iDreamPost

రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ గురించి తెలుసా..?

రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ గురించి తెలుసా..?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇటీవల క్షత్రియ, రెడ్డి, కమ్మ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఆయా కార్పొరేషన్లకు తాజాగా చైర్మన్, పాలక మండళ్లను నియమించారు. రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి సాగుతోంది. రెడ్డి సంఘాలను ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు, వివిధ రెడ్డి సంక్షేమ సంఘాల పేరుతో ప్రముఖ దేవాలయాల్లో సత్రాలు, ప్రముఖ నగరాల్లో విద్యార్థులకు హాస్టళ్లు నిర్వహిస్తున్న వారిలో ఎవరికి పదవి దక్కుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో.. వైసీపీ నేత, రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని చింతలచెరువు సత్యనారాయణ రెడ్డికి రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. దీంతో ఆయన ఎవరని ఆరా తీయడం మొదలు పెట్టాయి వైసీపీ శ్రేణులు.

ఎవరీ సత్యనారాయణ రెడ్డి..

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు (హెచ్‌ఎం పాడు) మండలం సీతారామపురం గ్రామానికి చెందిన చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి పారిశ్రామిక వేత్త . మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన సత్యానారాయణ రెడ్డి.. శ్రీ వెంకటేశ్వర ఏరో స్పేస్‌ కంపెనీ లిమిటెడ్‌ని 1998లో హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. ఏరో స్పేస్‌ యంత్రాలు, విడిపరికరాల తయారీలో ప్రముఖ సంస్థగా శ్రీ వెంకటేశ్వర ఏరో స్పేస్‌ సంస్థ పేరొందింది. ఏడాదికి వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ ఈ సంస్థ చేస్తోంది.

Also Read : నమ్ముకున్న వారికి న్యాయం ….. నామినేటెడ్ పదవులతో గోదావరి జిల్లాల నాయకుల్లో ఆనందం

రాజకీయ కుటుంబం..

సత్యనారాయణ రెడ్డి తండ్రి చింతలచెరువు వెంకటనారాయణ రెడ్డి ప్రధానోపాధ్యాడుగా పని చేశారు. ఉద్యోగ విమరణ తర్వాత.. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. స్వగ్రామం సీతారామపురం పంచాయతీ సర్పంచ్‌గా 2001లో ఎన్నికయ్యారు. వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్‌గా అత్యుత్తమంగా పని చేశారు. మొదటి దఫా సర్పంచ్‌ అయినప్పుడే.. సీతారామపురం పంచాయతీని జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దారు. నిర్మల్‌ గ్రామ్‌ పురస్కారంను అందుకున్నారు.

సత్యనారాయణ రెడ్డి, కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి వియ్యంకులు. సత్యానారాయణ రెడ్డి కుమార్తెను.. సాయి ప్రసాద్‌ రెడ్డి కుమారుడుకు ఇచ్చి గత ఏడాది వివాహం చేశారు. సత్యనారాయణ రెడ్డి మామ.. ఉడుమల లక్ష్మీ నారాయణ రెడ్డి వైసీపీ క్రమశిక్షణ కమిటీలో పని చేస్తున్నారు.

పార్టీకి వెన్నుదన్నుగా..

రోజు వారీ రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని సత్యనారాయణ రెడ్డి వైసీపీకి ఆది నుంచి బలమైన మద్ధతుదారుడుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర సమయంలోనూ, ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలోనూ కనిగిరి నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ వెన్నంటి ఉంటూ పనులు చక్కబెట్టారు. ఆది నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉన్న సత్యనారాయణ రెడ్డి 2014, 2019లలో కనిగిరి వైసీపీ టిక్కెట్‌ ఆశించారు.

అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కనిగిరి టిక్కెట్‌ 2014లో బీసీ – యాదవ సామాజికవర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో బుర్రా ఓడిపోయారు. 2014లో ఓడిపోయిన వారందరికీ మరో అవకాశం ఇచ్చిన జగన్‌.. కనిగిరిలోనూ అదే పంథాను కొనసాగించారు. ఈ సారి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ గెలిచారు. గత ఏడాది ఎమ్మెల్సీ ఆశానువాహుల్లోనూ సత్యనారాయణ రెడ్డి ఒకరు. రాజకీయ కుటుంబమైనా.. పార్టీకి ఆది నుంచి వెన్నుదన్నుగా ఉన్న సత్యానారాయణ రెడ్డికి సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతోనే సీఎం వైఎస్‌ జగన్‌.. ఆయనకు రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు.

Also Read : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి.. యువత లో జోష్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి