iDreamPost

రాష్ట్ర క్యాబినెట్ భేటీ లో పలు కీలక నిర్ణయాలు

రాష్ట్ర క్యాబినెట్ భేటీ లో పలు కీలక నిర్ణయాలు

ఈరోజు సచివాలయంలో గంటన్నరకు పైగా సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు మద్యం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి నిబంధనలను కఠినతరం చెయ్యాలని, ఎవరైనా అభ్యర్థులు నగదు పంచుతూ దొరికితే వారి అభ్యర్థిత్వాన్ని తక్షణమే రద్దు చేయాలనే కఠిన నిబంధనతో పాటు అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై అనర్హత వేటుతో పాటు 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించాలని రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల్లో ధనప్రభావాన్ని, ప్రలోభాలను తగ్గించి ఎన్నికలలో జరిగే అక్రమాలను అరికట్టడం కోసం నోటిఫికేషన్ వెలువడిన దగ్గరనుండి పోలింగ్ పూర్తయ్యేవరకు మొత్తం ఎన్నికల ప్రక్రియను 10 నుండి 14 రోజుల లోపు పూర్తి చెయ్యాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లోగా, సర్పంచుల ఎన్నికలు 13 రోజులలోగా పూర్తి చెయ్యాలని చట్టంలో మార్పు తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

పంచాయితీ ఎన్నికల అభ్యర్థుల ప్రచారానికి ఐదు రోజులు, ఎంపిటిసి అభ్యర్థుల ప్రచారానికి ఏడు రోజులు గడువు విధించింది. గిరిజన ప్రాంతాలుగా నోటిఫై చేసిన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపిపి, జెడ్పిటిసి పదవులను పూర్తిగా యస్టీలకే కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎంపిటిసి, వార్డ్ మెంబర్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.

పారిపాలనా వికేంధ్రీకరణలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాల బాధ్యతలు పూర్తిగా సర్పంచ్ కే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పంచాయితీ చట్టాలలో భాగంగా సర్పంచ్ స్థానికంగానే నివసించాలని, స్థానిక పంచాయతీల్లోనే విధులు నిర్వహించాలని కఠిన నిబంధన విధించారు. ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి లాంటి విపత్తులు సంభవించినప్పుడు పంచాయితీ తీర్మానం అవసరం లేకుండానే ఆ గ్రామ సర్పంచ్ ముందస్తుగా చర్యలు తీసుకొనే అధికారాలని సర్పంచ్ కు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

మునిసిపాలిటీ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎంపిటిసి, ఎంపిపి, జెడ్పిటిసి ఎన్నికలలో విధించిన షరతులు, నిభందనలే వర్తించే విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ కూడా 15 రోజుల్లోగా పూర్తి చెయ్యాలని క్యాబినెట్ తీర్మానించింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత కూడా గెలిచిన అభ్యర్థులు ఈ నిభందనలు ఉల్లంఘించినట్టు రుజువైతే వారిని డిస్క్వాలిఫై చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని క్యాబినెట్ తెలిపింది.

కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ని ఏర్పాటు చెయ్యడానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనిద్వారా రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక శాఖలోని మిగులు నిధులు ఇంకొక శాఖలోకి బదాలాయించినప్పుడు దాని తాలూకు వడ్డీని మాతృ శాఖలో జమ చేస్తారు.

ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల పరిధిలో, హార్టీకల్చరల్ కళాశాలల పరిధిలో నాణ్యమైన విద్యని అందించడానికి, నిపుణులైన బోధనా ఫ్యాకల్టీని నియమించడానికి, ఆ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడానికి ఉద్దేశించిన ఈ మొత్తం ప్రక్రియని మానిటరింగ్ చెయ్యడానికి ఎపి స్టేట్ అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు అసెంబ్లీ లో ప్రవేశపెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.

రైతులకు ఉచిత విధ్యుత్ ని అందించడానికి, సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సంవత్సరానికి షుమారు 10 వేల కోట్ల రూపాయల సబ్సిడీ విధ్యుత్ చార్జీలను ప్రభుత్వం భరిస్తున్న తరుణంలో, ప్రతి సంవత్సరం కొత్తగా 50 వేల నుండి లక్ష వరకు కొత్త వ్యవసాయ పంపు సెట్లను రైతులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకపక్క నాణ్యమైన విధ్యుత్ కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న దృష్యా మరోవైపు ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం విధ్యుత్ సబ్సిడీ భారం మొత్తాన్ని విద్యుత్ కంపెనీలపైనే మోపడం వల్ల విద్యుత్ డిస్కంలు 35 వేల కోట్లరూపాయలకు పైగా అప్పుల్లో కూరుకుపోయాయని క్యాబినెట్ విచారం వ్యక్తం చేసింది.  వ్యవసాయంలో ఉన్న విద్యుత్ డిమాండ్ ని అందుకోవడానికి ఎపి జన్ కో ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా 10 వేల మెగావాట్ల సామర్ధ్యంకల సోలార్ మెగా పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చెయ్యాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది.

ప్రభుత్వ భూ సేకరణలో వివిధ ఉద్యానవన పంటలకిచ్చే నష్టపరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి