iDreamPost

పాత “పలుకుల”కే కొత్త హెడ్డింగ్

పాత “పలుకుల”కే కొత్త హెడ్డింగ్

తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి ఏ విధంగా అండగా నిలుస్తుందనే విషయం గురించి ప్రతీ సారి ఉపోద్ఘాతం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెదేపా అనుకూల మీడియాలోనూ వారికి ఆత్మబంధువు లాంటిది ‘ఆంధ్రజ్యోతి’; వారి ఆక్రోశానికి, అసహనానికి, ఉడుకుబోతుతనానికి ఆర్కే ‘కొత్త పలుకు’ ప్రతిబింబమనీ అదే పనిగా చెప్పక్కర్లేదు.

కనుక విషయంలోకి వచ్చేద్దాం …

“తన సామాజికవర్గంపై ఇతర కులస్థులలో వ్యతిరేకత ఏర్పడేలా ఒక పథకం ప్రకారం ప్రత్యర్ధులు ప్రచారం చేసినా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో చంద్రబాబు అలక్ష్యం ప్రదర్శించారు.”

ఇది మే 26, 2019 న ప్రచురితమైన ఆర్కే వీకెండ్ కామెంట్ – అంటే తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా కాక ముందే ‘కొత్తపలుకు’ లో వచ్చిన రోజన్నమాట.దీన్ని బట్టి చూస్తే తెదేపా మీద వేసిన కులముద్రే వైసీపీ ఘనవిజయానికి కారణమని ప్రచారం చేయడానికి రంగం ఎప్పుడో సిద్ధమైందనమాట. అందుకే అవకాశం దొరికినప్పుడంతా ఆర్కే తన పలుకుల్లో సామాజికవర్గాల ప్రస్తావన తీసుకొస్తుంటారు.

చంద్రబాబు ఓటమికి కుమిలిపోతూ, ఆయన తప్పిదాలన్నిటినీ జులై 14 న ఆర్కే గారే ఏకరువు పెట్టారు. రాజధాని కోసం చేసిన భూసేకరణలో కుంభకోణం జరిగింది అంటూ చేసిన ప్రచారం – “రాజధాని మా కోసం కడుతున్నారా ? కమ్మ సామాజికవర్గం కోసం కడుతున్నారు” అని ఇతర సామాజికవర్గాల వారు భావించే వరకు సాగింది. దాని తర్వాత కూడా జగన్ విజయానికి ఎలాగైనా వంక పెట్టాలనే దురాలోచన ఆగష్టు 25 న ఆర్కే విరచిత కొత్త పలుకులో “జగన్ పులుకడిగిన ముత్యం అని ప్రజలు ఓటేయ్యలేదు. కులం-మతం ప్రాతిపదికగా జగన్ కు మద్దతు లభించింది” అనే వాక్యం రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది.

సెప్టెంబర్ 15న మీడియా పైన జగన్మోహన్ రెడ్డి తీరు బాలేదంటూ నిప్పులు చెరిగిన ఆర్కే అందులో కూడా అవకాశాన్ని అంది పుచ్చుకుని – “ఫలానా సామాజికవర్గం వాళ్లు నా టార్గెట్” అని జగన్ ఎవరో వ్యాపారవేత్తతో అన్నాడని ఒక పిట్టకథ లాంటిదొకటి రాసేశారు. ఇక అక్టోబర్ 27న అయితే ఆర్కే విజృంభించారు – ఎంత చేసినా కమ్మ సామాజికవర్గం తెలుగుదేశం వెంటనే ఉంటుందని, కాపులకు మంచి చేసినా వైసీపీకి మద్దతిస్తారని నమ్మలేమని, అందుకోసం మిగిలిన సామాజికవర్గాలన్నిటినీ మంచి చేసుకునే పనిలో జగన్ ఉన్నట్టు కనిపిస్తోందని పలువురు అనుకుంటున్నట్టు ఆర్కే సెలవిచ్చారు.

పోలీసు స్టేషన్లలో కానిస్టేబుళ్ల నియామకం నుంచి వేకెన్సీ రిజర్వ్ లోకి పంపిన 40 మంది డీఎస్పీల్లో 30 మంది కమ్మ వారని లెక్కలు చెప్పేశారు. ఇక నవంబర్ 3 న ‘మీడియాకు కులాన్ని అంటగడతారా ?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్కే అక్కడ కూడా జగన్ కమ్మ సామాజికవర్గం మీద వ్యతిరేకత తీసుకొచ్చే లాభపడ్డాడన్నట్టుగా యధావిధిగా ఒక మాట రాసేశారు. కేవలం ఒక సామాజికవర్గం వారికే మద్యం దుకాణాలు ఎక్కువ ఉండడంతో వారిని ఆర్ధికంగా దెబ్బ తీసేందుకే జగన్ ఈ మద్యం పాలసీని తీసుకొచ్చాడు అన్నట్టుగా ఒక సారి ప్రస్తావించారు. మధ్యలో ఒక వారం ఏదో ప్రస్తావనలో “రాష్ట్రంలో జగన్ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు, తన కార్యాలయంలోనే కాకుండా తన చుట్టూ కూడా క్రిస్టియన్ కోటరీని ఏర్పరుచుకుంటున్నారని మోదీ వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం” అంటూ వ్యాఖ్య ఒకటి చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ‘రహస్య అజెండా’ మత మార్పిడే అంటూ రాసిన విపరీత ధోరణిని ‘అంతర్జాతీయ సమాజం’ మొత్తం చూసింది.

వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికన్నా ముందు నుంచే ఏదో ఒక అవకాశాన్ని సృష్టించుకుని తరచూ జగన్ కు మతాన్ని ఆపాదించాలని, ఒక కుల ద్వేషిగా జగన్ పైన ముద్ర వేయాలని ఆర్కే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎవరికైనా అనిపించడంలో తప్పేముంది ?

ఇక రాజధాని విషయంలో వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయం వెనుక సామాజికవర్గమే ప్రధాన ఎజెండా అని ఆర్కే ప్రచారం చేస్తారనే విషయం తెలుగువారికి ఏ మాత్రం ‘కొత్త’గా అనిపించదు. “వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే ఆరోపించే వారు కానీ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా/మూడు నెలలైనా/ఐదు నెలలైనా/ఆరు నెలలైనా/ ఏడు నెలలైనా రుజువు చేయలేకపోయారు” అంటూ జనంలో తెలుగుదేశం వాళ్ళు పునీతులనే భ్రమ కలిగించాలని చూస్తున్న ఆర్కేను చూస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే దాదాపు ఏడేళ్ల నుంచి వైఎస్ జగన్ మీద లక్ష కోట్లు అవినీతి చేసాడు అనే ప్రచారాన్ని చేస్తూనే ఉన్నా ఒక్క కోటి రూపాయల అవినీతి కూడా రుజువు చేయలేకపోయారనే విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసు కనుక. ఆ విషయంలో “జగన్ పైన చేసిన లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల్ని తెలుగుదేశం వాళ్ళు ఐదేళ్లు అధికారంలో ఉన్నా నిరూపించలేకపోయారు” అని ఏనాడూ ఆర్కే ప్రశ్నించిన పాపాన పోలేదు కనుక.

ఏది ఏమైనా జనానికి ఈ రోజుతో చంద్రబాబును ఆర్కే అంతలా వెనకేసుకు రావడం వెనుక కారణం గురించి ఒక స్పష్టత వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి