iDreamPost

Sankarabharanam Movie: శంకరాభరణం చిత్రానికి 44 ఏళ్ళు

తెలుగు సినీ చరిత్రలో అసామాన్య రికార్డులు క్రియేట్‌ చేసిన సినిమా శంకరాభరణం. ఎన్నో దేశీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా 44 ఏళ్లు పూర్త చేసుకన్న సందర్భంగా.. ఆ సినిమా వివరాలు మీకోసం

తెలుగు సినీ చరిత్రలో అసామాన్య రికార్డులు క్రియేట్‌ చేసిన సినిమా శంకరాభరణం. ఎన్నో దేశీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా 44 ఏళ్లు పూర్త చేసుకన్న సందర్భంగా.. ఆ సినిమా వివరాలు మీకోసం

Sankarabharanam Movie: శంకరాభరణం చిత్రానికి 44 ఏళ్ళు

మాస్ కమర్షియల్ సినిమాలు స్వైర విహారం చేస్తున్న టైంలో, సంగీత సంప్రదాయమే ప్రధానంగా, ప్రాణంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన.. శంకరాభరణం చిత్రం మాస్ కలెక్షన్లతో, ఏళ్ళ తరబడి ఆడేసి, దుమ్ము లేపేసింది. ఫిబ్రవరి 2, 1980లో రిలీజైన శంకరాభరణం తిరుగులేని రికార్డులను తెలుగు సినిమాచరిత్రకి బహుమతిగా తీసుకొచ్చి, ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. ఎన్ని దేశీయ అవార్డులు, మరెన్ని అంతర్జాతీయ అవార్డులు.. కళ్ళు తిరిగిపోయే రేంజ్ లో శంకరాభరణం చరిత్రని తిరగరాసింది.

ఈ సినిమాని చూసిన ఎవ్వరూ కూడా రూపాయి పెట్టి కొనుక్కోవడానికి గానీ, పంపిణీ చేయడానికి గానీ ససేమిరా ధైర్యం చేయలేకపోయారు. విడుదలకి ముందే బయ్యర్లకి, పంపిణీదారులకి షోలు వేసి వేసి శతప్రదర్శనోత్సవం జరుపుకుంది శంకరాభరణం. చూడ్డం, కళ్ళంట నీళ్ళు పెట్టుకోవడం, అద్భుతం అని పొగిడి మరీ వెళ్ళిపోవడం.. ఇదే వరస. మళ్ళీ తిరిగి చూసినవాడు లేడు. చాలా దయనీయమైన పరిస్థితిలో పడిపోయింది సినిమా విడుదలకి ముందు. చిట్టచివరకి అప్పట్లో చాలా ప్రముఖమైన పంపిణీ సంస్థ యాజమాన్యాన్ని నిర్వహించిన లింగమూర్తిగారి పుణ్యమా అని శంకరాభరణం సినిమా ఆపసోపాలు పడుతూ ధియేటర్లకు చేరుకోగలిగింది.

44 years for shankara baranam movie

మొదటివారం పూర్తిగా శూన్యం. అసలు శంకరాభరణం అనే సినిమా రిలీజైందని కూడా ఎవ్వడివకీ తెలియనంత దుర్భరస్థితిని శంకరాభరణం చవిచూసింది. మొదటి వారం తర్వాత నా సామిరంగా.. టిక్కెట్లు దొరికితే ఒట్టు. ధియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. జనం ఏదో మైకంలో పడిపోయారు. ప్రేక్షకులు సినిమాని ధియేటర్లనుంచి తీయనివ్వలేదు. అలా కలెక్షన్ల ప్రభంజనం ఊరూరా.. ఏ సెంటర్ లేదు, బి సెంటర్ లేదు, సి సెంటర్ లేదు.. ఒకటే పిచ్చి.. ఒకటే మత్తు శంకరాభరణం అంటే.

శంకరాభరణం సినిమాని ఇందులో ప్రధానపాత్రను పోషించిన చంద్రమోహన్ ని తమిళ్ రైట్స్ తీసుకోమంటే, అసలే జాగ్రత్తపరుడైన చంద్రమోహన్ భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. దాంతో తెలుగు రాకపోయినా, తమిళ నటి మనోరమగారు లక్షాయాభైవేల రూపాయలకి తమిళ రైట్స్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా వీరగా ఆడేసింది శంకరాభరణం. తర్వాత మళయాళంలోకి డబ్ అయి ఏడాదిపాటు దుళ్ళ కొట్టేసింది. అదే హిందీలో కూడా సుర్ సంగమ్ అనే టైటిల్ తో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే రూపొంది అక్కడ కూడా తన మార్క్ ని నిలబెట్టుకుంది శంకరాభరణం.

ఎవ్వడో తెలీదు జెవి సోమయాజులు. అంతకు ముందు రారా క్రిష్ణయ్య ద్వారా మొదటిసారి తెరమీద కనిపించిన ఆయన శంకరాభరణంతో ప్రతీ ఇంటిలో సంగీత శిక్షణా కార్యక్రమాలకు జగద్గురువుగా మారిపోయారు. అంతవరకూ చీప్ వేంప్ పాత్రలు వేసుకుంటున్న మంజుభార్గవి ఏకంగా నాట్యదేవత అయిపోయారు. జంధ్యాల ఒకసారి ఇంటర్వూలో చెప్పారు. తను అతి తక్కువ డైలాగులు రాసిన సినిమా అంటూ ఏదైనా ఉంటే అది శంకరాభరణం అని చెప్పుకుని మురిసిపోయారు. ఇంక వేటూరి సుందరరామ్మూర్తిగారిది విశ్వరూప విన్యాసమే ఈ సినిమా ద్వారా, ఈ సినిమా తర్వాత కూడా. జస్ట్ నామమాత్రంగా చెప్పిన లైన్ విని, కేవలం ఒక క్లాసిక్ తీయాలనే దమ్మూ, ధైర్యం ప్రదర్శించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుగారి జన్మ ధన్యమైపోయింది.

ఏనాడో సినిమా పరిశ్రమకి నటుడవుతామని వచ్చిన ఏడిద నాగేశ్వరరావుగారు నటుడిగా నిలద్రొక్కుకోలేక నిర్మాతగా మారితే, శంకరాభరణం సినిమాతో ఆయన చరిత్రకారుడిగా అందరి నీరాజనాలను అందుకున్నారు. ఇప్పటికీ ఆయన పోయిన తర్వాత కూడా అందుకుంటూనే ఉన్నారు. మద్రాసులో తన ఇంటికి, హైదరాబాదులో ఇంటికి కూడా ఆయన శంకరాభరణం అనే పెట్టుకున్నారు. అవును శంకరాభరణం సినిమాకి అంటూ ఎవ్వరికైనా అగ్రతాంబూలం ఇవ్వాలీ అంటే అది ఏడిద నాగేశ్వరరావుగారికే చెందుతుంది. లేకపోతే, ఆయన కాకపోతే ఎవడు తీస్తాడు ఇటువంటి పులిహొర సినిమా. కానీ ఈ సినిమాతో ఆయన నిర్మాతలలో పెద్ద పులి అయిపోయారు. దానికి ఆయన గట్సే ముఖ్య కారణం. ఆ తర్వాత ఎందరో నిర్మాతలు అటువంటి సినిమా తీయలేకపోయామని బాధపడుతుంటారు. ఇప్పటికి కూడా మహామహా భారీ చిత్రాలు తీసి, చరిత్ర నెలకొల్పిన అగ్ర నిర్మాత అశ్వనీదత్ అవకాశమొస్తే బాధపడుతూనే ఉంటారు.

శంకరాభరణం సినిమాతో ఏ పాటల పోటీలోనైనా ఆ పాటలే. ఇప్పటికీ అందరూ పాడుకునే పాటలవే. ఆ డైలాగులు కూడా కంఠస్థ పట్టేశారు అందరూ. పాశ్చాత్య సంగీత పెనుతుఫానులో రెపరెపలాడుతున్న సత్ సంప్రదాయపు సంగీతజ్యోతిని.. అనే శంకరశాస్త్రి డైలాగు అవపోసన పట్టేశారు. కొత్త సంగీత శిక్షణాలయాలు ఊరూరా, వాడవాడలా. ప్రత్యక్షమయ్యాయి. అప్పటివరకూ ఈగలు తోలుకుంటున్న సంగీతం మాస్టార్లకి భారీగా బేరాలొచ్చాయి. పిల్లల్ని సంగీతంలో పడేశారు పెద్దలు. మా పిల్లలు శంకరాభరణం పాటలు బాగా పాడతారు అని తలిదండ్రలు చెప్పుకునేంత సోషల్ స్టేటస్ని శంకరాభరణం పాటలు తీసుకొచ్చాయి.

బాలూగారు ఈ పాటలు నేను పాడలేను బాబోయే అని పారిపోయారు. ఆయనకి, కెవి మహదేవన్ గారికి మధ్యన గురుశిష్యుల సంబంధం చేత మహదేవన్ గారు భయపెట్టి, ముద్దులాడి బాలూగారి చేత ఆ పాటలు పాడించారు. ఆ తర్వాతే బాలూగారి పట్ల అందరికీ ఓ గౌరవభావం ఏర్పడింది. ఘంటసాలగారే తప్ప బాలూగారు ఏం గాయకుడు అనుకున్నవాళ్ళు కూడా బాలూ గారు కూడా గొప్ప గాయకుడే అని ఒప్పుకోవడం ప్రారంభించారు. చిన్నచిన్న పాత్రలు వేసిన సంగీతం పాఠం చెప్పే హార్మణీ గురువు దగ్గర్నుంచీ, అందరూ దెబ్బకి పాప్యులర్ అయి కూర్చున్నారు. దానాదీనా, శంకరాభరణం చిత్రం రాసిన చరిత్రను మరే చిత్రం రాయలేకపోయింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శంకరాభరణం సినిమా తెలుగువాళ్ళకి గర్వకారణమే. శంకరాభరణం లాంటి సినిమాని నిర్మించిన పూర్ణోదయ సంస్థ కూడా తలమానికమే. ఆవకాయ, గోంగూరు, గోదావరి.. శంకరాభరణం. .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి