iDreamPost

వారికి RBI గుడ్‌న్యూస్.. క్రెడిట్ హిస్టరీ లేకున్నా అప్పులు..

  • Published Aug 11, 2023 | 10:31 AMUpdated Aug 11, 2023 | 10:31 AM
  • Published Aug 11, 2023 | 10:31 AMUpdated Aug 11, 2023 | 10:31 AM
వారికి RBI గుడ్‌న్యూస్.. క్రెడిట్ హిస్టరీ లేకున్నా అప్పులు..

రైతులు, చిరు వ్యాపారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త చెప్పింది. అన్నదాతలు, చిరు వ్యాపారాలు చేసుకునే వారికి తొందరగా అప్పు మంజూరు చేసేలా సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం.. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమీక్ష నిర్ణయాలను ప్రకటిస్తున్న సమయంలోనే దీని గురించి కూడా వెల్లడించింది. ఈ సరికొత్త డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేకున్నా అప్పులు తీసుకునేందుకు ఈ ఇన్నోవేటివ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. క్రెడిట్‌ హిస్టరీ లేని రైతులు, చిరు వ్యాపారులు.. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఈజీగా అప్పులు పొందే అవకాశం ఉంటుందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

కిసాన్ క్రెడిట్ కార్డుపై రుణాలు ఇచ్చేందుకు.. ఇప్పటికే ఆర్‌బీఐ, ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద రైతులకు రుణాలు మంజూరు చేసే కార్యక్రమం నడుస్తోంది. దీని ఆధారంగానే కొత్త పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా రైతులు, డెయిరీ ఫార్మ్స్ నడిపే వారిలో ఎక్కువ మందికి క్రెడిట్ హిస్టరీ లేకపోవడంతో రుణం లభించడం కష్టంగా మారింది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ప్లాట్‌ ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. రుణాల్లో ఇదొక ఓఎన్‌డీసీ సృష్టి వంటిదని ఆర్బీఐ చెప్పుకొచ్చింది.

మంగళవారం నుంచి సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ.. గురువారం తన నిర్ణయాలను వెల్లడించింది. గతేడాది మే నుంచి ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. ఇప్పుడు వరుసగా మూడోసారి రెపో రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం అంచనాలను మాత్రం పెంచింది. దాంతో కూరగాయల ధరలు మరోసారి పెరుగుతాయని సామాన్యులు భయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి