iDreamPost

విజయవాడలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్

విజయవాడలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్

ఆంధ్రప్రదేశ్ లో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా కరోనా కట్టడి సాధ్యపడటం లేదు. దీంతో అధికారులు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

ఇప్పటికే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న శ్రీకాకుళం,ఒంగోలు, అనంతపురంలో తిరిగి లాక్‌డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న విజయవాడలో కూడా లాక్‌డౌన్ విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే 1000కి పైగా కేసులు నిర్దారణ అయ్యాయి. దాంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించనున్నట్లు ఇంతియాజ్ తెలిపారు.

ఈ నెల 26 నుండి విజయవాడలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా 24,25 తేదీల్లోపే నిత్యావసర సరుకులను తెచ్చి పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా లాక్‌డౌన్ అమలు చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కేవలం మెడికల్ షాపులకు మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉందని ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.

ఒకవేళ కరోనా వ్యాప్తిలో పెరుగుదల లేదా తగ్గుదలను బట్టి లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. కాగా కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ1096 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. వీరిలో 507 మందికి వ్యాధి నుండి కోలుకోగా 549 మంది చికిత్స పొందుతున్నారు. 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి