iDreamPost

పల్టీ కొట్టిన మల్టీ స్టారర్ – Nostalgia

పల్టీ కొట్టిన మల్టీ స్టారర్ – Nostalgia

స్టార్ హీరో ఇమేజ్ మీద ఆధారపడి కమర్షియల్ సినిమా కొన్ని సూత్రాలకు అనుగుణంగా నడిచే మాట నిజమే అయినా మాస్ కి ఇలాంటివన్నీ నచ్చుతాయన్న గ్యారంటీ లేదు. తమను మెప్పించేలా కథాకథనాలు చెప్పకపోతే నిర్మొహమాటంగా తిప్పి కొడతారు. ఇక్కడ కాంబోలు అదనపు హంగులు ఏవీ పనిచేయవు. దానికి ఉదాహరణగా ‘రాముడొచ్చాడు’ చెప్పుకోవచ్చు. 1995. హలో బ్రదర్, ఘరానా బుల్లోడు తర్వాత నాగార్జునను ఊహించని పరాజయాలు పలకరించాయి. ‘క్రిమినల్’ యావరేజ్ దగ్గరే ఆగిపోగా క్రేజీగా వచ్చిన ‘వజ్రం’ దారుణంగా దెబ్బ తింది. ‘సిసింద్రీ’ విజయం ఊరట కలిగించినా కూడా అది మాస్టర్ అఖిల్ లాంచింగ్ మూవీ కావడంతో క్రెడిట్ పూర్తిగా దక్కలేదు.

ఆ టైంలో తోటపల్లి మధు ఇచ్చిన కథతో రూపొందిన సినిమానే రాముడొచ్చాడు. ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ సమయంలో మధు పనితనం దాని ఫలితం చూసిన నాగ్ కు ఆయన మీద మంచి గురి కుదిరింది. అందుకే ఈ స్టోరీతో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. కోటితో దశాబ్దం పైగా ఉన్న అనుబంధాన్ని ఏవో కారణాల వల్ల తెంచేసుకున్న రాజ్ కు సంగీత దర్శకుడిగా ఎక్కువ ప్రోత్సహించింది నాగార్జునే. దీనికి కూడా స్వరాలు సమకూర్చే బాధ్యతను అందించారు. సౌందర్య, రవళి హీరోయిన్లుగా సుహాసిని, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీహరి తదితరులు ఇతర తారాగణం. సూపర్ స్టార్ కృష్ణ ఇందులో ప్రత్యేక పాత్ర అని తెలియడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాగ్ కాంబోలో ఆయన చేసిన ‘వారసుడు’ అప్పటికే పెద్ద హిట్టు.

రెండు కుటుంబాల మధ్య పగలు ఊరిదాకా పాకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంటాయి. ఇవేవి తెలియని హీరో రామ్(నాగార్జున) పట్నం కాలేజీలో చదువుకుంటూ సుందరలక్ష్మి(సౌందర్య)ను ప్రేమించాక గ్రామానికి వచ్చినప్పుడు గతాన్ని తెలుసుకుంటాడు. అప్పటికే పెద్దరికం, ముద్దుల మేనల్లుడు, బలరామకృష్ణులు, కడప రెడ్డెమ్మ లాంటి ఎన్నో సినిమాల్లో చూసిన ఈ పగల ఫార్ములా ప్రేక్షకులకు చాలా రొటీన్ గా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ లో చనిపోయే కృష్ణ పాత్ర మైనస్ అయ్యింది. దీంతో 1996 ఏప్రిల్ 25న రిలీజైన రాముడొచ్చాడు నాగ్ కి మరో చేదు అనుభవం మిగిల్చింది. అదే రోజు విడుదలైన రజనీకాంత్ డబ్బింగ్ సినిమా ‘ముత్తు’ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్లను కొల్లగొట్టి ఆ వారం బాక్సాఫీస్ ని గెలిచేసింది

Also Read : ద్విపాత్రల్లో కొత్త పోకడ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి