iDreamPost

రూ.కోట్లు సంపాదిస్తున్నా ఇంటింటికీ తిరిగి గ్యాస్ సిలిండర్లు వేస్తున్నాడు!

  • Author singhj Published - 01:50 PM, Thu - 3 August 23
  • Author singhj Published - 01:50 PM, Thu - 3 August 23
రూ.కోట్లు సంపాదిస్తున్నా ఇంటింటికీ తిరిగి గ్యాస్ సిలిండర్లు వేస్తున్నాడు!

సెలబ్రిటీ స్టేటస్ వచ్చేదాకా చాలా మంది ఎంతగానో కష్టపడతారు. కానీ ఒక్కసారి ఫేమ్ వచ్చిందా ఇక వారికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రూ.కోట్లలో డబ్బులు సంపాదించే సినీ, క్రీడా ప్రముఖులు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు డబ్బు ఉందని పొగరు చూపిస్తారు. కానీ ఇంకొందరు మాత్రం తమ మూలాలు గుర్తుపెట్టుకొని ఎప్పుడూ ఒకేలా ప్రవర్తిస్తారు. ‘కేజీఎఫ్​’ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ ఫ్యామిలీ కూడా అలాంటిదే. యష్ ఎంతో పెద్ద స్టార్​గా ఎదిగినా ఆయన తండ్రి మాత్రం తన మూలాలు మరువలేదు. ఇప్పటికీ డ్రైవర్​గా బస్సు నడుపుతున్నారు. ఇలాంటిదే మరో క్రికెటర్ విషయంలోనూ రిపీట్ అయ్యింది.

కోల్​కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ కష్టాల కడలిని దాటి, అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. పేదరికంలో జన్మించిన ఈ లెఫ్టార్మ్ బ్యాటర్.. గేమ్​తో పాటు ఆర్థికంగానూ ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాకు ఆడే దిశగా దూసుకెళ్తున్నాడు. అయితే తమ ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పటికీ ఇంకా కష్టపడుతున్నారు రింకూ తండ్రి కంచంద్ర సింగ్. ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో ఆడటం ద్వారా తన కొడుకు రూ.కోట్లు సంపాదిస్తున్నా ఆయన మాత్రం ఇంకా పనిచేస్తున్నారు. ఖాళీగా ఉండటం తనకు నచ్చదంటున్న కంచంద్ర సింగ్.. ఇంటింటికీ తిరిగి గ్యాస్ బండలు డెలివరీ చేస్తూనే ఉన్నారు.

రింకూ తన తండ్రి కంచంద్ర సింగ్ గురించి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాన్నను రిలాక్స్ అవ్వమని చెప్పినా ఇప్పటికీ ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు వేసే పనిమానుకోలేదని రింకూ చెప్పాడు. ఆయనకు ఆ పని అంటే చాలా ఇష్టమని.. ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని అంటారని తెలిపాడు. చిన్న వయసు నుంచే కష్టపడి పని చేయడం అలవాటైన వ్యక్తికి, ఇప్పడు ఒకేసారి ఊరికే కూర్చోమంటే కష్టమే కదా అని రింకూ సింగ్ పేర్కొన్నాడు. కాగా, 25 ఏళ్ల రింకూ ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం తన తండ్రి, సోదరుడితో కలసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేవాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి