iDreamPost

అంచనాలలో సాహోని మించిన సినిమా – Nostalgia

అంచనాలలో సాహోని మించిన సినిమా  – Nostalgia

(ఇప్పుడంటే భారీ సినిమాలుగా బాహుబలి, సాహోల గురించి చెప్పుకుంటున్నాం కాని 90వ దశకంలోనే వీటికి ధీటుగా నిలిచిన ఓ క్రేజీ మూవీ గురించి, అప్పటి హైప్ ని ప్రత్యక్షంగా చూసిన వేరే హీరో అభిమాని మాటల్లో)

1997……

పదో తరగతి పూర్తి చేసుకుని ఏదో పెద్దరికం వచ్చిన ఫీలింగ్ తో ఇంటర్ మీడియట్ ఫస్ట్ ఇయర్ వెలగబెడుతున్న రోజులు. పెన్సిల్ తో గీసినట్టు వచ్చిన నూనూగు మీసాలకే క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చుకోవడం మాములుగా ఉండేది కాదు. అప్పటి ఆ పాస్ పోర్ట్ ఫోటోలు కనక ఇప్పుడు మావాడికి చూపిస్తే రాత్రిళ్ళు జడుసుకుని నిద్రలోనే నా పీక పట్టుకోవడం ఖాయం. ఇప్పుడేదో గొప్ప గ్లామర్ తో ఉన్నామని కాదు కానీ టాలీవుడ్ హీరోల్లాగే ఏదో కొంత ఇంప్రూవ్ మెంట్ చేసుకుంటూ వచ్చాం. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో మనకు అంత ఈజీగా పిల్లనిచ్చేవాడెవడు.

అప్పటికే నరనరాల్లో సినిమా పిచ్చి. విశ్వనారాయణ కాలేజీలో ఉదయం పూట క్లాసులకెళ్ళడం మధ్యాన్నం డుమ్మా కొట్టేసి ద్వారకా కాంప్లెక్స్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఏదో ఒక థియేటర్ లో దూరిపోవడం అప్పట్లో చాలా మాములు విషయం. ఆఫ్టర్ నూన్ అటెండెన్స్ దారుణంగా ఉన్న విషయం ఇంటిదాకా రాకుండా చూడు స్వామి అని మొక్కని దేవుడు లేడు. అంత పీక్స్ లో ఉండేది సినిమా ఫీవర్. ఆ టైంలో వచ్చిందే రక్షకుడు.

అక్కినేని వారసుడు నాగార్జున హీరో. అప్పటికే మంచి ఊపులో ఉన్నాడు. ప్రపంచ సుందరి సుస్మితా సేన్ హీరోయిన్. యువతకు సంగీత దైవంలా మారిపోయిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ . జెంటిల్ మెన్ , ప్రేమికుడు, ప్రేమ దేశం, మండే సూర్యుడు లాంటి భారీ చిత్రాలను తీసి విజువల్ ట్రీట్ అంటే ఏంటో సౌత్ కు పరిచయం చేసిన కుంజు మోన్ నిర్మాత. ఇంతకంటే ఏం కావాలి. నిర్మాణంలో ఉన్నప్పుడే సినిమా పత్రికల్లో దీని గురించిన వార్తలు చదివి చిరంజీవితో ఇలాంటిది ఎవడూ ప్లాన్ చేయడే అని మనసు ఒకటే ఇదైపోయేది. ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృత ఒకోసారి నిద్రపోనిచ్చేది కాదు.

అప్పటికే ఆడియో షాపుల్లో పాటలు మారుమ్రోగిపోతున్నాయి. ఆఫ్ కోర్స్ నా వాక్ మెన్ లో కూడా. కేబుల్ రెవల్యూషన్ ఊపందుకుంటున్న రోజులవి. నాకు గుర్తుండి ఇతర హీరోల సినిమాల ఇంటర్వెల్ లో వేరే స్టార్ ట్రైలర్ ను ప్రదర్శించడమనేది నేను రక్షకుడుతోనే చూశా. రెండు నిమిషాలకే మతి పోయింది. ఆ బ్లాస్టులు, ఛేజింగులు, నడిరోడ్డు మీద యుద్ధ ట్యాంకర్ల లారీలు, ఒళ్ళు గగుర్పొడిచేలా నాగార్జున బైకు మీద చేసే విన్యాసాలు ఇవన్ని చూసి మనసులో ఫిక్స్ అయిపోయా. ఈ రక్షకుడు ఓ రేంజ్ లో ఆడేసి చిరంజీవిని సెకండ్ ప్లేస్ కి నాగార్జునని మొదటి స్థానానికి తీసుకెళ్తుందని. ఎక్కడ చూసినా దీని గురించిన చర్చే. ఏ పేపర్ తిరగేసినా రక్షకుడు వార్తలే.

ఆ సుముహూర్తం వచ్చేసింది. అక్టోబర్ 30. పుట్టడం ఒక్కటి జరగలేదు కానీ మిగిలిన బాల్యమంతా అధిక శాతం గడిచిపోయిన ద్వారకా థియేటర్లోనే రిలీజ్. ఎన్నడూ లేని రేంజ్ లో నాగ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు వేశారు. అయినా టికెట్లు దొరకడం లేదు. మొదటి రోజే రక్షకుడు చూడకపోతే ఏదో అద్భుతాన్ని మిస్ అవుతామన్న ఫీలింగ్ అప్పటికే పబ్లిసిటీ ద్వారా వచ్చేసింది. అందుకే సిఎం అపాయింట్మెంట్ అయినా ఈజీగా దొరుకుతుందేమో కానీ రక్షకుడు టికెట్లు మాత్రం అసాధ్యం అనే రీతిలో హైప్ పుట్టింది. సరే అడవులు ఉండేది జంతువుల కోసం స్నేహాలు ఉండేది సినిమా టికెట్ల కోసం అన్న సూత్రాన్ని పాటిస్తూ ఏదైతేనేం సాయంత్రం ఆటకు వెళ్లే సువర్ణావకాశం దొరికేసింది. అప్పటికే టాక్ ఏదోలా వస్తున్నా దాన్ని పట్టించుకునే స్థితిలో మేమెవరమూ లేము . అలా ఏవేవో అంచనాలతో ఊహలతో రక్షకుడు వీక్షించే మహాద్భాగ్యానికి నోచుకున్నాం

అప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టులు, వెబ్ సైట్ల రివ్యూలు ఏమి లేవు. ఎంతసేపూ మౌత్ టాకే ఆధారం. మొదటిరోజే కాబట్టి చాలా ఉద్వేగంగా ఉంది. మొదలైంది. నాగార్జున ఇంట్రో హుషారిచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆ చేతుల మీదుగా మెడదాకా నరాలు హై లైట్ అయ్యే సీన్ ని కూడా గ్రాఫిక్స్ లో చేయడం చూసి నోట మాట రాలేదు. మెల్లగా ప్రేమ కథ మొదలైంది. హీరోయిన్ తండ్రికి చెందిన కంపెనీని విలన్ కు చెందిన ఓ ఏడెనిమిది రౌడీ గ్యాంగ్ తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటారు. వాళ్ళ ఆట కట్టించేందుకు సదరు ఫాదర్ హీరో ప్రేమను అడ్డు పెట్టుకుని అక్కడ వర్కర్ గా చేరుస్తాడు . దీని ఫలితంగా హీరో నాన్న హత్య చేయబడతాడు. తర్వాత తన ప్రేమను మన హీరో గారు ఎలా కాపాడుకున్నారు అనేదే రక్షకుడు.

టికెట్లు దొరికినప్పుడు ఉన్న ఆనందం తిరుపతి లడ్లు ఫ్రీగా కొరియర్లో అందుకున్న హుషారునిస్తే సినిమా ముందుకెళ్ళే కొద్ది వస్తున్న నీరసం గవర్నమెంట్ హాస్పిటల్ జెనరల్ వార్డులో ఎవరూ పట్టించుకోని పేషంట్ లా మార్చేసింది. నాతో వచ్చిన వాళ్ళలో నాగ్ ఫ్యాన్స్ మొహాలు చూడాలి. వర్షానికి తడిసిపోయిన వంకాయ బాంబులా కన్నీళ్ళు గొంతులోనే ఆపుకున్న తీరు చూసి నాకే హృదయం బరువెక్కిపోయింది. అప్పుడప్పుడే సినిమా జ్ఞానం మొగ్గతొడుగుతున్న వయసులోనే రక్షకుడు గురించి మా బ్యాచ్ అందరం చేసిన విశ్లేషణలు వింటే కుంజు మోన్ ఖచ్చితంగా తన నెక్స్ట్ సినిమా స్టొరీ డిస్కషన్స్ కి మమ్మల్ని పిలిచేవాడు. ఆ స్థాయిలో చర్చించుకున్నాం.

దర్శకుడు ప్రవీణ్ గాంధి తనకు కుంజు మోన్ లాంటి భారీ నిర్మాత దొరికాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు యాక్షన్ సీన్స్ జొప్పించి అసలు కథను పట్టించుకోలేదో లేక కోట్ల రూపాయల ఖర్చుని తెరమీద చూపిస్తే చాలు జనం బ్రహ్మరధం పడతారని వెర్రి భ్రమలో అలా తీశాడో నాకు అర్థం కాలేదు కాని తర్వాత రక్షకుడు ప్రభావం ఒక బ్యాడ్ మూవీని ఎలా రాసుకోకూడదో నేర్చుకోవడానికి మంచి లెసన్ గా ఉపయోగపడింది. ఇన్ని తేడా కొట్టినా రెహమాన్ ని మాత్రం మేము మూకుమ్మడిగా ప్రేమించేశాం. అందరూ నిరాశ పరిచినా తనవరకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా రౌడీ గ్యాంగ్ ని నాగార్జున ఫ్యాక్టరీలో నుంచి తరుముతున్నప్పుడు వెనుక వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియో నన్ను చాలా సార్లు మూడ్ ఆఫ్ నుంచి బయటికి వచ్చేందుకు తగిన స్ఫూర్తినిచ్చింది. ఇప్పటికీ రెహమాన్ ఆల్ టైం బెస్ట్ ఆల్బమ్స్ లో రక్షకుడుకి చోటు పదిలంగా ఉంటుంది

ఇప్పుడీ డిజాస్టర్ గురించి ఇంత మ్యాటర్ ఎందుకంటారా. లాక్ డౌన్ టైంలో సూపర్ హిట్ సినిమాల గురించే కాదు కొన్ని ఇలాంటి జ్ఞాపకాలూ అవసరమే.

అప్పట్లో దర్శకుడు ప్రవీణ్ గాంధీ మా సినిమా మళ్ళి చూడండి బాగా అర్థమవుతుంది ఇంకా ఎంజాయ్ చేస్తారు అని చెప్పలేదు. కవర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఓటమిని ఒప్పేసుకున్నాడు. ఓపెనింగ్స్ కనివిని ఎరుగని స్థాయిలో వచ్చాయి. కాని అవి మూడు రోజులకే పరిమితమయ్యాయి. అతి తక్కువ రోజుల్లోనే ఏకంగా రెండు శాటిలైట్ ఛానెల్స్ లో రక్షకుడు ఒకేరోజు టెలికాస్ట్ కావడం గురించి పెద్ద చర్చే జరిగింది. దీని దెబ్బకే కుంజు మోన్ ఆర్థిక మూలాలు కదిలాయి. అయినా భయపడకుండా ఇంకో ప్రయత్నం చేద్దామని కొడుకుని హీరోగా లాంచ్ చేస్తూ కోటీశ్వరుడు అనే సినిమా ప్లాన్ చేసుకున్నారు. అది ల్యాబు నుంచి బయటికి వచినట్టు నాకు గుర్తు లేదు. కొన్ని నిర్ణయాలు అంతే. ఎందరో కెరీర్లను జీవితాలను సమూలంగా మార్చేస్తాయి.

అవి నేర్చుకునేందుకు నేను చదువుకున్న సినిమా టికెట్ల పుస్తకంలో నాకు బాగా నచ్చిన పేజీ ఈ రక్షకుడు ….

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి