iDreamPost

ఆర్‌బీకేలు.. అక్షయ పాత్రలు – వ్యవసాయానికే కాదు అంతకు మించి..!

ఆర్‌బీకేలు.. అక్షయ పాత్రలు – వ్యవసాయానికే కాదు అంతకు మించి..!

గ్రామీణ పరిపాలన, ఆర్థిక వ్యవస్థకు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) జోడు చక్రాలుగా మారనున్నాయి. సచివాలయంలో పరిపాలన, ప్రభుత్వ పథకాలు ఇప్పటికే అందిస్తుండగా త్వరలో రిజిస్ట్రేషన్లు, ఇసుక బుకింగ్‌ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మరో వైపు గ్రామ సచివాలయాలకు అనుంబంధంగా నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. పంటకు అవసరమైన విత్తనాల నుంచి పంట అమ్మకునే వరకూ ప్రతి అంశంపై ఆర్‌బీకేలు రైతులకుసేవలు అందించనున్నాయి.

తాజాగా ఆర్‌బీకేలలో పశువైద్యం కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్బీకేలోనే పశు వైద్యం, ఇన్యూరెన్స్, దాణా తదితర అన్ని సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన 9,884 మంది పశు వైద్యులను ప్రభుత్వం నియమించింది. వీరంతా సంబంధిత గ్రామ సచివాలయం పరిధిలోని పశువులకు వైద్యం, పాడి పరిశ్రమకు అవసరమైన సేవలు అందించనున్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పాడి పరిశ్రమపైనే 100 శాతం ఆధారపడి ఉంటుంది. ప్రతి రైతు వ్యవసాయం చేస్తూనే మరో వైపు పాడి పశువులను పెంచుకుంటారు. వ్యవసాయంలో పెట్టుబడి పెట్టుకుంటూ పోతుంటే.. నాలుగు లేదా ఆరు నెలలకు పంట చేతికి వచ్చినప్పుడే రైతు డబ్బులు కళ్లచూస్తారు. కానీ పాడిలో ఏ రోజుకారోజు లేదా ప్రతి పది రోజులకు సొమ్ములు చేతికి వస్తాయి. పొలంలో పండే పచ్చిగడ్డి, కొంత మేర ధానా కొనుగోలు చేస్తే సరిపోతోంది. పాడి పశువుల పెంపకంలో మానవ శ్రమే అధికం కానీ ఖర్చు తక్కువ. ఫలితంగా రైతులు నిత్యం ఆదాయం పొందుతారు. ఇది కుటుంబ ఖర్చులతోపాటు పంట పెట్టుబడులకు ఉపయోగిస్తారు. దాదాపు వ్యవసాయం చేసే ప్రతి రైతు పాడి పశువులను పెంచుతారు. కరువు, పంట నష్టపోయిన సమయాల్లో పాడి పశువులే రైతులకు వెన్ను దన్నుగా ఉంటాయి.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే చర్యలు చేపట్టడంతో రాబోయే రోజుల్లో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, పాడికి సంబంధించిన అన్ని సేవలు, వస్తువులు తమ గ్రామంలోనే దొరుకుతుండడంతో రైతులకు విలువైన సమయం ఆదా అవుతుంది. ఎరువులు, పురుగు మండులు, పశువుల ధాణా తెచ్చుకునేందుకు రవాణా ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. మొత్తం మీద ఆర్‌బీకేలు రైతుల పాలిట అక్షయ పాత్రలుగా మారనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి