iDreamPost

వరల్డ్ కప్ ముందు చిక్కుల్లో రోహిత్‌ శర్మ! ఇలా అయ్యిందేంటి?

  • Published Sep 23, 2023 | 1:45 PMUpdated Sep 23, 2023 | 1:45 PM
  • Published Sep 23, 2023 | 1:45 PMUpdated Sep 23, 2023 | 1:45 PM
వరల్డ్ కప్ ముందు చిక్కుల్లో రోహిత్‌ శర్మ! ఇలా అయ్యిందేంటి?

మొహాలీ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. స్టార్‌ ఆటగాళ్లు లేకున్నా.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఓడించడంతో కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని యంగ్‌ టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలాంటి విజయం భారత జట్టుకు మంచి బూస్ట్‌అప్‌ ఇచ్చింది. పైగా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో.. భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ.. ఆస్ట్రేలియాపై 5 వికెట్లతో సత్తాచాటడంతో రోహిత్‌ చిక్కుల్లో పడ్డాడు.

చాలా కాలంగా టీమిండియా కీలక బౌలర్‌గా ఉన్న షమీ.. జట్టులో రెగ్యులర్‌గా ఉండటం లేదు. కానీ, ఆసీస్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆడి, అద్భుత స్పెల్‌తో ఐదు వికెట్ల హాల్‌ సాధించాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసి 51 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే డేంజరస్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ను అవుట్‌ చేసిన షమీ, తర్వాత.. ప్రమాదకరంగా మారుతున్న స్టీవ్‌ స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి.. టీమిండియాకు కీలకమైన బ్రేక్‌ త్రూ అందించాడు. ఆ తర్వాత.. ఇన్నింగ్స్‌ చివర్లో అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశాడు. భారీ షాట్లకు ప్రయత్నిస్తున్న స్టోయినిస్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడమే కాకుండా.. మరో రెండు వికెట్లు తీసుకుని.. ఐదు వికెట్ల ఫీట్‌ సాధించాడు.

ఈ ప్రదర్శనతో షమీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. పిచ్‌ నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా, బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌పై షమీ ఐదు వికెట్లతో చెలరేగాడం, అందులోనా ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేయడంతో ఇక షమీ లేకుండా టీమిండియా వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగకూడదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో షమీతో పాటు సిరాజ్‌, బ్రుమాలు కూడా జట్టులో ఉండాల్సిన పరిస్థితి. కానీ, రోహిత్‌ శర్మ మాత్రం ఇంతకాలం ఎక్స్‌ట్రా బ్యాటర్‌ కోసం శార్దుల్‌ ఠాకూర్‌ను బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఆడిస్తున్నాడు. మరి ఇప్పుడు ముగ్గురు క్వాలిటీ పేసర్లు అద్భుత ఫామ్‌లో ఉండటంతో టీమిండియాకు ఎక్స్‌ట్రా బ్యాటర్‌ అవసరం లేదని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. పైగా టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ మొత్తం ఫామ్‌లో ఉంది. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ.. ముగ్గురు పేసర్లతో వెళ్లాలా, లేక ఎక్స్‌ట్రా బ్యాటర్లతో వెళ్లాలా అనేది పెద్ద సమస్యగా మారింది. మరి ఈ తలనొప్పిని రోహిత్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తాడో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పిచ్చి ప్రయోగాలన్నాం.. కానీ, ఇప్పుడు ద్రవిడ్‌ వల్లే టీమ్‌ సూపర్‌గా ఉంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి