iDreamPost

కాళ్లకు చెప్పుల్లేని స్థాయి నుండి IPS అధికారిగా.. సక్సెస్ స్టోరీ

కాళ్లకు చెప్పుల్లేని స్థాయి నుండి IPS అధికారిగా.. సక్సెస్ స్టోరీ

ఆమెది పేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కడుపు నిండా తిండి దొరక్కపోయినా.. చదువును ఏనాడు అశ్రద్ధ చేయలేదు. కాలికి సరిగ్గా చెప్పులు లేకపోయినా.. కిలోమీటర్లు నడిచి ఆమె చదువు సాగింది. తన ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. తన విజయానికి అవి అవరోధాలు కాకూడదని భావించింది. పట్టుదలతో తాను అనుకున్నది సాధించి.. ఇప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. 37 ఏళ్లుగా కానిస్టేబుల్‌గా సేవలందించిన సరోజినీ లక్రా ఐపీఎస్ అధికారిగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శప్రాయమని చెప్పాలి. గిరిజన కుటుంబం నుండి వచ్చిన సరోజినీ.. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు విశేష కృషి చేసింది. ఆమె పట్టుదల, అకుంఠిత దీక్ష ఈ రోజు ఆమెను ఐపీఎస్ అధికారిగా నిలబెట్టాయి.

సరోజినీ లక్రాకి చిన్నప్పటి నుండి ఆటలంటే మక్కువ ఎక్కువ. అలా అని చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రోజు స్కూలుకి 5 కిలో మీటర్లు నడిచి వెళ్లేవారు. ఆటల్లో చురుగ్గా పాల్గొనేవారు. బహుమతులు గెలిచేవారు. తాను తొలిసారిగా గెలిచిన నగదు బహుమతితో .. కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని ఆవును కొన్నారు. అదే ఆమె విజయానికి నాంది. ఆమె ఆట తీరుకు మెస్మరైజ్ అయిన కోచ్ రాబర్ట్ కిస్పొట్టా ఆమెకు మరింత ప్రోత్సహానిచ్చారు. తన స్పోర్ట్స్ అకాడమీలోకి ఆహ్వానించి, శిక్షణనిచ్చారు.  అంతేకాకుండా వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలు అందించారు.  ఆమెను మేటి క్రీడాకారిణిగా తయారు చేశారు. జార్ఖండ్ తరుఫున ప్రాతినిధ్యం వహించారు. క్రీడల్లో తన ప్రతిభ చూపి పతకాలు సాధించారు. 100 మీటర్ల హర్డిల్స్, 100×400 మీటర్ల రిలే, హై జంప్, లాంగ్ జంప్ మరియు హెప్టాథ్లాన్‌తో సహా పలు విభాగాల్లో ఆమెకు పతకాలు వచ్చాయి. వీటితో పాటు ప్రశంసలు అందుకుంది సరోజినీ లక్రా.

దీంతో ఆమె స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగం వరించింది. అలా 37 సంవత్సరాల పాటు నిబద్దతగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పోలీస్ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇండియన్ పోలీస్ సర్వీసులోకి అడుగుపెట్టారు. పేద కుటుంబం నుండి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన ఆమె జీవితం మహిళలతో పాటు ఎందరికో ఆదర్శప్రాయం. ఆర్థిక సమస్యలని, ఇతర సాకులు చెప్పుకుంటూ.. ఎదగలేకపోవడానికి కారణాలు వెతుక్కుంటున్న చాలా మందికి ఆమె జీవితం ఒక గుణ పాఠమని చెప్పొచ్చు. గిరిజన నేపథ్య కుటుంబం నుండి వచ్చిన మహిళ.. క్రీడల్లోరాణించి.. ఉన్నత శిఖరాలకు ఎదగడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి