iDreamPost

ఇక నుంచి ఎవరైనా SBI YONO వాడొచ్చు! ఎలాగంటే..?

  • Author singhj Published - 09:45 PM, Fri - 14 July 23
  • Author singhj Published - 09:45 PM, Fri - 14 July 23
ఇక నుంచి ఎవరైనా SBI YONO వాడొచ్చు! ఎలాగంటే..?

ప్రజల అవసరాలకు తగ్గట్లు టెక్నాలజీలో వేగంగా మార్పులు వస్తున్నాయి. అదే టైమ్​లో అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, వాడుకోవడంలో అందరూ ముందుంటున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగినప్పటి నుంచి సాంకేతిక రంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ప్రతి దానికి ఇప్పుడు యాప్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో వచ్చినవే యూపీఐ యాప్స్. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీ షాప్​కు వెళ్లినా, పెద్ద రెస్టారెంట్​కు వెళ్లినా డబ్బులు చెల్లించాలంటే జస్క్ ఫోన్​లో ఈ యాప్స్ తెరిచి స్కాన్ చేస్తే చాలు. కరోనా టైమ్​లో క్యాష్​లెస్ పేమెంట్స్ కోసం యూపీఐ యాప్స్ వాడకం బాగా పెరిగింది.

సోషల్ డిస్టెన్సింగ్ తదితర నిబంధనలు ఉండటం, ముట్టుకుంటే కరోనా సోకుతుందనే భయంతో అందరూ ఈ యాప్స్ ద్వారా చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు అది పీక్​కు చేరుకుంది. అయితే అప్పట్లో ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారానే చెల్లింపులు చేసేందుకు వీలుండేది. బ్యాంకులకు సంబంధించిన యాప్స్ ద్వారా చెల్లింపులు చేసుకునేందుకు ఛాన్స్ ఉన్నా.. అది ఆ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే వీలుండేది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. డిజిటల్ బ్యాంకింగ్ అప్లికేషన్​ను మరింత ఎక్కువ మందికి చేరవేసేందుకు ఎస్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ పేమెంట్స్ కోసం ఇకపై యోనో యాప్​ను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

ఇకపై ఎస్​బీఐ అకౌంట్ లేకపోయినా యోనో మొబైల్ యాప్ ద్వారా డబ్బులు పంపడం లేదా అందుకోవడం చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ కస్టమర్ అయినా యోనో యూపీఐ ఫీచర్ యాక్సెస్ చేసి.. స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ లాంటి వాటితో పేమెంట్స్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. యూపీఐ సర్వీస్​తో పాటు కార్డ్​లెస్ క్యాష్​ విత్​డ్రాయల్​ సదుపాయాన్నీ ఎస్​బీఐ కల్పిస్తోంది. ఏ బ్యాంక్ కస్టమరైనా ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంల్లో ఎస్​బీఐ యోనో యాప్​లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్​’ ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే డబ్బుల్ని విత్​డ్రా చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్​ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్​బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫోన్​ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్​కు గట్టిపోటీనిచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి