుతున్న ఆ సినిమా నిర్మాణం ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది. బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమాలోనూ తనే హీరోయిన్ కావడం మరో మలుపు. ఇది చాలదన్నట్టు చిరంజీవి బాబీ కలయికలో వస్తున్న చిత్రంలోనూ తనే బుక్ అయ్యింది. నాన్న సమకాలీకులైన చిరు బాలయ్య సినిమాల్లో వాళ్ళ సరసన జోడిగా నటించడం అనేది అసలు ట్విస్ట్. మధ్యలో ప్రభాస్ కూడా ఉన్నాడు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. చిరంజీవి బాలకృష్ణ సినిమాలు రెండూ మైత్రి బ్యానర్ లో రూపొందుతున్నవే. సో పారితోషికం స్పెషల్ ప్యాకేజ్ కింద ఆఫర్ చేసి ఉండొచ్చు. వయసు దృష్ట్యా శృతి వాళ్లకు జోడిగా సెట్ అవుతుందో లేదో అనే అనుమానాలు లేకపోలేదు. ఖైదీ నెంబర్ 150లో కాజల్ అగర్వాల్, అఖండలో ప్రగ్య జైస్వాల్ ను చూశాక డౌట్స్ ఎందుకు. అయినా అరవై ఏళ్ళ వయసులో ఉన్న హీరోల పక్కన కుర్ర హీరోయిన్లు డాన్సులు చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. ప్రేక్షకులు ఆదరిస్తున్నదే. ఇన్నేళ్ళయ్యాక కూడా శృతి హాసన్ కు ఇన్నేసి ఆఫర్లు రావడం చూస్తే ఆలోచించకుండా ఇలా అన్ని చేసేయడమే తెలివైన పని.

Also Read : RC15 : శంకర్ సినిమా టైటిల్ లీక్ అయ్యిందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి