iDreamPost

దోచుకునే ఉద్దేశం ఉందా? మరి అందుబాటులో ఎక్కడ?

దోచుకునే ఉద్దేశం ఉందా? మరి అందుబాటులో ఎక్కడ?

దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం. దాదాపుగా 50 రోజులుగా లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని మద్యం షాపులన్నీ మూతవేసి ఉన్నాయి. మొన్న కేంద్రం మద్యం అమ్మకాలు చేసుకునేందుకు సడలింపులు ఇచ్చింది. కేంద్ర మార్గదర్శకాలకు లోబడి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేసినట్లే ఏపీలోనూ మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. ఇందులోనూ విపక్షాలు విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెడుతున్నాయి. మద్యంతో ఖజానా నింపుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొందరు విపక్ష నాయకులు అంటుంటే.. దోపిడీ చేస్తోందని కొందరు, మంచి బ్రాండ్లు దొరకడం లేదని కొందరు, జే ట్యాక్స్‌ అని కొందరు అసంబద్ధ విమర్శలు చేస్తున్నారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయా?æ తెలుసుకుందాం.

మద్యం దుకాణాల లభ్యత..
ఎప్పుడైనా పండుగల సమయంలో చూస్తే అన్ని రకాల దుకాణాలు తమకు అనుబంధంగా అనేక ఔట్‌లెట్లను తెరుస్తాయి. వినియోగదారునికి అత్యంత దగ్గరగా తమ వస్తువులను తీసుకెళ్లి ఎక్కువ అమ్మకాలు సాగించి లబ్ధి పొందడానికి ఇలా చేస్తాయి. ఇదో బిజినెస్‌ ట్రిక్‌. ఇప్పుడు మద్యం షాపుల విషయానికొద్దాం. 50 రోజులుగా మద్యం అమ్మకాలు లేవు కాబట్టి మద్యం ప్రియులను ఎక్కువ చేరుకోవడానికి వీలుగా ఎక్కువ దుకాణాలు తెరిస్తే అధిక లబ్ధి చేకూరుతుంది. అయితే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మాత్రం దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించింది. చంద్రబాబు హయాంలో అధికారిక లెక్కల ప్రకారం 4,380 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ప్రతి గ్రామంలో దాదాదాపు 43 వేల బెల్టు షాపులు ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం అవి పూర్తిగా కనుమరుగు అయిపోయాయి. మొదట్లోనే మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని 20 శాతం తగ్గించారు. అంటే కేవలం 3,500 షాపులు మాత్రమే తెరిచారు. ఇప్పుడు తాజాగా మరో 20 శాతానికి పైగా తగ్గించారు. ప్రస్తుతం 2,345 షాపులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వానికి మద్యం అమ్మకాల వల్ల వచ్చే ఆదాయంపై మోజే ఉంటే మద్యం షాపులను ఇంత భారీగా తగ్గిస్తుందా?

ధరల పెంపు..
ఒక తినుబండారంపై మనకు విపరీతమైన మోజు ఉందనుకుందాం. దాని ధర రూ. 100. మనకు ఇష్టం కాబట్టి ఆ ధరకు కొనేస్తాం. రెండో రోజు 20లకు ధర పెంచితే.. అలవాటు పడ్డ ప్రాణం కాబట్టి సరే అని కొంటాం. మూడో రోజు మరో 30 రూపాయలు పెంచితే.. కాస్త ఆలోచిస్తాం. తర్జనబర్జన తర్వాత కొంటాం. నాలుగో రోజు మరో 20 పెంచితే.. ఆపై మరో 30 పెంచితే..? మనకెందుకులే అనుకుని మెల్లగా దానిపై ఆశను చంపుకుంటాం. కొన్నాళ్లకు దానిపై పూర్తిగా మోజు చచ్చిపోతోంది. ఇప్పుడు మద్యం ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇదే చేస్తోంది. పేదలకు మద్యాన్ని దూరం చేయడానికి మద్యం ధరలను మొదట 25 శాతం పెంచింది. అలవాటు పడ్డ ప్రాణాలు కాబట్టి ప్రజలు మొదటి రోజు మద్యం షాపుల వద్ద క్యూ కట్టారు. రెండో రోజు ప్రభుత్వం మరో 50 శాతం పెంచింది. అంటే మొత్తంగా 75 శాతం పెంచినట్లయింది. దీంతో మద్యం షాపుల వద్ద రెండో రోజే జనాలు తగ్గిపోయారు. ప్రభుత్వానికి మద్యం ఆదాయంపై ఆశే ఉంటే ధరలు ఇలా పెంచుతుందా?

మద్యం బాబుల ఆరోగ్యంపై శ్రద్ద..
మద్యంపై ఆంక్షలు పెట్టడమే కాకుండా, దానికి బానిసలు అయిన వారికి చికిత్స అందించడానికి ప్రతి జిల్లాలో ప్రభుత్వం డీ అడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ వారికి అవసరమైన కౌన్సిలింగ్‌ ఇవ్వడమే కాకుండా ఔషధాలు అందించే ఏర్పాటు చేసింది. మద్య విమోచన కమిటీని ఏర్పాటు చేసి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళుతోంది.

సమయం.. ఆదాయ టార్గెట్లు!!
చంద్రబాబు హయాంలో ఉదయం 9 గంటలకు మద్యం షాపులు తెరుచుకుంటే.. అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగేవి. పండుగలు, ప్రత్యేక దినాల్లో అయితే ఇంకాస్త సమయం ఎక్కువ తెరిచేవారు. పైగా అమ్మకాల్లో టార్గెట్లు పెట్టేవారు. ఇలా పేదల నుంచి దోచుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మద్యం షాపులను ప్రైవేటు చేతుల నుంచి ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పుడు ఎలాంటి టార్గెట్లు లేవు. ఉదయం 11 గంటలకు తెరిస్తే, సాయంత్రం 7 కల్లా క్లోజ్‌ చేయాల్సిందే. పైగా అక్కడే మద్యం కూర్చొనే సదుపాయాన్ని తీసేశారు. అన్ని పర్మిట్‌ రూంల అనుమతులను రద్దు చేశారు. బార్లను పూర్తిగా మూసేశారు.

మద్యాన్ని ప్రోత్సహించే ఉద్ధేశం ప్రభుత్వానికి ఉంటే ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడుతుంది? ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తలెత్తే ప్రశ్నలు. కానీ విపక్షాలకు మాత్రం ఇవేమీ కనపడవు. వినపడవు. ఎందుకంటే వారికి ప్రభుత్వంపై విమర్శలే లక్ష్యం. వాటికి వాస్తవాలతో ఎంత మాత్రం పనిలేదు. రాళ్లు వేస్తూనే ఉంటాయి. అయితే విపక్షాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే? ఆ విమర్శలు రాళ్లే ప్రభుత్వానికి పునాది రాళ్లని.

మరో విషయం ఏంటంటే.. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ప్రతి ఏటా మద్యం షాపులను తగ్గించుకుంటూ వెళ్లి, ఐదో ఏడాదికి కేవలం త్రీ స్టార్, ఫైవ్‌ స్టార్‌ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేసేలానే అడుగులు వేస్తున్నారు. అలాగే మద్యం ముట్టుకోవాలంటే షాక్‌ కొట్టేలా చేస్తానన్నారు. ఇప్పుడు అలాగే ధరలను పెంచుతున్నారు. ఈ పరిణామాలను విపక్షాలు గమనిస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి