iDreamPost

వాళ్ళు అన్నారని కాదుగానీ..

వాళ్ళు అన్నారని కాదుగానీ..

‘‘పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే నారా చంద్రబాబునాయుడికి కార్యకర్తలు గుర్తుకు వస్తారు’’ ఇది ప్రత్యర్ధులు అనే మాటలు కాదండోయ్‌.. ఆయన సొంత పార్టీలోనుంచే నాయకుల నోటి నుంచి తరచు విన్పించే మాటే ఇది. గతంలో ఎంతో మంది ఇదే చెప్పారు.. మధ్యలోనూ పలువురు ఆవేదన చెందారు.. ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నారట ఆ పార్టీ నాయకులు. అందేంటి రాష్ట్ర కార్యవర్గంలో ఏకంగా 300 మందికి అవకాశం కల్పిస్తే అలా అనడమేంటి అన్నడౌటు మీకు సహజంగానే రావొచ్చు. కానీ దానికి కూడా చంద్రబాబునాయుడి టీడీపీ నాయకుల నుంచే వివరణ కూడా విన్పిస్తోందట.

2014లో టీడీపీ అధికారంలోకొచ్చింది. అప్పటి వరకు పార్టీని భుజాలపై మోసిన ఎంతో మంది కీలక నేతలు తమకు రాజకీయంగా ఏదైనా గుర్తింపు లభించేలా నామినేటెడ్‌ పోస్టులు అయినా వస్తాయేమోనని ఎంతో ఆశగా ఎదురు చూసారు. కానీ అయిదేళ్ళలోనూ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ మాటే చంద్రబాబు మార్చిపోయారు. చివరాకర్న దేవాలయ కమిటీలు, పలు సంస్థలకు బోర్డులను ఏర్పాటు చేస్తూ మమ అనిపించేసారు. దీంతో నామినేటెడ్‌ పదవులపై నమ్మకం పెట్టుకున్న పార్టీ కేడర్‌ డీలా పడిపోయింది. ఆ డీలాలోని ఎన్నికలకు వెళ్ళడం.. ఓడిపోవడం కూడా జరిగిపోయాయి.

2019 ఎన్నికల ఫలితాల తరువాత ఇప్పుడు పార్టీ కేడర్‌ చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందంటున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు అధికారం అనుభవించి, అంతా తామై నడుచుకున్న వాళ్ళంతా ఒకొక్కళ్ళుగా తమదారి తాము చూసేసుకున్నారు. ఇప్పుడు 2024 వరకు పార్టీని మోసేందుకు కార్యకర్తల అవసరం ఏర్పడింది. దీంతో జంబో కార్యవర్గాన్ని సృష్టించి 175 నియోజకవర్గాలకు గాను 300 మందికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించేసారు. ఇప్పుడు వీళ్ళంతా కష్టపడి పనిచేసి, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు అహర్నిశలు కృషి చేయాల్సి ఉంటుందన్నమాట.

ఇటీవలే 56 బీసీ కార్పొరేషన్లకు సీయం వైఎస్‌ జగన్‌ ఛైర్మన్‌లను, కార్యవర్గాన్ని ప్రకటించారు. వారికి కేబినెట్‌ స్థాయి హోదాతో జీతభత్యాలను కూడా ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో ఉలిక్కిపడ్డ టీడీపీ నాయకత్వ బృందం ఈ జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని తలంపు చేసినట్టుగా రాజకీయవర్గాల్లో టాక్‌ ముమ్మరంగా నడుస్తోంది. పార్టీ నుంచి జారిపోయేవాళ్ళను పట్టి ఉంచేందుకు రాష్ట్ర కార్యవర్గంలో పదవులను ఎరగా వేసారని చెప్పుకుంటున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ తరపున ఛైర్మన్‌లుగా నియమితులవ్వడం, ప్రతిపక్ష పార్టీకి చెందిన పార్టీ పదవుల్లో పదవులు పొందడానికి తేడాను గమనించలేని స్థాయిలో క్షేత్రస్థాయి కేడర్‌ ఇప్పుడు లేదన్న వాదన కూడా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ప్రయోగించిన జంబో కార్యవర్గం ఎటువంటి సత్ఫలితాలను టీడీపీకి చేకూర్చనుందో వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి