iDreamPost

పార్టీ మారి,రాష్ట్రం దాటి శత్రుఘ్న సిన్హా లోక్ సభకు పోటీ

పార్టీ మారి,రాష్ట్రం దాటి  శత్రుఘ్న సిన్హా లోక్ సభకు పోటీ

ఆయన బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరు. తూటాల్లాంటి మాటలకు, పంచ్ డైలాగులకు పెట్టింది పేరు. అందుకే ఆయన్ను షాట్ గన్ అని కూడా అంటారు. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం రాష్ట్రం కాని రాష్ట్రం ఢిల్లీలో రాజకీయ మిషన్ ప్రారంభించిన ఆ షాట్ గన్ తర్వాత సొంత రాష్ట్రానికి వెళ్లి అక్కడి నుంచి తాజాగా పశ్చిమబెంగాల్ కు చేరింది. ఆ షాట్ గన్ అసలు పేరు శత్రుఘ్న సిన్హా. బీజేపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన సిన్హా రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా వ్యవహరించారు. బీజేపీ నాయకత్వంతో విభేదాల నేపథ్యంలో 2019 ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెసులో చేరారు. ఇప్పుడు ఆ పార్టీని కాదని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ నుంచి లోక్సభ కు పోటీ చేయనున్నారు.

అగ్రనేత అద్వానీ స్థానంలో..

హిందీ చిత్రసీమ బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా పేరుప్రతిష్టలు పొందిన బీహార్ రాష్ట్రానికి చెందిన శత్రుఘ్న సిన్హా అనుకోని రీతిలో సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. న్యూఢిల్లీ స్థానం నుంచి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడంతోనే ఆయన రాజకీయజీవితం అంకురించింది. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రాజీనామాతో 1992 జూన్లో న్యూఢిల్లీ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అద్వానీ స్థానంలో సిన్హాను బీజేపీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శత్రుఘ్న స్నేహితుడు, తోటి నటుడు రాజేష్ ఖన్నా పోటీ చేయడంతో ఆ ఎన్నిక స్నేహితుల మధ్య పోరాటంగా మారింది. చివరికి 25వేల మెజారిటీతో రాజేష్ ఖన్నా గెలిచారు. తొలి ప్రయత్నంలో ఫెయిలైన సిన్హా తర్వాత క్రమంగా రాజకీయాల్లో నిలదొక్కుకుని కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు.

వాజపేయి కేబినెట్లో చోటు

న్యూఢిల్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ శత్రుఘ్న సిన్హాను కమలం పార్టీ ఆదరించింది. పార్టీలో ముఖ్యనేతగా ఎదిగిన ఆయనను 1996లో రాజ్యసభకు పంపింది. తిరిగి 2002లో రెండోసారి కూడా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది. ఆ సమయంలోనే అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో చోటు లభించింది. 2002-04 మధ్య మొదట ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తర్వాత షిప్పింగ్ శాఖలను నిర్వహించారు. 2009లో బీహార్లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టిన సిన్హా.. 2014 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా రెండోసారి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెసులో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

మోడీ-షాలతో విభేదాలు

కాషాయదళం మోడీ- అమిత్ షాల నాయకత్వంలోకి వచ్చిన తర్వాత సీనియర్లకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఆ క్రమంలోనే శత్రుఘ్న సిన్హాకు కూడా వారితో దూరం పెరిగింది. 2019 ఎన్నికల సమయానికి ఆ గ్యాప్ మరింత పెరిగింది. సీనియర్లను పట్టించుకోవడం లేదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం పెరిగిందని సిన్హా తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయసాగారు. వాజపేయి హయాంలో సమష్టి నిర్ణయాలు తీసుకునేవారని, మోడీ, షాలు తమ నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారని ఆరోపించేవారు. కాగా 2019 ఎన్నికల్లో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టారు. శత్రుఘ్న సిన్హాకు సైతం పార్టీ టికెట్ నిరాకరించింది. దాంతో ఆయన ఆ ఏడాది మార్చి 31న బీజేపీకి రాజీనామా చేశారు. ఏప్రిల్ ఆరో తేదీన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సమక్షంలో కాంగ్రెసులో చేరి ఆ ఎన్నికల్లో పాట్నా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇప్పుడు టీఎంసీలోకి..

దాదాపు మూడేళ్లుగా రాజకీయ మౌనం పాటించిన శత్రుఘ్న సిన్హా హఠాత్తుగా మళ్లీ తెరపైకి వచ్చారు. కాంగ్రెసుకు ఆయన ఇప్పటికీ రాజీనామా చేయకపోయినా క్రియాశీలంగా లేరు. ఈ తరుణంలో ఏప్రిల్ 12న జరగనున్న పార్లమెంటు ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్ సోల్ నియోజకవర్గానికి తమ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హాను తృణమూల్ పార్టీ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. గతంలో సిన్హా బీజేపీని వీడిన సమయంలో మమత అతన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. అప్పట్లో ఆమె ఆహ్వానాన్ని కాదని కాంగ్రెసులో చేరినా.. ఇప్పుడు ఏకంగా టికెట్ ఇచ్చి పార్టీలోకి తీసుకోవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి