iDreamPost

ఉద్యోగాల్లేవ్, అగ్నిప‌థ్ మీద యువ‌త‌కు కోపం అందుకేనా? బైట‌పెట్టిన కేంద్ర స‌ర్వే

ఉద్యోగాల్లేవ్, అగ్నిప‌థ్ మీద యువ‌త‌కు కోపం అందుకేనా?  బైట‌పెట్టిన కేంద్ర స‌ర్వే

గత వారం విడుద‌లైన కేంద్ర‌ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(Periodic Labour Force Survey-PLFS) భారతదేశంలోని జీతభత్యాల అస‌లు రంగును బైట‌పెట్టింది.

త్రివిధ‌ద‌ళాల్లో నాలుగేళ్ల‌ స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ కోసం, కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం.. దేశంలో అనేక‌ ప్రాంతాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు, యువకులు రోడ్లపైకి వచ్చారు, విధ్వంసాన్ని సృష్టించారు. రైళ్లకు నిప్పుపెట్టారు.

ఏ ఉద్యోగం లేనిచోట, క‌నీసం నాలుగేళ్ల రిక్రూమెంట్ కూడా మంచిదేగా? మ‌రి ఈ అగ్నిప‌థ్ అంటే యువ‌త ఎందుకు మండిపడుతోంది? దీనికి కార‌ణం ప‌థ‌కం కాదు. అంత‌క‌న్నా లోతైన‌ది. కేంద్రం తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే -PLFS, జూలై 2020 నుండి జూన్ 2021 అంటే క‌రోనాకాలం నాటి దేశ జీత‌భ‌త్యాల గురించి నిక్క‌చ్చిగా చెప్పింది. ఇందులోనే అగ్నిప‌థ్ మీద కోపానికి కార‌ణం ఉండొచ్చు.

దేశంలో ఉపాధి-నిరుద్యోగాన్ని లెక్క‌వేసే ల‌క్ష్యంతో భార‌త‌దేశ‌మంత‌టా ఈ స‌ర్వేని నిర్వ‌హించారు. గ‌త ద‌శాబ్ధంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగులు 3 శాతం మాత్ర‌మే పెరిగితే, అర్బ‌న్ ప్రాంతాలు అంటే ప‌ట్ట‌ణాల్లో ఈ పెరుగుద‌ల శాతం మ‌రీ దారుణం. ఒక్క శాత‌మే. అంటే శాల‌రీడ్ క్లాస్, మొండిమానులా ఎక్క‌డిక్క‌డే ఉండిపోయింది. అంటే నెల‌వారీ జీతాలిచ్చే ఉద్యోగ అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గానే పెరుగుతున్నాయా?

ఈ స‌ర్వేలో రెండు విభాగాల‌వారున్నారు. చిన్నాచిత‌క ప‌నులు చేసుకొనేవాళ్లు, నెల‌వారీ జీతాలు తీసుకొనేవాళ్లు. ఇందులో ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొనేవాళ్లున్నారు.

లేటెస్ట్ PLFS ప్రకారం, 2011-12లో రెగ్యుల‌ర్ గా జీతాలు తీసుకొనేవాళ్లు, రోజువారి కూలీలు 9.6 శాతముంటే 2021నాటికి అది 13 శాతానికి పెరిగింది. అదే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 2011-12లో 41.7 శాతంగా ఉన్న‌ ఉద్యోగులు, ప‌దేళ్ల త‌ర్వాత‌ 42.5 శాతానికి పెరిగారు. అంటే వీళ్లంద‌రూ ప్ర‌భుత్య ఉద్యోగులు అనుకోకూడ‌దు. అందులో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, క్యాబ్ డ్రైవ‌ర్లూ ఉన్నారు.

మొదటిసారి 2017-18లో PLFSను నిర్వ‌హించారు. అప్పుడు అంటే 2017-18లో రూర‌ల్ లో వేతనాల తరగతి వాటా 12.7 శాతం. అదే ప‌ట్ట‌ణాల్లో 41.4 శాతం.

న‌త్త‌న‌డ‌క‌న కొత్త ఉద్యోగాల సృష్టి
దేశం ఆర్ధిక‌వ్య‌వ‌స్థ పెరిగిపోతోంది. బిలియ‌నీర్లు పుట్టుకొస్తున్నారు. అన్నీ విజ‌య‌వార్త‌లే వింటున్నాం. కాని అదేమీద కొత్త ఉద్యోగాల‌ను క‌ల్పించ‌లేక‌పోతోంది. ఈస‌మ‌యంలో అగ్నిపథ్ వ‌చ్చింది. ఇది స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ పథకం. ఇది 17.5- 21 ఏళ్ల‌ మధ్య వయస్సు గల యువ‌త‌ను (ఈ యేడాదికి మాత్రం 23 ఏళ్లు) నాలుగేళ్ల‌కు భారతదేశ సాయుధ దళాలకు అందించే ప‌థ‌కం. నాలుగేళ్ల త‌ర్వాత అంద‌రూ ఇంటికే. అగ్నివీర్స్ కు సాధారణ సైనికులకు అందే డియర్‌నెస్ అలవెన్స్, పెన్షన్‌కు అర్హులు కారు.0

అగ్నిప‌థ్ అంటే ర‌గిలిపోతున్న వాళ్ల‌లో ఎక్కువ మంది, శాశ్వ‌త ఉద్యోగ ఆశతో, డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్త‌రాది యువ‌త‌కు, ప్ర‌భుత్వ ఉద్యోగ‌మంటే డిఫెన్స్ రిక్రూట్ మెంట్లు, రైల్వేలు. ఒక్క‌సారి క‌నుక సెల‌క్ట్ అయితే జీవితానికి ఢోకా ఉండ‌ద‌ని భావిస్తారు. కాని రైల్వేలు ఉద్యోగాల‌ను ఇవ్వ‌డంలేదుక‌దా, ఆరేళ్ల‌లో 72,000 ఉన్న‌ ఉద్యోగాల‌ను పీకేసింది.

ఇక ఆర్మీ ప‌రిస్థితికూడా అంతే. క‌రోనా వ‌ల్ల రిక్రూట్‌మెంట్‌లను రెండేళ్లపాటు నిలిపేసింది. ఇక భారీ రిక్రూట్మెంట్ ఉంటుంద‌ని ఆశించిన వేళ‌, ఏకంగా నాలుగేళ్ల తాతాల్కిక రిక్రూట్మెంట్ అనేస‌రికి యువ‌త‌లో ఆగ్ర‌హం క‌ట్ట‌లుతెంచుకుంది.

ప్రాంతీయ అసమానతలు
గ్రామీణ ప్రాంతాలలో 13 శాతం మందికి జీతాలు వ‌స్తున్నాయ‌న్న‌ది దేశ‌వ్యాప్త అంచ‌నా. నిజానికి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా లేదు. PLFS 2020-21 డేటా ప్రకారం అగ్నిపథ్ నిరసనలకు కేంద్రమైన బీహార్ ఉత్తరప్రదేశ్‌లలో శాల‌రీడ్ జాబ్స్ చాలా త‌క్కువ‌. బీహార్‌లో ఉద్యోగుల‌ వాటా 6.5 శాతమే. పోనీ ప‌ట్ట‌ణాల్లో ప‌రిస్థితి బాగుందా అంటే? జాతీయ స‌గ‌టు క‌న్నా చాలా త‌క్కువ‌. అర్బ‌న్ లో కేవలం 24 శాతం కుటుంబాలు మాత్రమే జీతంకాని, వేతనంకాని పొందుతున్నాయి. దేశంలోనే ఈ శాతం అతి తక్కువ.

దేశంలోనే జ‌నాభా ఎక్కువున్న యూపీలో పరిస్థితి కూడా అంతంత‌మాత్ర‌మే. ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీగా ఎద‌గాల‌ని టార్గెట్ పెట్టుకున్న ఈ రాష్ట్రంలో, రూర‌ల్ లో 7.3 శాతం మందికి వేత‌నాలు లేదంటే జీతాలు వ‌స్తున్నాయి. అదే ప‌ట్ట‌ణాల్లో 35.1 శాతం. రూర‌ల్ లో జీతాలు తీసుకొనే వర్గంలో ఎక్కువ‌మంది సైన్యంలో ప‌నిచేస్తున్నవాళ్లే.

ప్ర‌తి కుటుంబం త‌మ అబ్బాయికి మంచి ఉద్యోగం కావాల‌ని కోరుకొంటోంది. వాళ్ల‌మీద ఒత్తిడిపెంచుతోంది. అందుకే వాళ్లు ఇళ్లను వ‌ద‌లి, డిఫెన్స్ రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ రాష్ట్రాల్లో ప‌నిచేసేవాళ్లుక‌న్నా వాళ్ల‌మీద ఆధార‌ప‌డేవాళ్లు ఎక్కువ‌. బీహార్ లో 100 మంది క‌ష్ట‌ప‌డుతుంటే వాళ్ల మీద ఆధార‌ప‌డిన‌వాళ్లు 58 మంది ఉన్నారు. కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్య‌త కుర్రాళ్ల‌మీద ఉంది. అందుకే ఈ నాలుగేళ్ల అగ్నిప‌థ వ‌ల్ల, మా జీవితాలేం మార‌వ‌ని వాళ్లు అనుమానిస్తున్నారు.

అగ్నిప‌థ్ వ‌ల్ల ఆర్మీలో ఉన్న ఉద్యోగాలు త‌గ్గుతాయిత‌ప్ప, కొత్త ఉద్యోగాలు రావు. ఎందుకంటే రెగ్యుల‌ర్ రిక్రూట్మెంట్ ఇక మీద‌ట ఉండ‌దు. అంటే ఎవ‌రైనా సైన్యంలో చేరాలంటే అగ్నిప‌థ్ ఒక్క‌టే మార్గం.

ఉద్యోగాల సృష్టి వేగంగా లేన‌ప్పుడు యువ‌త‌కు నాలుగేళ్ల‌పాటు మిల‌ట‌రీ ట్ర‌యినింగ్ ఇచ్చి, ఆ త‌ర్వాత వాళ్ల‌ను జాబ్ మార్కెట్ కు తీసుకోనిరావ‌డం వ‌ల్ల, వాళ్ల‌కేం ఉద్యోగాలు వ‌స్తాయి? వాటికొచ్చే జీత‌మెంత‌? ఇది కొంద‌రి ప్ర‌శ్న‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి