ajaykrishna
ajaykrishna
తెరపైకి ఎన్ని కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్ వచ్చినా.. థ్రిల్లర్ మూవీస్ కి, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కి ఉండే క్రేజ్ వేరు. అవి ఎలాంటి టైమ్ లో వచ్చినా కథాకథనాలు కుదిరాయి అంటే చాలు. సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతారు ఆడియన్స్. అయితే.. రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్లకుండా తాను కూడా థ్రిల్లర్ తో అలరిస్తానని రెడీ అయిపోయాడు. ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. రాజుగారి గది లాంటి హిట్ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు అశ్విన్. దీంతో కొంచం గ్యాప్ తీసుకొని లేట్ అయినా పర్లేదని.. హిడింబ అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేశాడు. టైటిల్, ట్రైలర్ లతో ఇంటరెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. మొత్తానికి జులై 20న అంటే ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి అశ్విన్, నందితా శ్వేత జంటగా జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్పాప్ అవుతుంటారు. కిడ్పాప్ కు గురైన అమ్మాయిల కేసును పోలీస్ ఆఫీసర్ అభయ్(అశ్విన్) లీడ్ చేస్తుంటాడు. కానీ.. కిడ్నాప్ కి గురైన అమ్మాయిల ఆచూకీ తెలుసుకోవడంలో విఫలం అవుతాడు. దీంతో గవర్నమెంట్, పోలీస్ శాఖలపై ఒత్తిడి పెరిగి.. ఈ కేసులోకి స్పెషల్ ఆఫీసర్ గా ఆద్య(నందిత)ని అపాయింట్ చేస్తారు. ఇక అభయ్, ఆద్య ఇన్వెస్టిగేషన్ లో కాలా బండలోని బోయ అనే ముఠాను పట్టుకుంటారు. ఆ ముఠా వద్ద ఉన్న అమ్మాయిలను కాపాడతారు. దీంతో కేసు ముగిసింది అనుకుంటారు. అప్పుడే ఊహించని విధంగా మరో అమ్మాయి కిడ్నాప్ అవ్వడంతో కేసు మళ్లీ మొదటికి వస్తుంది. ఈ క్రమంలో రెడ్ డ్రెస్ ధరించిన అమ్మాయిలే కిడ్నాప్ అవుతున్నారని కనుక్కుంటారు. కట్ చేస్తే.. బయట వేరే ముఠా ఉందని తెలుస్తుంది. అక్కడినుండి కథ చాలా చోట్లకు తిరుగుతుంది. మరి అసలు అమ్మాయిల కిడ్నాప్ వెనుక కారణం ఏంటి? రెడ్ డ్రెస్ అమ్మాయిలే ఎందుకు కిడ్నాప్ అవుతున్నారు? మధ్యలో బోయ ముఠా ఏంటి? అసలు ముఠాను పట్టుకోడానికి పోలీసులు ఏం చేశారు? అసలు కథలో హిడింబ ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘హిడింబ’ అనే పేరుకు ఎలాంటి చరిత్ర ఉందో తెలిసిందే. మహాభారతంలో హిడింబ గురించి వినే ఉంటారు. మరి ఆ పేరును సినిమా టైటిల్ గా పెట్టారంటే.. కథాంశం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో ఊహించుకోండి. ఈ సినిమా కోసం డైరెక్టర్ అనిల్ కన్నెగంటి ఎంచుకున్న కథాంశం కొత్తగానే ఉంది. మనుషులను తినే గిరిజన జాతి.. జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది.. అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అందుకోసం ఎంచుకున్న థీమ్ కూడా పర్వాలేదు. కానీ.. అన్ని ఉన్నా ఎగ్జిక్యూషన్ లో తేడా కొట్టినట్లు అయిపోయింది హిడింబ పరిస్థితి. ఈ కథను ఓవైపు ప్రెజెంట్ లో.. మరోవైపు గతంలో జరుగుతున్నట్లుగా చూపించే ప్రయత్నం చేశాడు. దీంతో చూసే ప్రేక్షకులలో కొంచం కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యిందని చెప్పాలి.
ఈ సినిమాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి తీసుకెళ్తూ మొదలుపెట్టాడు డైరెక్టర్. కానీ.. సినిమా నడుస్తున్నంత సేపు చాలా లాజిక్స్ మిస్ చేస్తున్నట్లు.. ఎన్నో డౌట్స్ కలుగుతుంటాయి. అంటే.. ఓ పాయింట్ ని లేవనెత్తినప్పుడు దానికి సరైన ముగింపు కూడా ఇవ్వాలనేది బేసిక్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం. హిడింబలో కావాల్సినవి అన్ని ఉన్నప్పటికీ.. అక్కడక్కడా లాజిక్స్ అందని సీన్స్ జరిగిపోతుంటాయి. వెరసి.. వాటికీ సరైన ముగింపు లేకుండా మూవీ సాగడం మైనస్. ఇందులో బోయ ముఠాని.. వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ బాగున్నాయి. కానీ.. హీరో హీరోయిన్స్ కి ఆల్రెడీ పోలీస్ ట్రైనింగ్ లో లవ్ ట్రాక్ పెట్టడం పెద్దగా ఎక్కదు.
వరుసగా కిడ్నాపులు.. రెడ్ డ్రెస్.. ఆపరేషన్ రెడ్.. కిడ్నాప్ ల వెనుక ముఠాల బ్యాక్ డ్రాప్ బాగుంది. కానీ.. వేగంగా మొదలైన సినిమా.. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్లడం మైనస్. కొత్త పాయింట్ ఎంచుకున్న డైరెక్టర్.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. అదే తడబాటు సినిమా చూస్తున్న ప్రేక్షకులలో కూడా కలుగుతుంది. ఎందుకంటే.. ఇందులో కథ ముందుకు, వెనక్కి వెళ్తున్న ఫీల్ వస్తుంది. డైరెక్టర్ బహుశా థ్రిల్ కి గురి చేయొచ్చని ఆ మార్గం తీసుకున్నాడేమో.. కానీ.. తెరపైకి వచ్చేసరికి కాస్త బెడిసి కొట్టిందని చెప్పాలి. అరే ఇక్కడ బాగుంది.. అని కనెక్ట్ అయ్యేలోపు మళ్లీ కొత్త చిక్కులు.. లాజిక్ మిస్సింగ్స్.. అదేంటో సినిమాలో పోలీసులకు క్లూస్ ఈజీగా దొరికేస్తుంటాయి.
ఆ విషయంలో కొంచం గ్రాంటెడ్ గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే.. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే.. హిడింబ ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్.. బోయ ముఠా.. ఇంటర్వెల్ బ్యాంగ్.. ప్రీ క్లైమాక్స్ లతో నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ ట్విస్టు.. థ్రిల్ కి గురి చేయడం ఖాయం. మిగతా సినిమా అంతా ఓకే. ఇక సినిమాలో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. సాంగ్స్ పెద్దగా ఎక్కవు. ఆహారం కోసం మనుషుల్ని తినే హిడింబల కంటే.. అత్యాశతో అవయవాలను అమ్ముకునే వారే హానికరం అనే డైలాగ్ బాగుంది. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక పోలీస్ ఆఫీసర్ రోల్ లో అశ్విన్ మెప్పిస్తాడు. చాలా మెచ్యూర్ గానే కాకుండా తన బాడీ మేకోవర్ కూడా ఆకట్టుకుంటుంది. ఆద్య రోల్ లో నందిత ఓకే. ఇక మిగతా నటినటులంతా వారి పరిధిమేరా నటించారు.
(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)