iDreamPost

ఏఆర్ రెహమాన్ తో ఇప్పుడు రిస్కే

ఏఆర్ రెహమాన్ తో ఇప్పుడు రిస్కే

ఇప్పుడు ఉన్నట్టుండి తెలుగు సినిమా సంగీత ప్రియులను ఎవరైనా ఏఆర్ రెహమాన్ ఆఖరి బెస్ట్ ఆల్బమ్ ఏది అంటే కొంచెం సేపు ఆలోచించాల్సిందే. అలా ఉంది పరిస్థితి. ఒకప్పుడు కేవలం తన పేరు మీదే లక్షలాది క్యాసెట్లు అమ్మించి ఆడియో కంపెనీలకు కల్పవృక్షంగా మారిన రెహమాన్ మేజిక్ ఏనాడో అవుట్ డేటెడ్ అయిపోయింది. ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే చిన్న లెక్క చూద్దాం. విజిల్, సర్వం తాళ మయం, 2.0, సర్కార్, నవాబ్, అదిరింది, మామ్, చెలియా, సాహసం శ్వాసగా సాగిపో, 24, ప్రేమాలయం ఇవన్నీ గత ఆరేళ్ళ కాలంలో తెలుగులో డబ్ అయిన రెహమాన్ తమిళ ఆల్బమ్స్.

వీటిలో ఒక అద్భుతమైన పాట ఏదైనా పాడమంటే కొంచెం టైం తీసుకోవాల్సిందే. ఇది ఇప్పటి రెహమాన్ ట్రాక్ రికార్డు. అదే రోజా, బొంబాయి, ప్రేమదేశం, భారతీయుడు లాంటి పేర్లు చెప్తే చాలు చరణాలతో సహా పడే మ్యూజిక్ లవర్స్ ఎందరో ఉన్నారు. ఇప్పుడు రెహమాన్ కు గత వైభవం లేదన్నది వాస్తవం. చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి కానీ వింటేజ్ రెహమాన్ కు కోరుకుంటున్నారు అభిమానులు ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందబోయే శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం రెహమాన్ ను ట్రై చేస్తున్నట్టుగా సమాచారం.

ఇలా అయితే సినిమాకు బ్రాండ్ వేల్యూ పెరుగుతుందని వేరే భాషల్లో కూడా డబ్బింగ్ ద్వారా అదనపు ఆదాయం టార్గెట్ చేయొచ్చనే మాట వినిపిస్తోంది. అసలే రెహమాన్ కు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఎప్పుడూ కలిసి రాలేదు. అప్పుడెప్పుడో వెంకటేష్ సూపర్ పోలీస్ తో మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ కొమరం పులి దాకా అన్ని డిజాస్టర్లే. భీకరమైన ఫామ్ లో ఉన్నప్పుడే రెహమాన్ లో నేరుగా తెలుగు హిట్స్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు నాని సినిమాకు తీసుకోవడం అంటే బడ్జెట్ పరంగానే కాదు ఆల్బమ్ అవుట్ ఫుట్ కోణంలోనూ అనుమానాలు వస్తాయి. ఇది అధికారికంగా తెలియలేదు కానీ శ్యామ్ సింగరాయ్ కోసం రెహమాన్ పేరు పరిశీలనలో ఉన్న మాటైతే వినిపిస్తోంది. మరి ఇది కార్యరూపం దాలుస్తుందా లేక మేకర్స్ వేరే ఆప్షన్ చూస్తారా అనేది వేచి చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి