iDreamPost

టీడీపీకి షాక్‌.. జగన్‌ను కలవనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

టీడీపీకి షాక్‌.. జగన్‌ను కలవనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగలబోతోంది. రేపు ఉదయం మహానాడు ప్రారంభం కాబోతుండగా ఈ రోజు సాయంత్రం టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీకానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించేందుకు 63 రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబుకు మొదటి రోజే అనుకొని దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్ధాళి గిరి, కరణం బలరాంలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా వారు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరతారనే ప్రచారం కొద్ది కాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు ఈ రోజు విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో కలసి సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ కానున్నారు. ఇప్పటికే సాంబశివరావు ఒంగోలులో మంత్రి బాలినేనితో మంతనాలు జరుపుతున్నారు.

ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 12 స్థానాలకు గాను టీడీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఆయన అధికారికంగా పార్టీలో చేరకపోయినా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తన కుమారుడు కరణం వెంకటేష్‌కు వైఎస్‌ జగన్‌తో కండువా కప్పించారు. తాజాగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ఈ రోజు వైసీపీ అధినేతను కలవబోతున్నారు.

సాంబశివరావు 2014లో తొలిసారి పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరావుపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి భవిష్యత్‌ లేదన్న అంచనాకొచ్చిన సాంబశివరావు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత దగ్గుబాటి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సతీమణి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్న రావి రామనాథం బాబుకు నామినేటెడ్‌ పోస్టు దక్కింది. ఈ నేపథ్యంలో పర్చూరులో ఏలూరికి వర్గపోరు ఉండదని చెప్పవచ్చు.

కరణం, ఏలూరి అధికార పార్టీకి దగ్గరైతే.. ఇక ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిలు మాత్రమే టీడీపీకి మిగులుతారు. గొట్టిపాటి రవికుమార్‌ 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లారు. రవి పార్టీలో చేరేందుకు యత్నిస్తున్నా.. అవకాశం దక్కడంలేదని సమాచారం. కొండపి ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున కొండపి నుంచి పోటీ చేసిన మాదాసి వెంకయ్యకు వైఎస్‌ జగన్‌ ప్రకాశం డీసీసీబీ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ఒకవేళ డోలా బాలవీరాంజనేయ స్వామి వైసీపీలో చేరినా.. కొండపిలో కూడా వర్గపోరు లేనట్లే.

గుంటూరు జిల్లా రేపల్లె లో అనగాని బల్వంతరావు మనవడిగా అనగాని సత్యప్రసాద్‌ నియోజకవర్గంలో పట్టు సంపాధించారు. పోటీ చేసిన మొదటి సారి 2009లో ఓటమిపాలైనా.. 2014, 2019లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో సినీ నటులు సమంత, సుమలతలు అనగానికి మద్ధతుగా ప్రకటనలు చేశారు. ఒకానొక దశలో సుమలత సహాయంతో అనగాని బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా సాగింది. అయితే రాష్ట్రంలో వైసీపీ పాలన, సీఎం జగన్‌ విశ్వసనీయత వల్ల ఆ పార్టీలో చేరితే మంచి భవిష్యత్‌ ఉంటుందనే అంచనాకు సత్యప్రసాద్‌ వచ్చినట్లు సమాచారం.

రేపల్లె అనగానిపై పోటీ చేసి ఓటమిపాలైన మోపీదేవి వెంకటరమణ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు. మండలి రద్దు నేపథ్యంలో ఆయన్ను రాజ్యసభకు పంపారు. ఇప్పటికే ఆయన రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. ఇలాంటి పరిసితుల్లో అనగాని సత్యప్రసాద్‌ వైసీపీలో చేరడం వల్ల రాబోవు ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం రేపల్లెలో వర్గపోరు ఏ మాత్రం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆరేళ్లపాటు ఎంపీగా మోపీదేవి కొనసాగనుండడంతో ఆయన పదవీకాలం 2026 వరకూ ఉంటుంది. ఏపీలో 2024లో ఏప్రిల్‌లోనే శాసన సభ ఎన్నికలు జరుగుతాయి.

అనగాని సత్యప్రసాద్‌ వైసీపీకి దగ్గరైతే.. గుంటూరు జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుంది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ కేవలం రెండు సీట్లనే గెలుచుకుంది. ఇప్పటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరి అధికార పార్టీకి చేరువవగా.. తాజాగా సత్య ప్రసాద్‌ ఆ బాటలో నడవబోతున్నారు. ఫలితంగా టీడీపీకి జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది.

గత ఎన్నికల్లో వైసీపీ కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేయడంతో ఆయా జిల్లాలో టీడీపీ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఇప్పుడు ఆయా జిల్లాల సరసన గుంటూరు కూడా చేరబోతోంది.  

కాగా, పార్టీ మార్పుపై ఓ వైపు ఇలాంటి ప్రచారం జరుగుతుండగా.. తాను పార్టీ మారడం లేదంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌ చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి