iDreamPost

సినిమాగా రాబోతున్న రతన్ టాటా జీవితం  

సినిమాగా రాబోతున్న రతన్ టాటా జీవితం  

సూర్య హీరోగా గత ఏడాది విడుదలైన సూర్య ఆకాశం నీ హద్దురా పేరుకి ఓటిటి రిలీజే కానీ దానికి దక్కిన పేరు ప్రశంసలు అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా చేశాయి. ముఖ్యంగా జాతీయ అవార్డు వచ్చిన తర్వాత దీని స్థాయి మరింత పెరిగింది. అంతకు ముందు గురు లాంటి స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ సూర్య మూవీతో వచ్చిన రేంజ్ వేరే లెవెల్. ఈ దర్శకురాలు సుధా కొంగర భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా బయోపిక్ ని తెరకెక్కించే పనుల్లో ఉన్నారని చెన్నై టాక్. టైటిల్ రోల్ సూర్యనే పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాంబో కోసం హోంబాలే ఫిలిమ్స్ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంది కానీ ఆపై అప్డేట్ లేదు.

రతన్ టాటా సామ్రాజ్యం ఇప్పుడు ఎన్ని వేల లక్షల కోట్లుగా కనిపించినా దాని వెనుక ఆయన స్వయంకృషి. పడిన కష్టాలు, చూసిన ఎత్తు పల్లాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి తనచేతికిచ్చిన మొక్కని ఒక మహావృక్షంగా మార్చడం వెనుక ఒక మహా యజ్ఞమే ఉంది. అదంతా తెరమీద చూపించాలనే సంకల్పం మంచిదే. గతంలో మణిరత్నం అభిషేక్ బచ్చన్ తో ధీరూబాయ్ అంబానీ కథను గురుగా తెరకెక్కించడం ప్రేక్షకులకు గుర్తే. అమోఘ విజయం సాధించకపోయినా ఆడియన్స్ మన్నన పొందిన గురు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో అంత క్యాస్టింగ్ తో ఒక బిజినెస్ లెజెండ్ కథను తీసే సాహసం ఎవరూ చేయలేదు. ఇప్పుడు సుధా కొంగర చేస్తే మటుకు అదో మైలురాయే

నిజానికి ఈ మధ్య కాలంలో బయోపిక్స్ జనానికి బోర్ కొట్టేస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పదే పదే ఒకేలా కథలను తిప్పి తిప్పి చెప్పడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ తప్పడం లేదు. డ్రామా లేకుండా ఒకే టెంప్లెట్ లో వస్తున్న వీటి తీరు ఫ్లాపులను ఇస్తోంది. ఆ మధ్య వచ్చిన శభాష్ మితు దీనికి మంచి ఉదాహరణ. హిందీ జెర్సీ డిజాస్టర్ అయ్యింది. తెలుగులో లక్ష్య, గని లాంటివి తేడా కొట్టాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తలైవికి ఆదరణ దక్కలేదు. ఇంత రిస్క్ ఉన్న బయోపిక్స్ లో రతన్ టాటా కథను సుధా ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారో వేచి చూడాలి. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ దీనికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతోందని తెలిసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి