iDreamPost

నెచ్చెలి ఆస్తులకు వారసురాలిని నేనే..

నెచ్చెలి ఆస్తులకు వారసురాలిని నేనే..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిచెందిన అనంతరం జయలలిత కి చెందిన పలు ఆస్తులు ఎవరికి చెందుతాయి అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కొడనాడులోని జయలలిత ఎస్టేట్ కి యజమానురాలిని తానేనంటూ శశికళ తాజా గా ప్రకటించుకోవడం ఇప్పుడు సంచలంగా మారింది. ఆమె తన ఆడిటర్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించిన వ్యక్తిగత ఆస్తుల వివరాల జాబితాలో జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ కూడా ఉండడం విశేషం.

అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్ట్ నాలుగేళ్లు జైలు శిక్ష విధించడంతో 2017 పిభ్రవరి 14 నుండి బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త నటరాజ్ మృతి చెందినప్పుడు పెరోల్ మీద బయటకి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ తో పాటు శశికళ ఆమె బంధువులకి చెందిన నివాసాల్లో ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి కొన్ని కీలకమైన పత్రాలు తోపాటు రహస్య డైరీలు స్వాధీనం చేసుకుంది.

పెద్ద నోట్ల రద్దు సమయంలో శశికళ అక్రమంగా తన దగ్గరున్న1,674 కోట్ల రూపాయల విలువైన వెయ్యి, ఐదు వందలనోట్లను మార్చి పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నట్టు ఇప్పటికే ఐటి శాఖ హైకోర్టుకి తెలియజేసింది. శశికళ పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి చెల్లని 1000, 500 నోట్లను ఇచ్చి ఆస్తులను కొనుగోలుచేశారని వెల్లడైంది.

ఆ వివరాల ఆధారంగా ఆమెని సంజాయిషీ కోరుతూ ఐటి శాఖ అధికారులు జైలులో ఉన్న శశికళకు నోటీసు జారీ చేశారు. దానిపై అక్టోబర్‌ 22 లోపు తన సంజాయిషీ ఇవ్వాలని ఐటి శాఖ అధికారులు ఆ నోటీసులో గడువు విధించారు. ఆ నేపథ్యంలో అక్టోబర్‌ 22న శశికళ తరఫు ఆడిటర్‌ ఆదాయపు పన్నుల శాఖకు ఓ లేఖ పంపారు. ఐటి అధికారులు పంపిన నోటీసు అక్టోబర్‌ 19న శశికళకు అందిందని, నోటీసు గడువు ముగియడానికి మూడు రోజులే మిగలటంతో సంజాయిషీ ఇవ్వలేకపోతున్నారని, 30 రోజుల గడువు కావాలని ఆ లేఖలో కోరారు.దానిపై స్పందించిన ఐటి శాఖ నెల రోజుల గడువు ఇవ్వలేమంటూ 15 రోజుల గడువును ఇచ్చింది. చివరకు ఆ యేడాది డిసెంబర్‌ 11న శశికళ తరఫు ఆడిటర్‌ ఆదాయపు పన్నుల శాఖ అధికారులకు సంజాయిషీ పత్రాలను దాఖలు చేశారు.

ఐటి శాఖకి ఇచ్చిన శశికళ ఆడిటర్ సమర్పించిన లిస్ట్ లో 2016-17 నుండి 2017-18 ఆర్థిక సంవత్సరంలో శశికళకు ఉన్న ఆస్తుల వివరాలు అందులో పొందుపరిచారు. అన్నాడీఎంకే పార్టీ పత్రిక ‘నమదు ఎంజీఆర్‌’, ‘జయా ప్రింటర్స్‌’ సంస్థలలో శశికళ పెట్టుబడులు పెట్టారని, మాజీ ముఖ్యమంత్రి జయ లలితకు చెందినవిగా భావిస్తున్న జయ ఫామ్‌ హౌస్‌, జె.ఎస్‌. హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌, జయా రియల్‌ ఎస్టేట్‌, గ్రీన్‌ ఫామ్‌ హౌస్‌లలో శశికళ భాగస్వామిగా ఉన్నారని ఆమె ఆడిటర్ ఐటి శాఖ కి తెలిపారు.

కొడనాడులోని జయలలిత ఎస్టేట్ కి యజమానురాలిని నేనే…

ప్రకృతి సౌందర్యానికి నెలవైన పచ్చని నీలగిరి కొండల మధ్య నెలకొని ఉన్న కొడనాడు వ్యూ పాయింట్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరం వెళితే మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడనాడ్ ఎస్టేట్ ప్రారంభమవుతుంది. 1990 లలో జయలలిత మరియు శశికళ నీలగిరి ప్రాంతంలో అనేక ఎస్టేట్ లను సందర్శించిన తరువాత, వారు చివరకు ఇపుడున్న కొడనాడు బాగా నచ్చడంతో దాన్ని కొనుగోలు చేసారు.ఈ టీ ఎస్టేట్ 1864 లో స్థాపించబడింది. తరువాత ఈ ఎస్టేట్ పై అనేక క్రయ విక్రయాలు జరిగి అనేకమంది యజమానులు చేతులు మారి చివరకు జయలలిత చేతికి వచ్చింది. ఈ ఆస్తిని 7.5 కోట్ల ధరకు దాని యజమాని జోన్స్ జయలలితకు విక్రయించారు.1,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్‌ లో టీ, కాఫీ మరియు యాలకులు పండించే వారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తి విలువ 1000 కోట్లు పైమాటే. ప్రస్తుతం ఈ ఎస్టేట్ కోర్ట్ అటాచ్మెంట్ లో వుంది. ఇదిలా ఉంటే తాజాగా శశికళ తన ఆడిటర్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించిన వ్యక్తిగత ఆస్తుల వివరాల జాబితాలో ఈ కొడనాడు టి ఎస్టేట్ కూడా ఉండడం విశేషం.

జయలలిత జీవితాన్ని ఈ కొడనాడు ఎస్టేటుని విడదీసి చూడలేమేమో అన్నంతగా ఆమె జీవితంలో భాగమైన ఈ ఎస్టేటులోనే ఎక్కువకాలం గడపడానికి ఆమె ఇష్టపడేవారు. అందుకే  ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో జయలలిత సంవత్సరంలో ఎక్కువ రోజులు ఈ ఎస్టేటులోనే గడిపేది. ఆ సమయంలో ఆమె పార్టీ ముఖ్యనేతలకు కూడా అందుబాటులో ఉండేవారు కాదంటే అతిశయోక్తి లేదు.

జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత కోడనాడ్ తమిళనాడు యొక్క ‘సూడో సెక్రటేరియట్’ గా మారింది. ఎస్టేట్ పరిధిలో ఉన్న సరస్సుపై పడవ యాత్రలు చేయడం, బంగ్లాలో గడపడం ఆమెకు చాలా ఇష్టం. సచివాలయంలో లాగా కేవలం జయలలిత ఒక్కరే తన బంగ్లాలోకి రావడానికి పోవడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని ఉపయోగించేవారు. సంవత్సరంలో దాదాపు వేసవిలో సుమారు 4,5 నెలలు పాటు జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడనుండి తన పాలన కొనసాగించేది. మంత్రివర్గ సమావేశాలతో పాటు ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగులు కూడా ఆమె ఇక్కడనుండే నిర్వహించేవారు.అధికార యంత్రాంగం కూడా చెన్నై నుండి ఈ ఎస్టేట్ కి వచ్చి కీలక ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకొనేవారు. తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ఆమె ఈ ఎస్టేట్ నుండే రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించడం విశేషం. అయితే 2014 సెప్టెంబరులో ప్రత్యేక న్యాయస్థానం ఆమెను అక్రమాస్తుల కేసులో దోషిగా తేల్చి ఆమె జైలు జీవితం గడిపి బయటకు వచ్చాక, జయలలిత ఎప్పుడూ కొడనాడ్ ఎస్టేట్‌లోకి అడుగు పెట్టలేదు.

జయలలితతో ఇంతటి అనుబంధం కలిగిన కొడనాడు ఎస్టేట్ కి ఇప్పుడు తానే యజమానురాలినని ఆమె నెచ్చెలి శశికళ ప్రకటించుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదేమో.. కానీ జయలలితకు ప్రాణమైన ఈ ఎస్టేటుని ఆమె నెచ్చెలి శశికళ నిలబెట్టుకుంటుందా లేదా అనే సంశయం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏదేమైనా కొడనాడు ఎస్టేటు రాజకీయం ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో కాలమే సమాధానం చెబుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి