iDreamPost

Ravi Teja మల్టీస్టారర్స్ వైపు రవితేజ చూపు  

Ravi Teja మల్టీస్టారర్స్ వైపు రవితేజ చూపు   

కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు ఎన్నో వేసిన రవితేజకు తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ లతో వచ్చిన ఇమేజ్ దెబ్బకు మళ్ళీ ఆ అవసరం పడలేదు. తనకంటూ స్వంతంగా మార్కెట్ తో పాటు ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. అయితే పలు సందర్భాల్లో మల్టీ స్టారర్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పటికీ మాస్ మహారాజా వాటి వైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. దర్శక రచయితలు సైతం తన కాంబోలో ఇంకో హీరోతో కలిపి వర్కౌట్ చేసే బలమైన ఎంటర్ టైనర్లు రాయలేకపోయారు. కానీ ఇప్పుడు రవితేజ మనసు మారినట్టు కనిపిస్తోంది. స్క్రిప్ట్ నచ్చితే చాలు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అంటున్నారు.

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య(ప్రచారంలో ఉన్న టైటిల్)లో తమ్ముడిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా సెట్లోకి అడుగు పెట్టలేదు కానీ ఈ నెలలోనే ఆ షెడ్యూల్ ఉండొచ్చు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలయ్య కాంబినేషన్ కూడా సాద్యమేనట. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా రూపొందబోయే సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ని రవితేజ కోసమే అనుకుంటున్నారట. ఆ మేరకు ప్రతిపాదన కూడా వెళ్లిందట. మరి మాస్ రాజా ఓకే చెప్పాడో లేదో ఇంకా తెలియదు. తనకు అనిల్ కాంబోలో ఆల్రెడీ రాజా ది గ్రేట్ లాంటి హిట్ ఉంది కాబట్టి ఛాన్స్ ని కొట్టిపారేయలేం.

ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ లో మల్టీ స్టారర్ల ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. అది సాధించిన విజయం చూసి సరైన కంటెంట్ తో కలవాలే కానీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు నమోదవుతాయో అర్థమయ్యింది. కాకపోతే రాజమౌళి స్థాయిలో ఆలోచించకపోయినా కనీసం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల టైపు లోనో చేసుకున్నా చాలు. మంచి విజయాలు దక్కుతాయి. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న ఈ ట్రెండ్ చిరంజీవి బాలకృష్ణల జెనరేషన్ మొదలయ్యాక తెలుగులో ఆగిపోయింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల తరహాలో ఇప్పటి హీరోలు కూడా కంటిన్యూగా కలిసి తెరమీద కనిపించే సంప్రదాయాన్ని కొనసాగించాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి