iDreamPost

మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా ఎన్‌సిపికి రాజీనామా

మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా ఎన్‌సిపికి రాజీనామా

కేంద్రంలోని అధికార బిజెపి రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్‌లో చేపట్టిన ఆపరేషన్ కమల్ విజయవంతమై నాలుగింట మూడు రాజ్యసభ స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల ఫలితాల సెగ తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తగిలింది. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. 

ఈ నెల ప్రారంభంలో గుజరాత్ శాఖ అధ్యక్ష పదవి నుంచి వాఘేలాను ఎన్‌సిపి తొలగించింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే జయంత్ పటేల్‌కు రాష్ట్ర పార్టీ యూనిట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. తాజాగా నేడు శరద్ పవార్‌కు రాసిన రాజీనామా లేఖలో వాఘేలా రాజ్యసభ ఎన్నికలలో ఎన్‌సిపి ఏకైక ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పార్టీ అధ్యక్ష పదవిలో చోటు చేసుకున్న మార్పు తాలూకా, జిల్లా, రాష్ట్ర నాయకులు మరియు పార్టీ కార్యకర్తలలో నిరుత్సాహం నింపిందని పేర్కొన్నారు. కాగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా,శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

తన రాజీనామా తరువాత వీడియో సందేశం విడుదల చేసిన వాఘేలా ఎన్‌సిపి ఎమ్మెల్యే కంధల్ జడేజా పార్టీ విప్‌ను దిక్కరించి బిజెపి అభ్యర్థికి ఓటు వేయడాన్ని తప్పుపట్టాడు..79 ఏళ్ల అనుభవజ్ఞుడు,మాజీ ముఖ్యమంత్రి తన మద్దతుదారుల కోరికను గౌరవించి ప్రజాజీవితంలోనే కొనసాగుతానని ప్రకటించారు. అలాగే తమ ఎమ్మెల్యే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం నన్ను, పార్టీలోని ఇతర కార్యకర్తలను నిరుత్సాహపరిచిందని వ్యాఖ్యానించాడు.

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వాఘేలా పలు పార్టీలను మారారు. తొలుత వాఘేలా జన సంఘ్ లో చేరడానికి ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో క్రియాశీల సభ్యుడిగా ఉండి ఎమర్జెన్సీ సమయంలో జైలు పాలయ్యారు. అత్యవసర పరిస్థితి తరువాత కపద్వాంజ్ నుండి జనతా పార్టీ టిక్కెట్‌పై 6 వ లోక్‌సభకు (1977-1979) ఎన్నికయ్యారు.గుజరాత్‌లోని జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1980 నుండి 1991 వరకు గుజరాత్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షుడిగా పనిచేశారు. అతను 1984 నుండి 1989 వరకు రాజ్యసభ సభ్యుడు. 1989- 1996 మధ్య గాంధీనగర్ నుండి 9,10 లోక్ సభకు ఎన్నికయ్యారు. 1996లో బిజెపి ఎమ్మెల్యేలను చీల్చి రాష్ట్రీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.తర్వాత 1997లో ఆయన తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.1999,2004 లలో కాంగ్రెస్ అభ్యర్థిగా కపద్వాంజ్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు.మన్మోహన్ సింగ్ తొలివిడత(2004-2009) ప్రభుత్వంలో ఆయన టెక్స్‌టైల్స్ మంత్రిగా పని చేశారు.

కానీ 2017 లో రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ కు వ్యతిరేకంగా తన మద్దతుదారులైన కొద్ది మంది ఎమ్మెల్యేలతో బిజెపి అభ్యర్థికి ఓట్లు వేయించాడు. ఈ నేపథ్యంలో 2017 జూలైలో కాంగ్రెస్ నుంచి తప్పుకున్న రెండేళ్ల తర్వాత 2019 లో ఆయన ఎన్‌సిపిలో చేరారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుండా పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఎన్‌సిపి సోమవారం జడేజాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి