iDreamPost

సుజనా వెర్సస్‌ జీవీఎల్‌..

సుజనా వెర్సస్‌ జీవీఎల్‌..

రాజధాని అమరావతి అంశం జాతీయ పార్టీ అయిన బీజేపీలో చిచ్చు పెడుతోంది. రాజధాని విషయం కేంద్రం పరిధిలోనిదని, కాదు రాష్ట్ర పరిధిలోనిదని బీజేపీలోని నేతలు మాట్లాడుతున్నారు. ఇది చినికి చినికి ఆ పార్టీ నేతల మధ్య వివాదానికి దారితీస్తోంది. బీజేపీలో ఆది నుంచి ఉన్న నేతలు రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని చెబుతుండగా.. 2019 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పార్టీలో చేరిన నేతలు, ప్రజా ప్రతినిధులు మాత్రం రాజధాని అమరావతిపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పుకొస్తున్నారు. టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని కేంద్ర హోం శాఖసహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభలో పలుమార్లు చెప్పినా.. ఇంకా ఈ అంశంపై బీజేపీలో నేతల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు వారి మధ్య వివాదానికి కారణమవుతున్నాయి.

రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమైన కూడా కేంద్రం సరైన సమయంలో అమరావతిపై జోక్యం చేసుకుంటుందని టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చుతూ కేంద్రం పేరును ఉపయోగిస్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకోదని ఎల్లయ్యలు, పుల్లయ్యలు చెబితే తాను స్పందించాల్సిన అవసరం లేదని పరోక్షంగా బీజీపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌పై విమర్శలు చేశారు.

జీవీఎల్‌ కూడా సుజనాకు గట్టి కౌంటర్‌ ఇస్తూ పార్టీలో తన పోజిషన్‌ ఏంటో తెలియజెప్పారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే తాను రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ విధానమే తాను చెబుతున్నానంటూ సుజనా ప్రకనటకు చెక్‌ చెప్పారు. రాజధానిపై మరో మాట లేదని, ఉత్తరాంఖండ్‌ విషయాన్ని ఉదహరించారు. ఎవరైనా సొంత అభిప్రాయాలు చెప్పేవారు తనపై దుష్ప్రచారం చేస్తే ఎవరూ నమ్మరంటూ సుజనాకు చురకలు అంటించారు. పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడుతున్నారే ఇటీవల రాష్ట్ర నేతలతో జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించి వారికి లైన్‌ తెలియజేసి వారించానని పేర్కొంటూ పార్టీలో తన స్థానమేంటో సుజనాతోపాటు పార్టీ నేతలకు చెప్పకనే చెప్పారు.

ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు నడుస్తోంది. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఏపీలో బలపడాలని చూస్తోన్న బీజేపీకి ఆ పార్టీలో నేతల మధ్య సమన్వయలేమి సమస్యగా మారుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదహరణగా జీవీఎల్, సుజానా చౌదరి ఎపిసోడ్‌ను చెప్పవచ్చు. నేతల తీరుతో కార్యకర్తల్లోనూ గందరగోళం నెలకొంది. రాబోయే రోజుల్లో బీజేపీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి