iDreamPost

ఎన్టీఆర్ పై సెటైరికల్ సినిమా – Nostalgia

ఎన్టీఆర్ పై సెటైరికల్ సినిమా – Nostalgia

మాములుగా ఏ దేశాధినేతనో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రినో కామెంట్ చేయాలంటే చాలా బాధ్యతగా వ్యవహరించాలి. నిజమేదో అబద్దమేదో తెలుసుకుని ముందడుగు వేయాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణే. వేదిక ఏదైనా పెద్దల గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అలాంటిది ఏకంగా సినిమానే తీస్తే. ఊహించగలమా. కానీ ఓసారి జరిగింది. 1989లో సీనియర్ నటులు టి. ప్రభాకర్ రెడ్డి గారి దర్శకత్వంలో ‘గండిపేట రహస్యం’ అనే సినిమా వచ్చింది. ఇందులో అప్పటి సిఎం కం స్టార్ హీరో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మీద నేరుగా సెటైర్లు ఉంటాయి.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ తీవ్రంగా ఎండగడుతూ డైలాగులు కూడా భారీగా జొప్పించారు. విజయనిర్మల గారు ఓ కీలక పాత్ర పోషించగా సీనియర్ నరేష్ మంచి జోష్ ఉన్న యూత్ పాత్రలో కనిపిస్తారు. దీనికి నిర్మాతగా డివిఎస్ రాజు వ్యవహరించారు. మరి ఎన్టీఆర్ గా ఎవరు కనిపించారు అనేదేగా మీ డౌట్. ఇక్కడే ట్విస్ట్ ఉంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా బాగా పాపులర్ అయిన కమెడియన్ కం యాక్టర్ పృథ్వి గండిపేట రహస్యంలో అన్నగారిగా నటించారు. వేష బాషలతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అచ్చం అదే తీరులో ఉండేలా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అప్పటికి ఆయన చేసింది పెద్దగా గుర్తింపు రాని ఒకటి రెండు సినిమాలే. గండిపేట రహస్యం విజయం సాదించలేదు. దాని చుట్టూ ముసురుకున్న వివాదాల వల్ల కొద్దో గొప్పో వసూళ్లు వచ్చాయి కానీ ఫైనల్ గా డిజాస్టరే అయ్యింది.

ఇదొక్కటే కాదు దీనికి ముందు వెనుకా ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ మండలాధీశుడు, నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి సినిమాలను ఇదే టీమ్ సంధించింది. కాకపోతే దర్శకులు మారారు. గండిపేట రహస్యంలో నటించడం వల్ల చాలా కాలం అవకాశాలు రాలేదని ఎన్టీఆర్ అభిమానుల దృష్టిలో నెగటివ్ కావాల్సి వచ్చిందని పలు ఇంటర్వ్యూలలో పృథ్వి చెప్పుకున్నారు. కెరీర్ ప్రారంభంలో అంత పెద్ద దర్శకులు నటుల నుంచి గండిపేట రహస్యం ఆఫర్ రావడంతో పృథ్వి తర్వాత పరిణామాలు ఊహించలేదు. గుర్తించేలోపు నష్టం జరిగిపోయింది. 1996లో నిన్నే పెళ్లాడతా ఆ తర్వాత సిందూరం, ఖడ్గంలతో కృష్ణవంశీ బ్రేక్ ఇచ్చే దాకా పోరాటం చేయాల్సి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి