iDreamPost

రష్యా రివర్స్‌ హెచ్చరికలు

రష్యా రివర్స్‌ హెచ్చరికలు

ప్రపంచమంతా వద్దంటున్నా ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగిస్తూనే ఉంది. దీంతో రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు పాశ్చాత్య దేశాలు ఆంక్షల యుద్ధం ప్రకటించాయి. ఆ దేశ ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా రష్యా చమురుపై కూడా అమెరికా నిషేధం విధించింది. అయినప్పటికీ రష్యా ఏమాత్రం బెదరకపోగా రివర్స్‌లో పాశ్చాత్య దేశాలపై విరుచుకుపడుతోంది. హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తమపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలకు నొప్పి తెలిసే విధంగా తాము కూడా ఆంక్షలను విధిస్తామని రష్యా ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖకు చెందిన ఆర్థిక సహకార విభాగం డైరెక్టర్‌ దిమిత్రీ బిరిచెవ్‌స్కీ వెల్లడించారు. ఈమేరకు రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ ‘ఆర్‌ఐఏ’ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘రష్యా ప్రతిస్పందన అత్యంత వేగంగా, కచ్చితంగా ఉంటుంది. మేం విధించబోయే ఆంక్షలను ఎదుర్కొనే వారికే వాటి నొప్పి తెలుస్తుంది. పాశ్చాత్య దేశాలపై ఎటువంటి ఆంక్షలను విధించాలనే దానిపై ప్రస్తుతం సమాలోచనలు జరుగుతున్నాయి’ అని దిమిత్రీ బిరిచెవ్‌స్కీ పేర్కొన్నారు.

ఇక రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతిపై మంగళవారం నిషేధాన్ని ప్రకటించిన అమెరికా.. దాని మిత్రదేశాలను అన్నింటిని ఆ దిశగా ఏకతాటిపైకి తేలేకపోయింది. ఈవిషయాన్ని సాక్షాత్తూ అమెరికా ప్రభుత్వ వర్గాలే బుధవారం వెల్లడించాయి. ‘‘మా (అమెరికా) దేశంలో ఇంధన వనరుల లభ్యత సమృద్ధిగా ఉంది. అందుకు సంబంధించిన మౌలిక వసతులు కూడా ఉన్నాయి. మా మిత్రదేశాల్లో ఇదే స్థాయిలో వనరులు లేవు. అందుకే అవి రష్యా నుంచి చమురు దిగుమతిపై నిషేధాన్ని ప్రకటించలేకపోతున్నాయి’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాలకవర్గంలోని ఓ సీనియర్‌ అధికారి స్పష్టంచేశారు.

మరోవైపు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సంబంధించిన బిల్లును న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఆమోదించింది. దీంతో న్యూజిలాండ్‌లో ఉన్న రష్యా ప్రభుత్వ పెద్దల ఆస్తులను స్తంభింపజేసేందుకు మార్గం సుగమమైంది. వారి నౌకలు, విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిలువరించేందుకు ఈ ఆంక్షలతో బాటలుపడ్డాయి. రష్యాకు చెందిన మరో 160 మంది ప్రభుత్వ పెద్దలు, చట్టసభల సభ్యుల పేర్లను ఆంక్షల జాబితాకు చేర్చేందుకు యూరోపియన్‌ యూనియన్‌ బుధవారం పచ్చజెండా ఊపింది. వారికి చెందిన ‘క్రిప్టో’ ఆస్తులను స్తంభింపచేస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న బెలారస్‌ దేశానికి చెందిన మూడు బ్యాంకులను కూడా ‘స్విఫ్ట్‌’ వ్యవస్థ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఓ వైపు రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలను వ్యతిరేకిస్తున్న చైనా.. మరోవైపు యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌కు మానవతా సహాయాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రూ.6 కోట్లు విలువైన ఆహారం, నిత్యావసరాలను ఉక్రెయిన్‌కు పంపినట్లు చైనా వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి