iDreamPost

యస్‌ బ్యాంకుకు ఆర్థిక కష్టాలు… విత్‌డ్రాలపై ఆర్బీఐ ఆంక్షలు..

యస్‌ బ్యాంకుకు ఆర్థిక కష్టాలు… విత్‌డ్రాలపై ఆర్బీఐ ఆంక్షలు..

ప్రైవేటు రంగ యస్‌ బ్యాంకుకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పరిస్థితి మరింత దిగజారకముందే ఆర్బీఐ రంగంలోకి దిగింది. యస్‌ బ్యాంకు బోర్డును రద్దు చేసింది. యస్‌ బ్యాంకుపై మారటోరియం విధించింది. బ్యాంకు ఖాతాదారులు నెలలో గరీష్టంగా 50 వేలు మాత్రమే విత్‌ డ్రా చేసుకునేలా ఆంక్షలు విధించింది. ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌ఓ ప్రశాంత్‌ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.

ఎస్‌ బ్యాంకును ఎస్‌బీఐ సారథ్యంలోని పలు ఆర్థిక సంస్థల కన్సార్షియం కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ ఎస్‌ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇప్పటికే ఎల్‌ఐసీకి యస్‌ బ్యాంకులో 8 శాతం వాటా ఉంది. యస్‌ బ్యాంకును ఎస్‌బీఐ సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్‌ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో సదరు బ్యాంకు షేర్‌ ధర అమాంతం పెరిగింది. గురువారం బాంబే స్టాక్‌ ఎక్సైంజ్‌లో 25.77 శాతం పెరిగి బ్యాంకు షేరు 36.85 రూపాయలకు చేరుకోవడం విశేషం.

యస్‌ బ్యాంకు ప్రయాణం 16 ఏళ్లకే ముగుస్తోంది. 2004లో ముంబై కేంద్రంగా రాణా కపూర్, అశోక్‌ కపూర్‌లు యస్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు. 2018 నాటికి యస్‌ బ్యాంకు ఆస్తులు 3,01,390 కోట్లుగా ఉన్నాయి. 2019 జూలై – సెప్టెంబర్‌లో 629.09 కోట్ల నికర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం యస్‌ బ్యాంకులో 18,238 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి