iDreamPost

800 మూవీ రివ్యూ!

800 మూవీ రివ్యూ!

క్రికెట్ చరిత్రలో శ్రీలంక ప్రస్థానం ఊహకి అందనిది. ఓ పసికూనగా మొదలైన ఆ జట్టు, ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ అతి తక్కువ కాలంలోనే ప్రపంచ విజేతగా నిలిచింది. అలాంటి దేశం అందించిన లెజండ్రీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆ క్రికెటర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “800”. ఎం.ఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మురళీధరన్ గా మధుర్ మిట్టల్ నటించారు. మరి.. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

800 మూవీ కంప్లీట్ గా ముత్తయ్య లైఫ్ లో ఉన్న కష్టాలు, విజయాలు చుట్టే తిరిగింది. 19వ దశకం ప్రథమార్ధంలో ఎక్కువ మంది తమిళులు శ్రీలంక టీ తోటల్లో వలస కూలీలలుగా పోతారు. అలా.. మురళీ తాత, నాయనమ్మ కూడా శ్రీలంకకి కూలీలుగా చేరుకుంటారు. మురళీధరన్ కూడా అక్కడే జన్మిస్తారు. సింహళీయులకి, తమిళలకు మధ్య జరిగే గొడవల్లో మురళీ కుటుంబం ఆస్తులు కోల్పోతుంది. దీంతో.. మురళీ ఒక చర్చ్ ఫాథర్ నడిపే స్కూల్ చదువుకోవాల్సి వస్తుంది. అక్కడే అతనికి క్రికెట్ తో పరిచయం అవుతుంది. తమిళుడు అనే కారణంగా మురళీధరన్ చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి స్థితి నుండి శ్రీలంక దేశం గర్వించే స్థాయిలో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్స్ ఎలా పడగొట్టాడు? ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు అన్నదే ఈ మూవీ కథ.

విశ్లేషణ:

క్రికెట్ రికార్డు పుటలను తిరగేసి చూస్తే ముత్తయ్య మురళీధరన్ ఎంతటి విలువైన ఆటగాడో అర్థం అవుతుంది. కానీ.., అన్ని విజయాలు సాధించడానికి, అంతటి శిఖరాన్ని చేజారడానికి మురళీధరన్ చేసిన ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. లంకలోని అంతర్యుద్ధం కారణంగా చిన్న తనంలోనే ఎన్నో అవమానాలు, ఆ తరువాత టీమ్ లో ప్లేస్ సాధించడానికి ఎన్నో అవస్థలు, టీమ్ లో కుదురుకున్నాక బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు, తన నిజాయతీని ప్రూవ్ చేసుకోవడానికి ఐసీసీ ముందు పరీక్షలు, ఇలా మురళీ జీవితం అంతా కదుపులతోనే సాగింది. 800 మూవీలో ఉన్నది కూడా ఇదే. నిజానికి ఒక బయోపిక్ కు ఇంతకు మించిన లేయర్స్, కాంఫ్లిక్ట్స్ అవసరం లేదు. కానీ.., ఆ మూమెంట్స్ ని దర్శకుడు ఎంత అద్భుతంగా తెరకెక్కించాడు అన్నదే ఆ సినిమా స్థాయిని సెట్ చేస్తుంది. 800 మూవీలో ఆ ప్రెజంటేషన్ చాలా సాధారణ స్థాయిలో ఉండటం నిరుత్సాహపరిచే అంశం.

మురళీ స్పిన్ బౌలర్ గా మారే విధానం, ఆ తరువాత తొలిసారి టీమ్ లోకి సెలక్ట్ అయ్యే సమయం, కెప్టెన్ రణతుంగతో పరిచయం, శ్రీలంక టీమ్ వరల్డ్ కప్ గెలిచే సన్నివేశాలు, మురళీ కోసం రణతుంగ అంపైర్ కి వార్నింగ్ ఇవ్వడం, లంక టీమ్ మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ నుండి బయటకి వచ్చేయడం, ఆ తరువాత మురళీ ఓ లెజండ్ గా ఎదగడం, ఎల్.టి.టి.ఈ చీఫ్ ప్రభాకరన్ తో ఇంటరాక్షన్, చివరగా 800 వికెట్ సాధించడం ఇవన్నీ కూడా స్క్రీన్ పై ఇలా వస్తూ, అలా పోతుంటాయి తప్ప.. ఆడియన్ కి ఎక్కడా బలమైన ఇంప్యాక్ట్ ఇవ్వవు. ముత్తయ్య జీవితాన్ని బయోపిక్ గా తీసుకుని రావడంలో దర్శకుడు శ్రీపతి ఇక్కడే విఫలం అయ్యాడు. ఓ మంచి అనుభూతిని కల్పించతగ్గ సన్నివేశాలను కూడా శ్రీపతి రియలిస్టిక్ మోడ్ లో సాధారణంగా లాగించేశారు. బయోపిక్ జానర్ కి ఈ రియాలిటీ టచ్ అనేది కథలో అవసరం అయినా.., ప్రెజంటేషన్ లో మాత్రం కాస్త సినిమాటిక్ లిబరిటీ తీసుకోవాలి. లేకుంటే మొదటికి మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. 800 మూవీలో జరిగిన పొరపాటు ఇదే. ఇక ఇది మురళీ లైఫ్ స్టోరీ కాబట్టి కథ గురించి విశ్లేషించుకోవడం అనవసరం.

 

నటీనటుల పనితీరు:

800 మూవీలో జరిగిన అతి పెద్ద మ్యాజిక్.. మురళీధరన్ గా మధుర్ మిట్టల్ నటించడం. మురళీధరన్ స్వయంగా తానే తన బయోపిక్ లో నటించాడా అన్నంత అనుమానం కలిగేలా మధుర్ మిట్టల్ స్క్రీన్ ప్రెజన్స్, నటన సాగింది. ఇక హీరోయిన్ మహిమా నంబియార్
పాత్రకి అంతటి స్కోప్ లేదు. ఇందులో మధుర్ మిట్టల్ తరువాత గుర్తుండి పోయేలా నటించింది మాత్రం సీనియర్ నటుడు నాజర్. ఇంతకు మించి ఇందులో గుర్తుంచుకో తగ్గ పాత్రలు లేవు. కానీ.., కపిల్ దేవ్, రణతుంగ, డిసిల్వా, సంగాక్కర క్యారెక్టర్స్ పోషించిన నటులు మాత్రం ఆయా క్రికెటర్స్ ని గుర్తు చేసే విధంగా నటించి మెప్పించారు.

టెక్నీకల్ విభాగం:

800 మూవీ మేకింగ్ లో ఎక్కువ కష్టం కెమెరా మేన్ ఆర్.డి. రాజశేఖర్ ది. తెలుగులో “ఘర్షణ, హ్యాపీ, వరుడు” వంటి కొన్ని సినిమాలు తీసిన ఈయన ఈ మధ్య కాలంలో కేవలం కోలీవుడ్ కే పరిమితం అయిపోయారు. అయితే.., ఇన్నాళ్ల తరువాత కూడా ఆయన వర్క్ లో ఆ స్పార్క్ తగ్గలేదు అని చెప్పుకోవడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. 90ల నాటి పరిస్థితులను సరిగ్గా క్యాప్చర్ చేసిన ఆర్.డి. రాజశేఖర్, మ్యాచ్ విజువల్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్త వహించారు. ఇక జిబ్రాన్ మ్యూజిక్ లో మెరుపులు ఉన్నా.. వాటిని సరిగ్గా వాడుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సీనియర్ ఎడిటర్ ప్రవీణ్ ఇంకాస్త షార్ప్ గా అలోచించి ఉంటే బాగుండేది. అయితే.., అన్నిటికీ మించి నిర్మాణ విలువలు అదిరిపోయాయి. నిర్మాతలు మాత్రం ఓ ఫ్యాషన్ తోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టు అర్థం అవుతోంది.

బలాలు:

  • కథ
  • మధుర్ మిట్టల్ నటన
  • మధుర్ మిట్టల్ లుక్

బలహీనతలు:

  • దర్శకత్వం
  • నిడివి
  • ఎడిటింగ్
  • నిధానంగా సాగే కథనం

రేటింగ్: 2.25/5

చివరి మాట: 800.. క్రికెట్ లవర్స్ కి మాత్రమే

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి