iDreamPost

జియో ఎయిర్ ఫైబర్ సేవలు షురూ.. ప్లాన్లు, ఫీచర్లు ఇవే..!

  • Author singhj Published - 04:25 PM, Tue - 19 September 23
  • Author singhj Published - 04:25 PM, Tue - 19 September 23
జియో ఎయిర్ ఫైబర్ సేవలు షురూ.. ప్లాన్లు, ఫీచర్లు ఇవే..!

రిలయన్స్ జియో నుంచి మరో ఆసక్తికరమైన ప్రాడక్ట్ వచ్చేసింది. టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఎయిర్​ఫైబర్ ఈ రోజు విడుదలైంది. వినాయక చవితి సందర్భంగా ఈ ప్రాడక్ట్​ను మార్కెట్​లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఆగస్టు 28న జరిగిన 46వ యానువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)లో ప్రకటించింది. అప్పటి నుంచి టెక్ లవర్స్​లో దీని మీద ఆసక్తి నెలకొంది. జియో ఎయిర్ ఫైబర్ అనేది 5జీ ఆధారిత వైర్​లెస్ సర్వీస్. అత్యంత వేగంతో ఇది ఇంటర్నెట్​ను అందిస్తుంది. ఇల్లు, వ్యాపార అవసరాలకు కావాల్సిన ఇంటర్నెట్​ కోసం దీన్ని వినియోగించుకోవచ్చు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా వైర్ ఆధారిత బ్రాడ్​బ్యాండ్ ప్రొవైడర్లు ఉన్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్​ వాడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగానే ఎయిర్ ఫైబర్​ను జియో తీసుకొచ్చింది. ఇది కేబుల్స్, వైర్స్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఈ డివైజ్​ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా సమీపంలోని టవర్ నుంచి సిగ్నల్స్ అందుకొని ఇంటర్నెట్​ను అందిస్తుంది. అది కూడా బ్రాడ్​బ్యాండ్ కంటే కూడా ఎక్కువ వేగంతో. దీన్ని వైర్​లెస్ బ్రాడ్​బ్యాండ్ సర్వీస్​గా చెప్పొచ్చు. ఇంట్లో ఎన్ని డివైజ్​లను అయినా ఎయిర్ ఫైబర్​ను కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి హైదరాబాద్​తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్​కతా, ముంబై, ఫుణె సిటీల్లో జియో ఎయిర్ ఫైబర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దశల వారీగా దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు జియో తెలిపింది.

జియో ఎయిర్​ ఫైబర్ ప్లాన్ల విషయానికొస్తే.. రూ.599 ప్లాన్ కింద 30 ఎంబీపీఎస్ స్పీడ్​ను ఇస్తారు. అలాగే డిస్నీ ప్లస్ హాట్​స్టార్, జీ5, సోనీలివ్, జియో సినిమా, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీ సబ్​స్క్రిప్షన్​లు ఉచితంగా లభిస్తాయి. రూ.899 ప్లాన్​లో 100 ఎంబీపీఎస్ స్పీడ్​ను ఇస్తారు. డిస్నీ ప్లస్ హాట్​స్టార్​తో పాటు సోనీలివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీలను ఫ్రీగా ఇస్తారు. అదే రూ.1,199 ప్లాన్ కింద అయితే 100 ఎంబీపీఎస్ స్పీడ్​నే ఇస్తారు. కానీ పైఓటీటీలతో పాటు అదనంగా నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్​స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

జియో ఎయిర్ ఫైబర్​లో మ్యాక్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. రూ.1,499 ప్లాన్ కింద 300 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్​ను అందిస్తారు. అలాగే నెట్​ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్​స్టార్​తో పాటు సోనీలివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీలు లభిస్తాయి. అదే రూ.2,499 ప్లాన్​కు అయితే 500 ఎంబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. నెట్​ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్​స్టార్, సోనీలివ్, జీ5, జియో సినిమా ఓటీటీ సబ్​స్క్రిప్షన్ లభిస్తుంది. మెగా ప్లాన్​గా రూ.3,999ను అందుబాటులో ఉంచారు. దీని కింద 1 జీబీపీఎస్ స్పీడుతో డేటాను అందిస్తారు. అలాగే పైన చెప్పిన ఓటీటీ సబ్​స్క్రిప్షన్​లు ఉచితంగా లభిస్తాయి.

జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు 6 నుంచి 12 నెలల సబ్​స్క్రిప్షన్​తో వస్తాయి. ప్లాన్ల ధరకు జీఎస్టీని అదనంగా కలుపుతారు. ఇన్​స్టాలేషన్ ఛార్జీల కింద రూ.1,000 అదనంగా చెల్లించాలి. వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఇన్​స్టాలేషన్ ఛార్జీ నుంచి మినహాయింపు లభిస్తుంది. జియో ఎయిర్ ఫైబర్​లో పలు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 1 జీబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైఫై 6 సపోర్ట్ సహా ఓటీటీ సబ్​స్క్రిప్షన్లను జియో అందిస్తోంది. దీంట్లో సెక్యూరిటీ ఫైర్​వాల్ కూడా ఉంది. ఈ డివైజ్​ను జియో ఎయిర్ ఫైబర్ యాప్ సాయంతో యూజర్లు నియంత్రించొచ్చు.

ఇదీ చదవండి: పవన్​కు పిచ్చి పరాకాష్టకు చేరింది: మంత్రి రోజా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి